Telangana New Ration Cards : తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వాళ్లకి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. సుదీర్ఘంగా సాగిన కేబినెట్ భేటీలో ఈ మేరకు మూడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ఈ రేషన్ కార్డుల జారీ ఒకటి. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో కొత్త రేషన్ కార్డులు ఇవ్వడంతోపాటు పేర్ల మార్పులు, కొత్త పేర్ల చేర్చడం వంటి చేసుకోవచ్చు.  


రేషన్ కార్డు కోసం ఏం కావాలి?


కొత్తగా రేషన్ కార్డు కావాల్సిన జంటల ఆధార్ కార్డులు అవసరం. ఆధార్ కార్డుతోపాటు మేరేజ్ సర్టిఫికేట్‌ కూడా అధికారులకు చూపించాలి. ఇలా కొత్త కార్డుల ఏర్పాటుతోపాటు పేర్లు చేర్చాలన్నా సరే వారికి సంబంధించిన ధ్రువీకరణ పత్రం అంటే ఆధార్ కార్డు కానీ, వాళ్ల బర్త్‌ సర్టిఫికేట్‌ కానీ ఉండాలి. ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలు, వాటి జిరాక్స్‌లతో మీ సేవా కేంద్రానికి వెళ్లి అప్లై చేసుకోవచ్చు.  


ప్రభుత్వ ప్రథకాలు నుంచి అన్నింటికీ రేషన్ కార్డు కీలకం కానుంది. చాలా ఏళ్ల నుంచి కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదు. అందుకే తెలంగాణలో చాలా మంది ఈ రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. గతంలో వివిధ కారణాలతో రేషన్ కార్డులు పొందలేకపోయిన వాళ్లు ఉన్నారు. కొత్తగా పెళ్లిళ్లు అయిన నిరుపేద జంటలు రేషన్ కార్డు కోసం వెయిట్ చేస్తున్నారు. అలాంటి వారంతా ఇదో అవకాశంగా భావిస్తున్నారు. 


ప్రజాపాలన దరఖాస్తులే ఆధారం!


ప్రజాపాలన సమయంలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగానే రేషన్ కార్డులకు అర్హులను ఖరారు చేయనున్నారు. ప్రజాపాలన తర్వాత కూడా చాలా మంది కొత్తగా పెళ్లి చేసుకున్నారు. వారికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది. రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఇంకా ఏమైనా కొత్త  విధానం తీసుకొస్తారో ఏం ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. మొన్నటికి మొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పిన వివరాలను బట్టి అయితే ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగానే రేషన్ కార్డులు జారీ చేస్తామన్నారు. 


తెలంగాణలో ప్రజలకు మూడు రకాల రేషన్ కార్డులు అందజేస్తున్నారు. ఒకటి అంత్యోదయ ఆహార భద్రత కార్డు (AFSC) రెండోది ఆహార భద్రత కార్డు (FSC), మూడోది అంత్యోదయ అన్న యోజన కార్డులు. మొదటి రకం కార్డుకు 6 కిలోల బియ్యం ఇస్తున్నారు. రెండో రకం కార్డుకు 10 కిలోల బియ్యం, అంత్యోదయ కార్డు ఉన్న వాళ్లకు 35 కిలోల బియ్యం ఇస్తున్నారు. 


అర్హులు ఎవరు?


కార్డుల జారీకి వార్షికాదాయాన్ని అర్హతగా తీసుకుంటున్నారు. ఈ కార్డులు అందరికీ ఇవ్వరు. ప్రజల ఆదాయ స్థాయిని బట్టి ఈ రేషన్ కార్డులు మంజూరు చేస్తారు. ఇప్పటి వరకు రెండు రకాల ఆదాయ పరిమితుల బట్టి ఈ కార్డులు మంజూరు చేసే వాళ్లు. అయితే ఇప్పుడు ఆ ఆదాయ పరిమితి పెంచుతారా, మార్పులు చేర్పులు చేస్తారా అనేది తేలాల్సి ఉంది. దీనిపై ఓ టీం గుజరాత్​, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్​ అమల్లో ఉన్న విధానాలు స్టడీ చేశారు. మార్పులు చేర్పులు చేస్తే ఎలా ఉండాలి అనేది స్టడీ చేశారు. 


ఇప్పటికే రూరల్‌లో రూ.1.50 లక్షలు, అర్బన్​ రూ.2 లక్షల్లోపు ఆదాయం కంటే తక్కువ ఆదాయం ఉన్నవాళ్లకు కార్డులు జారీ చేస్తు వచ్చారు. తరి భూమి అయితే 3.5 ఎకరాలు, మాగాణి అయితే 7.5 ఎకరాల్లోపు ఉంటే మాత్రమే కార్డు ఇచ్చే వాళ్లు. దాదాపు చిన్న చిన్న మార్పులతో ఇవే అర్హతలు ఖరారు చేయబోతున్నట్టు తెలుస్తోంది.