VRAs Adjustment in Telangana : నీరటి, మస్కూరు, లష్కర్ వంటి కాలంచెల్లిన పేర్లతో పిలువబడుతూ, భూస్వామ్య వ్యవస్థకు చిహ్నాలుగా మిగిలిన వీఆర్ఏ వ్యవస్థను శాశ్వతంగా రద్దు చేస్తూ సీఎం కేసీఆర్ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏలుగా పనిచేస్తున్న సిబ్బందిని రెవెన్యూ శాఖలో సూపర్ న్యూమరరీ పోస్టుల్లో క్రమబద్ధీకరించనున్నట్టు సీఎం తెలిపారు. విద్యార్హత ఆధారంగా విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ (VRA)లను 4 శాఖల్లో సర్దుబాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. పంచాయతీరాజ్‌, మిషన్‌ భగీరథ, నీటిపారుదల, పురపాలక శాఖలలో సర్దుబాటు  చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. గ్రామ రెవెన్యూ సహాయకులు (VRAs) క్రమబద్ధీకరణ, సర్దుబాటుపై సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులతో ఆదివారం సమీక్ష జరిపారు. 


61 ఏండ్లు పైబడిన వీఆర్ఏల వారసులకు కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు సీఎం నిర్ణయించారు. అదేవిధంగా 2 జూన్, 2014 అనంతరం 61 ఏండ్ల లోపు ఉండి ఏ కారణం చేతనైనా వీఆర్ఏ విధులు నిర్వహిస్తూ మరణించిన వీఆర్ఎ వారసులకు కూడా ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని సీఎం అన్నారు. కాగా, చనిపోయిన వీఆర్ఏల వారసుల వివరాలు, వారి విద్యార్హతలు త్వరలో సేకరించాలని అధికారులను వీఆర్ఏ జేఏసీ నేతలకు తెలిపారు. వీరికి కూడా నిబంధనలకు అనుసరించి అర్హతల మేరకు, ఆయా శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో సర్దుబాటు చేయాలన్నారు.


మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్  నేతృత్వంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం చేసిన సూచనల మేరకు ఆయా శాఖల్లో వీఆర్ఏల‌ను సర్దుబాటు చేస్తున్నారు. ముందుగా వివిధ శాఖల్లో ఎంతమేరకు సిబ్బంది అవసరముందన్న అంచనా వేసి, అర్హతల వారీగా వీఆర్‌ఏలను కేటాయిస్తున్నారు. ప్రధానంగా నీటిపారుదల శాఖలో 5,900 మందిని సర్దుబాటు చేయనున్నారు. దీనిపై నీటిపారుదల శాఖ నుంచి ఇప్పటికే లేఖ అందడంతో.. అందుకు సంబంధించిన నియామక పత్రాలను సిద్ధం చేయడంలో అధికారుల నిమగ్నమయ్యారు. వారిని ప్రాజెక్టుల కింద సహాయకులుగా, లస్కర్లుగా నియమించనున్నారు. సాగునీటి ప్రాజెక్టులు, కాల్వలు, తూములకు కాపలా కాస్తూ పంట పొలాలకు నీళ్లు అందేలా లస్కర్లు పనిచేయాల్సి ఉంటుంది. కాల్వల్లో పిచ్చి మొక్కలు తొలగించడం, గండ్లు పడితే ఉన్నతాధికారులకు తక్షణమే సమాచారం ఇవ్వడం వంటి విధులు నిర్వహిస్తారు. 


వీఆర్‌ఏల సర్దుబాటు, క్రమబద్ధీకరణలో భాగంగా మిషన్‌ భగీరథ, నీటిపారుదల శాఖలకు ఎక్కువ మందిని ఇవ్వాలని భావిస్తున్నారు. 23 వేల మంది వీఆర్‌ఏల్లో నీటిపారుదల శాఖకు 5,900 మందిని కేటాయించేందుకు రెవెన్యూ శాఖ సిద్ధమవుతోంది. ప్రస్తుతం 21,433 మంది విధుల్లో ఉండగా.. రెగ్యులరైజేషన్, సర్దుబాటు ప్రక్రియ పూర్తయ్యాక పేస్కేల్‌ కింద ఎంత మొత్తం చెల్లించాలనేది మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయిస్తుంది. 3వేల మందిని మిషన్‌ భగీరథలో నియమించాలని భావిస్తున్నారు. వీఆర్‌ఏలలో పీజీ, డిగ్రీ లాంటి ఉన్నత విద్య చదివిన వారు ఉన్నారని వీరిలో కొందర్ని రెవెన్యూ, పురపాలక, పంచాయతీరాజ్‌ శాఖల్లో సర్దుబాటు చేసే యోచనలో సర్కార్ ఉంది.


రాష్ట్రంలో 10,485 రెవెన్యూ గ్రామాలు ఉండగా, గ్రామానికి ఒక వీఆర్‌ఏని కొనసాగించేందుకు అవకాశం ఉంది. పెద్ద రెవెన్యూ గ్రామాలకు ఇద్దరు వీఆర్ఏలను కేటాయించునున్నారని తెలుస్తోంది. అయితే ఎన్నికలకు ముందు తీసుకుంటున్న నిర్ణయం కనుక తమకు కచ్చితంగా న్యాయం జరుగుతుందని వీఆర్ఏ లు భావిస్తున్నారు. తెలంగాణలో వీఆర్ఏల‌ను క్రమ‌బ‌ద్దీక‌రించాల‌ని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. వీరంతా రెవెన్యూ శాఖలో రూ.10,500 గౌరవ వేతనంపై తాత్కాలిక ఉద్యోగులుగా ఉన్నారు. వీరి క్రమబద్దీకరణ, సర్దుబాటు పూర్తి చేయడంతో పాటు తమ జీతాలు పెంచి న్యాయం చేస్తారని వీఆర్ఏలు ఆశగా ఎదురు చూస్తున్నారు. 


మిషన్ భగీరథ, పురపాలక, పంచాయతీరాజ్ శాఖలకూ కొందరిని కేటాయించేందుకున్న అవకాశాలను పరిశీలిస్తున్నారు. ఈ సంఖ్యపై స్పష్టత రావాల్సి ఉంది. మొత్తంగా ఇతర శాఖలకు వీఆర్‌ఏల బదలాయింపుపై స్పష్టత వచ్చాక ఒకేసారి క్రమబద్ధీకరణ, పేస్కేల్ ఉత్తర్వులను జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. లస్కర్ల నియామకంతో కొత్త ప్రాజెక్టుల నిర్వహణ మెరుగుపడే అవకాశాలున్నాయి. 
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial