Hyderabad News | హైదరాబాద్: నగరంలోని కృష్ణానగర్ ప్రాంతంలో శనివారం ఒక అనూహ్య ఘటన చోటుచేసుకుంది. మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక నివాసంలో వాషింగ్ మెషిన్ ఒక్కసారిగా పేలిపోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇంట్లో బట్టలు ఉతకడానికి వాషింగ్ మేషిన్ ఆన్ చేసి ఉంచగా, అది రన్నింగ్‌లో ఉండగానే కొంత సమయానికి భారీ శబ్దంతో పేలిపోయింది.
ఈ పేలుడు ధాటికి వాషింగ్ మెషిన్ ముక్కలు ముక్కలుగా గాలిలోకి ఎగిరిపడింది. ఒక్కసారిగా సంభవించిన ఈ భారీ శబ్దానికి ఇంట్లోని కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. అయితే, అదృష్టవశాత్తు ఈ ప్రమాదం జరిగిన సమయంలో మెషిన్ పరిసరాల్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
పేలుడు తీవ్రత ఎంతలా ఉందంటే, వాషింగ్ మెషిన్ ముక్కలు పక్కనే ఉన్న ఫ్రిడ్జ్‌ను బలంగా ఢీకొట్టడంతో అది కూడా పూర్తిగా పాడైందని.. ఆస్తి నష్టం సంభవించిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సాంకేతిక లోపం వల్ల లేదా షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులను వినియోగించేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.