Telangana Latest News: తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సాదాబైనామాతో ఇబ్బంది పడుతున్న వారిని సమస్యల నుంచి బయటపడేసేందుకు అవకాశం కల్పిస్తోంది. ఈ మేరకు సాదాబైనామా క్రమబద్ధీకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది. తెల్లకాగితాలపై రాసుకున్న భూ ఒప్పందాల వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు క్రమబద్ధీకరణ చేసుకుంటే వారికి అధికారికంగా యాజమాన్య హక్కులు వస్తాయి. దీని వల్ల ప్రభుత్వ పథకాలు, బ్యాంకు రుణాలు లభిస్తాయి. 

ఎవరి భూములు క్రమబద్ధీకరిస్తారు

సాదాబైనామాలో ఉన్న అందరి భూములను క్రమబద్దీకరించరు. తెలంగాణ రెవెన్యూ వెల్లడించిన నోటిఫికేషన్ ప్రకారం 2020 అక్టోబర్‌12 నుంచి నెల రోజుల పాటు వచ్చిన దరఖాస్తులను మాత్రమే క్రమబద్ధీకరిస్తారు. భూభారతి చట్టంలోని సెక్షన్ -6 సబ్‌సెక్షన్ ప్రకారం మాత్రమే ప్రక్రియ చేపడతారు.  2 జూన్ 2024 నాటికి సాదాబైనామాలో పేర్కొన్న భూమి తమ ఆధీనంలోనే సాగు అవుతున్నట్టు ప్రూవ్ చేసుకోవాలి. అలాంటి భూములను మాత్రమే రెగ్యులరైజేషన్‌ కోసం పరిగణలోకి తీసుకుంటారు. కనీసం పన్నెండేళ్లకుపైగా ఆ భూమి సదరు రైతు ఆధీనంలో ఉండాలి. పైన చెప్పిన లెక్కల ప్రకారం చూస్తే తెలంగాణలో ఇలాంటి దరఖాస్తులు దాదాపు పదిలక్షల ఉంటాయని తెలుస్తోంది. వాటన్నింటికీ విముక్తి లభించనుంది. 

కోర్టు వివాదలతో పరిష్కారం కాని సమస్య

గత ప్రభుత్వం కూడా విభజనకు ముందు జరిగిన సాదాబైనామాల సమస్యలను పరిష్కరిస్తూ భూములను రెగ్యులరైజ్‌ చేసింది. రెండో విడత క్రమబద్ధీకరణకు చేసిన ప్రయత్నంలో న్యాయపరమైన చిక్కులు వచ్చి పడ్డాయి. 2020లో చేసిన ఆర్వోఆర్ చట్టం చేయడం అంతకంటే ముందు ఉన్న సాదాబైనామాలు పరిగణలోకి తీసుకోవడంతో వివాదం కోర్టుకు చేరింది. దీంతో మొత్తం ప్రక్రియను న్యాయస్థానం నిలిపేసింది. ఈ సమస్యను ఎలాంటి చిక్కులు లేకుండా పరిష్కరిస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అన్నట్టుగానే న్యాయనిపుణులతో చర్చించి వివాదానికి తెరదించింది రేవంత్ సర్కారు.   

విచారణ బాధ్యత ఆర్డీవోకు అప్పగింత 

ఆర్వోఆర్ -2020 స్థానంలో ఆర్వోఆర్‌ -2025 భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి కోర్టులో వివాదాన్ని పరిష్కరించింది. ప్రభుత్వ అభ్యర్థన మేరకు సాదాబైనామా సమస్య పరిష్కానికి కోర్టు అంగీకరించింది. కొత్త గా తీసుకొచ్చిన చట్టంలో సెక్షన్ -6 ప్రకారం 13-బీ ప్రొసీడింగ్స్‌ జారీ చేయడానికి ఓకే చెప్పింది. వివాదం పరిష్కారం కావడంతో రెవెన్యూ శాఖ క్రమబద్ధీకరణకు నోటిపికేషన్ జారీ చేసింది. సాదాబైనామా భూములు దరఖాస్తు చేసుకున్న వ్యక్తివేనని నిర్దారించేందుకు ఆర్డీవో విచారణ చేయాలి. ఈ విచారణ బాధ్యతను ఆర్డీవోకు ప్రభుత్వం అప్పగించింది.