హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో వింత పోకడలతో నిర్వహిస్తున్న ఓ పబ్ యజమానిని పోలీసులు అరెస్టు చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లోని జోరా అనే పబ్‌లో వన్య ప్రాణులను ప్రదర్శించి వినియోగదారులను ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే. జోరా పబ్ ను వినయ్‌ రెడ్డి అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడు. పబ్‌లో వన్య ప్రాణులను ప్రదర్శించిన ఘటనపై గానూ వినయ్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో జోరా పబ్ యజమానితోపాటు మేనేజర్ వరహాల నాయుడును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో మొత్తం ఏడుగురిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.


పబ్‌కి వన్య ప్రాణులను సరఫరా చేసిన హైదరాబాద్‌ పెట్స్‌ ప్రతినిధులను కూడా అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో మొత్తం ఏడుగురిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. పబ్ లోని వన్య ప్రాణులను జూకి తరలించారు.


నగరంలోని అన్ని పబ్ ల మాదిరిగా కాకుండా రొటీన్ కు భిన్నంగా పబ్ లో కొండ చిలువలు, తొండలు, పిల్లులు, కుక్కలను పెట్టి వినయ్ రెడ్డి పబ్ నిర్వహిస్తుండడంపై నెటిజన్లతో పాటు వన్యప్రాణి సంరక్షకులు ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అడవుల్లో ప్రశాంతంగా బతకాల్సిన వన్యప్రాణులను డీజే సౌండ్స్‌ మధ్య ఉంచి బెదరగొట్టే ప్రయత్నం చేశారు. క్లబ్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు విచారణ చేపట్టి.. పబ్ ఓనర్ వినయ్ రెడ్డితో పాటు మిగతావారిని కూడా అరెస్ట్ చేశారు. 


పబ్‌లో సరీసృపాలను చూసిన వన్యప్రాణి ప్రేమికుడైన అశిశ్ చౌదరి అనే నెటిజన్‌ ఐఏఎస్‌ అధికారి అరవింద్ కుమార్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్‌ చేయడంతో ఆయన పోలీసులను టాగ్‌ చేస్తూ రీట్వీట్‌ చేశారు. దీంతో జోరా పబ్‌ వ్యవహారం బయటికి వచ్చింది. పోలీసుల నుంచి సమాచారం అందుకున్న హైదరాబాద్ అటవీ అధికారులు సీన్‌లోకి వచ్చి పబ్‌ నిర్వాహకులు వినయ్‌ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అయితే తమకు అన్ని లైసెన్సులు ఉన్నాయనేది పబ్‌ యాజమాన్యం చెబుతోంది. పబ్‌కు వచ్చిన వారిపై సరీసృపాలు దాడి చేయకుండా వాటికి పలు ఇంజెక్షన్లు ఇచ్చినట్టు సమాచారం.


పబ్​లోకి వచ్చిన యువతీయువకులు ఆ వన్య ప్రాణులతో డ్యాన్స్ చేస్తూ చిత్ర విచిత్రంగా ప్రవర్తించారు. వాటితో ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వింత పోకడలను చూసిన ఆశిశ్ చౌదరి అనే నెటిజన్ ఆ కల్చర్ ను ఫోటోలు, వీడియోలు తీసి ట్విటర్ లో పోస్ట్ చేయడంతో అసలు విషయం బయటికి వచ్చింది. తాజాగా పబ్ నిర్వహకుడితో పాటు మేనేజర్ సహా మొత్తం ఏడుగురు కటకటాలపాలు అయ్యారు.