Telangana CM Revanth Reddy | కొడంగల్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డిపై సొంత పార్టీ కాంగ్రెస్ లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రాజశేఖర్ సీఎం రేవంత్ రెడ్డిపై, ఆయన సోదరుడు తిరుపతి రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు భూములు ఇవ్వకపోతే కంపెనీ ఇంకొక దగ్గర పెట్టుకోవాలని సూచించారు. ఇక్కడే కంపెనీ పెడతా అనడానికి మీ తాత జాగిరి కాదు.. మీ తాతల జాగలు ఏమైనా ఉంటే అవి కంపెనీకి రాసివ్వండి అని తిరుపతి రెడ్డిపై ఘాటువ్యాఖ్యలు చేశారు.


లగచర్లలో అధికారులపై దాడి కలకలం


వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో కలెక్టర్, పోలీస్ ఉన్నతాధికారులపై గత వారం దాడి జరగడం కలకలం రేపింది. తెలంగాణ ప్రభుత్వం ఇది ప్రభుత్వాన్ని బలహీన పరిచేందుకు బీఆర్ఎస్ చేసిన కుట్రగా పోలీసులు చెబుతున్నారు. కాంగ్రెస్ నేతలు సైతం ఇది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేయించిన పనిగా ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో వికారాబాద్ జిల్లాలో తిరుపతిరెడ్డి దౌర్జన్యం, దాదగిరి కారణంగా కాంగ్రెస్ పార్టీ డ్యామేజ్ అవుతుందని రాజశేఖర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇలాగే చేస్తూ పోతే ప్రజలు వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని ఇంటికి పంపిస్తారు, కచ్చితంగా జరుగుతుందన్నారు.


కంపెనీలకు కావాల్సిన భూముల కోసం మూడు, నాలుగు తండాల మీద సీఎం రేవంత్ రెడ్డి తిరుపతిరెడ్డి చూపిస్తున్న ఆధిపత్యం, ఆక్రమణతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజనులు మొత్తం రోడ్డు మీదకి వస్తే కాంగ్రెస్ నేతలు రోడ్లపై తిరగలేరని వ్యాఖ్యానించారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కనుక ఆచితూచి వ్యవహరించాలని రాజశేఖర్ రెడ్డి సూచించారు. లేకపోతే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ మొహం పెట్టుకుని పోయి ప్రజలను ఓట్లు అడుగుతాం అన్నారు. 



Also Read: Ghost News: 2 నెలల్లో 30 మంది మృతి, గ్రామానికి దెయ్యం పట్టిందని వణికిపోతున్న ప్రజలు - వీడిన మిస్టరీ 


కొడంగల్ లో పార్టీ ఓడిపోతే సీఎం రేవంత్ పరిస్థితి ఎలా ఉంటది?


కొడంగల్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఓడిస్తే సీఎం రేవంత్ రెడ్డి పరువు ఏమైపోతది అన్నారు. ఇది ఇంటి సమస్య ఏమాత్రం కాదని, ఏమైనా సమస్య ఉంటే అన్నదమ్ములు కొట్టుకోండి, లేకపోతే ఏమైనా చేసుకోండి.. కానీ ప్రజల మీద దౌర్జన్యం చేస్తే కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందన్నారు. అలా పార్టీ నష్టపోతుంటే ఎవరూ చూస్తూ కూర్చోరు. మీరు మొన్న ఒక పార్టీ, నిన్న ఒక పార్టీలో.. ఈరోజు ఈ పార్టీలో, రేపు ఇంకో పార్టీలో ఉంటారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం సోదరుడు అని తిరుపతి రెడ్డి విషయంలో గమ్మున ఉంటే ఎలుక కోసం ఇల్లు మొత్తం తగలపెట్టినట్లు అయిదన్నారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు మరో చోట జరగకుండా చూసుకోవాలని సూచించారు. ఈ కేసులో ఏ1గా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, ఏ2గా సురేష్ ఉన్నారు. నరేందర్ రెడ్డిని పోలీసులు విచారిస్తుండగా, సురేష్ కోసం పోలీసులు సోమవారం లుకౌట్ నోటీసులు జారీ చేశారు.



Also Read: Lagacharla Incident: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామం, పరిగి డీఎస్పీపై ప్రభుత్వం చర్యలు