తెలంగాణ వ్యాప్తంగా వరుణుడు ఉగ్రరూపం దాల్చడం, భారీ వర్షాలకు తోడు వాగులు ఉగ్రరూపం దాల్చడంతో అనేక గ్రామాల్లో రహాదారులపై ఊహించని విధ్వంసమే జరిగింది. వరదల తాకిడికి రహదారులు కొన్ని చోట్ల ఏకంగా కొట్టుకుపోయాయంటే పరిస్దితి ఏ స్దాయిలో ఉందో అర్దం చేసుకోవచ్చు. పంచాయితీ రాజ్ శాఖ పరిధిలో అనేక చోట్ల రహదారులు కుంగిపోవడం, భారీ గోతులు పడటం, పగిలిపోవడం జరిగింది.
రూ.374 కోట్ల నష్టం అంచనా
తాజాగా వరదలు, వర్షాల ప్రభావంతో పంచాయితీ రాజ్ శాఖ పరిధిలో రహదారులకు వాటిల్లిన నష్టం అక్షరాల 374 కోట్ల రూపాయలు. ఇదే విషయాన్ని తాజాగా ఆ శాఖ మంత్రి సీతక్కకు అధికారులు వివరించారు.ఈరోజు పంచాయితీరాజ్, ఇంజనీరింగ్ శాఖ అధికారులతో సమీక్షణ నిర్వహించిన మంత్రి సీతక్క రహాదారుల నష్టంపై వివరాలు సేకరించారు. రాష్ట్రవ్యాప్తంగాదెబ్బతిన్న రహదారుల పై ఆరా తీశారు. ముఖ్యంగా వరద తీవ్రత ఎక్కువగా ఉన్న కామారెడ్డి, మెదక్ ,సిద్దిపేట జిల్లాలలో రహాదారులకు జరిగిన నష్టం, ప్రభావంతో అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఇప్పటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా 1291 ప్రాంతాల్లో రహదారులు, కల్వర్టులు దెబ్బతిన్నట్లు అధికారులు మంత్రికి నివేదించారు. వీటి తాత్కాలిక మరమ్మత్తుల కోసం రూ.22.71 కోట్లు, శాశ్వత మరమ్మత్తుల కోసం రూ. 352 కోట్లు ఖర్చవుతుందని ప్రాధమిక అంచనా వేశారు. మొత్తంగా గ్రామీణ రహదారుల పునరుద్ధరణ కోసం రూ.374.71 కోట్లు రూపాయలు అవసరమని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా 22 గ్రామాలకు రాకపోకలు దెబ్బతినగా, వాటిలో 14 గ్రామాలకు తాత్కాలికంగా రహదారులను పునరుద్ధరించినట్లు ఆర్ అండ్ బి అధికారులు స్పష్టం చేశారు.
రహదారుల పునరుద్ధరణ పనులపై సర్కార్ ఫోకస్
వరదలు కాస్త తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ప్రజలకు రవాణా ఇబ్బందులు లేకుండా వీలైనంత త్వరగా రహదారుల పునరుద్ధరణ పనులు చేపట్టాలని మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు. రాకపోకలు పూర్తిగా దెబ్బతిన్న గ్రామాలకు యుద్ధ ప్రాతిపదికన రోడ్ల మరమ్మత్తులు చేపట్టాలనీ సూచించారు. వర్షాలకు తడిచి కూలే ప్రమాదం ఉన్న పంచాయతీరాజ్ భవనాలను తక్షణం ఖాళీ చేయించాలని, పంచాయతీరాజ్ ఇంజనీర్లు క్షేత్రస్థాయిలో ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, రాకపోకలకు సమస్యలు తలెత్తకుండా చర్యలు వేగంగా చేపట్టాలని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.
మంత్రి ఆదేశాల నేపధ్యంలో ఆర్ అండ్ బి అధికారులు రహదారుల మరమత్తులపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు ,పట్టణాలకు అనుసంధానమైన రోడ్లను యుధ్ద ప్రతీపధికన మరమత్తులు చేసేందుకు సిద్దమైయ్యారు. ఇప్పటికే అనేక గ్రామాల్లో వరద నీరు భారీగా చేరడంతోపాటు , రహాదారులపై ఉన్న బ్రిడ్జిలు కుంగిపోవడం వల్ల ఊరుదాటి రాలేని పరిస్దితి నెలకొంది. ఈ నేపథ్యంలో తాత్కాలికంగా అటువంటి గ్రామాలకు సాధ్యమైనంత వేగంగా రహదారుల పునరుద్దరణ చేట్టాలని అధికారుల భావించారు. ఊహించని వరదల వల్ల తెలంగాణలో రహాదారులకు భారీ నష్టమే వాటిల్లింది.
ఇప్పటికిప్పుడు పూర్తి స్దాయి నిధుల విడుదల ఆలస్యమైయ్యే అవకాశాలు ఉండటంతో తాత్కాలిక చర్యలపై ప్రత్యేక దృష్టి సారించారు అధికారులు. రాకపోకలు ఎక్కువగా ఉండే రహాదారులే మొదటి ప్రాతిపదికగా మరమత్తులు ఇప్పటికే చేపట్టారు. ఇదిలా ఉంటే తెలంగాణ వ్యాప్తంగా వరద నష్టాలపై శాఖలవారిగా మంత్రులు నివేదిక సేకరిస్తున్నారు. బాధితులను ఆదుకునేందుకు చేపట్టాల్సిన తక్షణ చర్యలపై ప్రత్యేక దృష్టి సారించారు.