Telangana Updates: రాజకీయాల్లో కనికరం ఉండదు. రాజకీయంగా శత్రువు దొరికితే అంతే. ఇది రాజుల కాలం నుంచి వస్తున్నదే. రక్త సంబంధికుడైనా సరే సింహాసనం కోసం పోటీలోకి వస్తే కనికరం లేకుండా ఖతం చేయాల్సిందే. అప్పుడు కత్తితో నిర్మూలిస్తే.. ఇవాళ రాజకీయ పార్టీలు తమ రాజకీయ శత్రువుల కోసం చట్టాన్ని ఉపయోగిస్తున్నాయి. ఇది దేశ రాజకీయాల్లో సామాన్య విషయంగా మారింది. ప్రత్యర్థులను లొంగదీసుకోవడానికి, రాజకీయంగా తమ దారికి తెచ్చుకోవడానికి, చివరకు రాజకీయ సమాధి కట్టడానికి చట్టపరంగా ఎలాంటి చర్యలకైనా సిద్ధమవుతున్నాయి పార్టీలు. అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ, బీఆర్‌ఎస్ అనుసరించిన తీరే నిదర్శనం. ఢిల్లీ నుంచి గల్లీ వరకు అన్ని చోట్ల ఇదే ట్రెండు నడుస్తోంది.
ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే ఆ నలుగురే టార్గెట్‌గా రాజకీయాలు సాగుతున్నాయా అన్నది ఇప్పుడు చర్చ. ఎందుకంటే కేసీఆర్ అనే మొక్కను మొలవనిచ్చేది లేదని బహిరంగంగానే సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. అంతకు ముందు అదే రేవంత్ రెడ్డిని అప్పటి సీఎం కేసీఆర్ ఓటుకు నోటు కేసులో జైలుకు పంపారు. ఇక ఇప్పుడు బంతి సీఎం రేవంత్ రెడ్డి చేతిలో ఉంది. ఈ ఆట ఎలా మారుతుందో మనం వేచి చూడాల్సిందే..
ఆ నలుగురే టార్గెట్టా...?
తెలంగాణలో రాజకీయంగా బీఆర్ఎస్‌ను, కేసీఆర్‌ను ఖతం చేయాలని రెండు జాతీయ పార్టీలు అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఈ రాజకీయ వైరం ఇప్పడు రాజకీయాల్లో సహజమైపోయింది. అయితే బీఆర్ఎస్‌లో ఆ నలుగురిపైనే అందరి దృష్టి. కేసీఆర్ కుటుంబ సభ్యులైన కేటీఆర్, హరీశ్ రావు, కవిత అన్ని పార్టీలకు ఓ పొలిటికల్ రైవలరీస్‌గా చెప్పాలి. అంటే ఆ నలుగురిని విమర్శిస్తే తప్ప బీఆర్ఎస్‌ను విమర్శించినట్లు కాదు. గులాబీ పార్టీలో టార్గెట్ నేతలు ఎవరైనా ఉన్నారంటే ఆ నలుగురే. అందుకే ప్రతీ రాజకీయ పార్టీ, రాజకీయ నేత ఆ నలుగురినే విమర్శిస్తుంటారు. ఆయా పార్టీలకు సైతం స్వేచ్చగా బీఆర్ఎస్ నుంచి కౌంటర్ ఎటాక్ చేసేది ఆ నలుగురే.
ఇప్పటికే బీజేపీ కవితను టార్గెట్ చేసి ఢిల్లీ మద్యం కుంభకోణంలో జైలుకు పంపింది. ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నా, ఈ కుంభకోణంలో కవిత పాత్ర ఎంత అన్నది కోర్టు తన తుది తీర్పు ద్వారా వెళ్లడించాల్సిందే. అప్పటి వరకు ఈ కేసులో కవిత నిందితురాలు అని మాత్రమే టెక్నికల్ గా చెప్పవచ్చు. ఒక వేళ అందులో కవిత పాత్ర ఉన్నా కోర్టులో నిరూపించకపోతే నిర్దోషిగా భావించాల్సిందే. దర్యాప్తు సంస్థలు ఆమెను దోషిగా నిరూపిస్తే శిక్ష అనుభవించాల్సిందే. ఏది ఏమైనా ఇది పొలిటికల్ టార్గెట్‌గా సాగిందన్న చర్చ మాత్రం సర్వత్రా నెలకొంది.
తర్వాత మాజీ మంత్రి హరీశ్ రావుపై ఇటీవలే ఫోన్ ట్యాంపిగ్ కేసు నమోదైంది. హరీశ్ రావు తన ఫోన్ ట్యాప్ చేయించారని సిద్దిపేటకు చెందిన కాంగ్రెస్ నేత కేసు పెట్టారు. అరెస్ట్ ఊహించిన హరీశ్‌రావు హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. అయితే ఈ కేసు దర్యాప్తు ఎలా సాగనుంది. ఈ కేసులో హరీశ్ రావు టార్గెట్‌గా ఏం జరగనుందన్నది మాత్రం తేలాల్సి ఉంది. అయితే ఇది కూడా రాజకీయంగా తనను దెబ్బకొట్టేందుకు రేవంత్ సర్కార్ పన్నుతున్న కుట్రగా హరీశ్ రావు ఖండిచారు. మున్ముందు ఆయన పాత్ర ఎంత ఉంది? ఈ కేసులో హరీశ్ రావును జైలుకు పంపేలా ప్రభుత్వ దర్యాప్తు సాగుతుందా? దీన్ని ట్రబుల్ షూటర్ హరీశ్ రావు ఎలా ఎదుర్కొంటారు? అన్నది మాత్రం వేచి చూడాలి.
నెక్ట్స్ టార్గెట్ కేటీఆరే !
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్. మాజీ మంత్రి. బీఆర్ఎస్‌లో నెంబర్ టూ. ఇప్పుడు కేటీఆర్ వంతు వచ్చింది. ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహరంలో అప్పుడు మంత్రిగా ఉన్న కేటీఆర్ పై విమర్శలు వచ్చాయి. 2023లో హుస్సెన్ సాగర్ తీరాన నిర్వహించిన ఈ రేసింగ్ కు సంబంధించి విదేశీ సంస్థకు 55 కోట్ల చెల్లించారన్నది ప్రధాన ఆరోపణ. ఇందులో కేటీఆర్ పాత్ర ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. క్యాబినెట్ అనుమతి లేకుండానే ఈ మొత్తం విదేశీ సంస్థకు అప్పనంగా చెల్లించారని కాంగ్రెస్ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అంతే కాకుండా ఓ విదేశీ సంస్థకు డబ్బులు చెల్లించాలంటే ఆర్బీఐ అనుమతి అవసరమని, అలాంటి ప్రోసీడింగ్స్ ఏవీ లేకుండా చెల్లింపులు జరిగాయని ఆరోపిస్తున్నారు. దీనిపై కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని సీఎం రేవంత్ రెడ్డితో పాటు, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బహిరంగ ప్రకటనలు చేస్తూనే ఉన్నారు.
Also Read: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
మాజీ మంత్రి కేటీఆర్ పై పాత్రపై దర్యాప్తుకు అంటే విచారణకు గవర్నర్ అనుమతి ఏసీబీ కోరింది. ఇటీవలే న్యాయ నిపుణుల సలహాతో గవర్నర్ కేటీఆర్ పై విచారణ చేసేందుకు అనుమతి ఇచ్చారు. ఈ విషయాన్ని క్యాబినెట్ సమావేశంలో సహచర మిత్రులకు సీఎం రేవంత్ చెప్పినట్లు సమాచారం. దీంతో కేటీఆర్ టార్గెట్‌గా రేవంత్ రెడ్డి పావులను కదిపినట్లు అర్థం అవుతుంది. అయితే తాను జైలుకు వెళ్లడానికి సిద్ధమని రెండు మూడు నెలలు ఉండటానికైనా సిద్ధం అని అక్కడ యోగా చేసి వస్తాని కేటీఆర్ చెప్పడం చూస్తే ఈ పరిణామాలకు సిద్ధపడినట్లు తెలుస్తోంది.
తర్వాతి బాంబు కేసీఆర్ పైననేనా..?
తెలంగాణలో పొలిటికల్ బాంబులు పెలతాయని ఇప్పటికే రేవంత్ సర్కార్‌లో కీలక మంత్రి అయిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఆ దిశగానే అటు హరీశ్ రావు, ఇటు కేటీఆర్ టార్గెట్‌గా రాజకీయాలు, కేసులు సాగుతున్నాయి. ఇక లాస్ట్ టార్గెట్ బీఆర్ఎస్ చీఫ్ కేసీఆరేనా అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. తనను ఓటుకు నోటు కేసులో జైలుకు పంపిన కేసీఆర్‌ను జైలుకు పంపుతానని రేవంత్ రెడ్డి బహిరంగంగానే సవాల్ చేశారు. ఆ దిశగా ఇప్పటికే గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలపై రేవంత్ రెడ్డి సర్కార్ సమీక్ష చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో అవతకవకలు, ధరణి పోర్టల్ ద్వారా భూముల కబ్జాలు జరిగాయని ఇలా పలు అంశాలపై నజర్ పెట్టి తీగ లాగుతోంది. ఇందులో కేసీఆర్ పాత్ర ఏం ఉందన్న అంశంపై కూపీ లాగుతున్నట్లు సెక్రటేరియట్ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్ హయాంలో చక్రం తిప్పిన అధికారులు ఈ విషయంలో ఇప్పటికే వణుకుతున్న పరిస్థితులు ఉన్నాయి.
కేటీఆర్ తర్వాత నెక్స్ట్ టార్గెట్ కేసీర్‌గానే రేవంత్ రెడ్డి సర్కార్ అడుగులు ఉంటాయని స్పష్టమవుతోంది. అయితే గత ప్రభుత్వంలో తీసుకున్న ఏ నిర్ణయాలను ప్రాతిపదికగా చేసుకోని కేసీఆర్ పై కేసులు పెట్టే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. అటు కవిత కేసు ఎన్డీఏ సర్కార్ చూస్తుంటే, హరీశ్ రావు, కేటీఆర్ టార్గెట్‌గా కాంగ్రెస్ సర్కార్ కేసులు పెడుతోంది. నెక్స్ట్ టార్గెట్ మాత్రం కేసీఆరే అన్న ప్రచారాన్ని కాంగ్రెస్ వర్గాలు ముందుకు తెస్తున్నాయి. తెలంగాణ రాజకీయాలను శాసించిన కేసీఆర్ రేవంత్ సర్కార్ వ్యూహాలకు ప్రతి వ్యూహం ఎలా పన్నుతారు. ఈ క్లిష్ట పరిస్థితి నుంచి ఎలా గట్టెక్కిస్తారన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
Also Read: కేటీఆర్ అవినీతిని ప్రజల ముందు పెట్టిన తర్వాతే అరెస్టు - రేవంత్ మాస్టర్ ప్లాన్ ?