Hyderabad Crime News: హైదరాబాద్‌లో పనివాళ్లను, వంట మనుషులను పెట్టుుకునే వాళ్లు భయపడే ఘటన జరిగింది. అందులోనూ ఫుల్‌ సెక్యూర్డ్‌ అనుకునే గేటెడ్ కమ్యూనిటీలో జరిగిన హత్య అందర్నీ షేక్ చేస్తోంది. కిచెన్‌లోని వంట సామానులనే మారణాయుధాలుగా చేసుకొని దారుణానికి తెగబడ్డ వాళ్లు వంట మనుషులే కావడం మరింత ఆందోళన కలిగిస్తోంది. చివరకు ఇంట్లో తాపీగా స్నానం చేసి బట్టలు మార్చుకొని మృతురాలి స్కూటీలోనే జంప్ అయ్యారు నిందితులు. 

కూకుట్‌పల్లిలోని స్వాన్‌ లేక్ గేటెడ్‌ కమ్యూనిటీలో జరిగిన రేణు అగర్వాల్ హత్య కలకలం రేపుతోంది. పది రోజుల క్రితం ఇంట్లో వంటకు వచ్చిన వ్యక్తులే ఆమెను అత్యంత కిరాతకంగా హతమార్చి వెళ్లిపోయారు. రేణు అగర్వాల్ భర్త రాకేష్ అగర్వాల్. కుమారుడితో కలిసి ఫతేనగర్‌లో స్టీల్ షాప్ నడుపుతున్నారు. ఇద్దరూ ఇంట్లో లేని సమయంలో ఈ దారుణం జరిగింది. తల్లీకి పదే పదే ఫోన్‌లు చేసినా తీయడం లేదని వచ్చి చూసే సరికి ఇంటికి లాక్ చేసి ఉంది. సీసీటీవీ ఫుటేజ్ చూస్తే ఆమె బయటకు వెళ్లినట్టు కనిపించ లేదు. దీంతో తలుపులు పగలగొట్టి చూస్తే రక్తపు మడుగులో పడి ఉంది. దీంతో ఇంటికి కొత్తగా వచ్చిన వంట మనిషి హర్ష్‌ ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తేల్చారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

జార్ఖండ్‌కు చెందిన హర్ష పది రోజుల క్రితం అగర్వాల్ ఇంట్లో వంట మనిషిగా చేరాడు. ఇంట్లో తండ్రీ కుమారుడు షాప్‌నకు వెళ్లిపోయిన తర్వాత దారుణానికి పాల్పడ్డాడు. అతనికి రోషన్ అనే వ్యక్తి సహకరించినట్టు సీసీటీవీ ఫుటేజ్‌లో తెలుస్తోంది. అంతా ఇంటి నుంచి వెళ్లిపోయిన తర్వాత ఇద్దరూ ఆ ఇంట్లోకి ప్రవేశించినట్టు తేలింది. ముందు రేణును తాళ్లతో కట్టేశారు. ఇంట్లో డబ్బులు ఎక్కడ ఉన్నాయో చెప్పాలని చిత్రవధ చేశారు. ఎంతకూ ఆమె విషయం చెప్పకపోవడంతో కూరగాయలు కోసే కత్తితో మొదట ఆమె గొంతు కోశారు. తర్వాత తలపై కుక్కర్‌తో మోదారు. ఆమె చనిపోయిందని నిర్దారణ అయ్యాక ఇంట్లో నగదు బంగారం ఎక్కడెక్కడ ఉందో వెతికారు. 

ఇంట్లోని లాకర్‌ను తెరిచి నగదు, బంగారం సూట్‌కేసులో సర్దారు. రక్తంతో తడిసిన బట్టలను అక్కడే వదిలిపెట్టారు. నీట్‌గా స్నానం చేసి బట్టలు మార్చుకొని రేణుకు చెందిన స్కూటీ తాళం తీసుకొని, డబ్బులు, బంగారం ఉన్న సూట్‌కేస్‌తో బయటకు వచ్చారు. ఇంటికి తాళం వేసి స్కూటీలో పరారయ్యారు. ఈ హత్య చేసిన నిందితులు రేణు సొంత గ్రామానికి చెందిన వాళ్లే కావడం మరింత ఆందోళన కలిగించే అంశం.

రేణు కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్ తీసుకున్నారు. వారు ఎటు వెళ్లారనే విషయంపై ఆరా తీస్తున్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.