వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో దర్యాప్తు వేగవంతం చేసిన సీబీఐ ఇప్పటికే భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేసి సంచలనం సృష్టించింది. వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా విచారణకు పిలవడం ఆసక్తిగా మారింది. అవసరమైతే ఆయన్ని కూడా అరెస్టు చేస్తామంటూ కోర్టుకి కూడా సీబీఐ చెప్పడంతో మరింత టెన్షన్ వాతావరణం నెలకొంది. 


వివేక హత్య కేసులో సాక్ష్యాలు ధ్వంసం చేయడంలో అవినాష్ రెడ్డి, తండ్రి భాస్కర్ రెడ్డి కీలక పాత్ర పోషించారని అనుమానిస్తోంది సీబీఐ. అందుకే రెండు రోజుల క్రితం భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసి కేసును మరో మలుపు తిప్పింది. కోర్టులో వివిధ పిటిషన్లపై విచారణ జరుగుతుండగానే భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకుంది. ఇప్పుడు అవినాష్ రెడ్డిని కూడా విచారణకు పిలవడంతో ఆయన్ని కూడా అరెస్టు చేస్తారనే ప్రచారం జోరందుకుంది. 


సోమవారం నాటకీయత 
అవినాష్ రెడ్డి విషయంలో సోమవారం నాటకీయ పరిణామాలు జరిగాయి. సోమవారం మూడు గంటలకు విచారణకు రావాలని అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది సీబీఐ. అయితే దీనిపై కోర్టుకు వెళ్లారు అవినాష్ రెడ్డి. తనకు విచారణలో అరెస్టు చేయకుండా బెయిల్ ఇవ్వాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. 


అవినాష్ రెడ్డి పిటిషన్‌ను విచారించిన హైకోర్టు... ఇరు పక్షాల వాదనలు విన్నది. ఈ సందర్భంగా వాదించిన సీబీఐ తరఫున న్యాయవాది... ఆయన ఎప్పుడూ విచారణకు సహకరించలేదని చెప్పారు. ఎప్పుడు విచారణకు పిలిచినా కోర్టుల్లో పిటిషన్లు వేసి దర్యాప్తునకు ఆటంకం కలిగిస్తున్నారని వివరించారు. అందుకే అవసరమైతే ఆయన్ని అరెస్టు చేయవచ్చని కూడా తెలిపింది. 


సీబీఐ వాదనలను అవినాష్ రెడ్డి తరఫున న్యాయవాది నిరంజన్ రెడ్డి తప్పుపట్టారు. రాజకీయ కారణాలతోనే దర్యాప్తు జరుగుతుందన్నారు. ఓ నిందితుడు ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా ఎలా విచారిస్తారని ప్రశ్నించారు. విచారణకు రమ్మని ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. ఒక నిందితుడి వాంగ్మూలం తప్ప అసలు అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా ఎలాంటి  సాక్ష్యాలు లేవని ఇప్పటి వరకు సీబీఐ వాటిని కోర్టుకు ఇవ్వలేదన్నారు. 


ఇరు వాదనలు విన్ని హైకోర్టు కేసు విచారణ మంగళవారానికి వాయిదా వేసింది. అప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సీబీఐకి తెలిపింది. విచారణ కూడా కోర్టు తీర్పు వచ్చిన తర్వాత కొనసాగించాలని పేర్కొంది. దీంతో సీబీఐ మంగళవారం మధ్యాహ్నం నాలుగు గంటలకు విచారణకు రావాలని అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. 


ఓ వైపు కోర్టు తీర్పు ఎలా ఉండబోతుందన్న ఉత్కంఠ ఉండగానే సీబీఐ విచారణలో ప్రశ్నించి అవినాష్‌ను వదిలేస్తారా లేకుంటే అరెస్టు చేస్తారా అనేది ఆసక్తిగా మారింది. మొత్తానికి ఇవాళ అందరి ఫోకస్ కోర్టు తీర్పుపై ఉంది. ఇవాల్టి కేసులో సునీత కూడా ఇంప్లీడ్ అవ్వడంతో ఆమె తరఫున వాదనలు కూడా కోర్టు వినబోతుంది. ఆమె ఎలాంటి వాదనలు వినిపించనున్నారు.. కోర్టులో కేసు ఇంకా ఏ మలుపు తిరగనుందో అన్న సస్పెన్స్ నెలకొంది. 


ఇప్పటికే ఈ కేసులో అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్‌ రెడ్డిని అరెస్టు చేసింది సీబీఐ. ఆయనికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రస్తుతం ఆయన చంచల్‌గూడ జైలులో ఉన్నారు.