Wings India Show 2024 : బేగంపేట విమానాశ్రయంలో వింగ్స్ ఇండియా ప్రదర్శనకు సర్వం సిద్ధమైంది. ఈ ప్రదర్శనను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించనున్నారు. 106 దేశాలకు చెందిన 1500 మంది ప్రతినిధులు పాల్గొంటారు. కేంద్ర పౌరవిమానయాన శాఖ, ఎయిర్‌పోర్ట్ అథారిటీ, ఫిక్కీ ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నారు.నాలుగు రోజుల పాటు దాదాపు 30 విమానాలు, హెలికాప్టర్లను ప్రదర్శించనున్నారు. 5వేల మందికిపైగా వ్యాపారవేత్తలు వింగ్స్ ఇండియాను సందర్శించి పలు ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. ఈ షోలో 130 ఎగ్జిబిట్‌లు అందుబాటులో ఉండనున్నాయి.
గతంలో రెండుసార్లు బేగంపేట విమానాశ్రయంలోనే ఈ ప్రదర్శనను నిర్వహించారు. హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ దేశీయంగా తయారు చేసిన హెలికాప్టర్లను వింగ్స్ ఇండియాలో ప్రదర్శిస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన బోయింగ్ 777X విమానాన్ని బేగంపేట విమానాశ్రయంలో ప్రదర్శనగా ఉంచారు. ఎయిర్ ఇండియాకు చెందిన ఏ350 విమానాన్ని ఆవిష్కరించనున్నారు. ఆసియాలోనే అతిపెద్ద ప్రదర్శనని నిర్వాహకులు చెబుతున్నారు.