TS RTC MD VC Sajjanar: ఆర్టీసీ బస్సులో ప్రయాణం అంటే ప్రమాదానికి దూరం అని ప్రజలు నమ్మకంతో ఉంటారు. ఇది ఒకప్పటి మాట. తాజాగా వాహనాల సంఖ్య పెరగడం, ట్రాఫిక్ సమస్యలు ఎక్కువ అవ్వడంతో తరుచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఆర్టీసి బస్సులు కూడా ఓ కారణమవుతున్న సందర్భాలు ఉన్నాయి. దాంతో సొంత ఇంటిని చక్కదిద్దుకునే ప్రయత్నాలు మొదలు పెట్టింది తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (TS RTC). ఈ క్రమంలో త్వరలోనే తెలంగాణ ఆర్టీసీ యాక్సిడెంట్ ఫ్రీ కార్పొరేషన్‌గా మార్చేందుకు ప్రతీ ఒక్కరూ తమ వంతు ప్రయత్నం చేయాలని, ప్రమాదాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు రాష్ట్ర ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్.
హైదరాబాద్‌లోని జేబీఎస్ ప్రాంగణంలో సోమవారం టీఎస్ ఆర్టీసీ ఏప్రిల్ ఛాలెంజ్ ఫర్ ట్రైనింగ్ (టాక్ట్)ను శిక్షణను ఆయన ప్రారంభించారు ఎండీ సజ్జనార్. ఈ శిక్షణలో పాల్గొన్న రంగారెడ్డి రీజియన్ శిక్షకులను ఉద్దేశించి సజ్జనార్ మాట్లాడుతూ టాక్ట్‌లో భాగంగా ఏప్రిల్ నెలలో సంస్థలోని డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్స్ ఇలా వివిధ విభాగాల సిబ్బంది అందరికీ శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.
టీఎస్ ఆర్టీసీ రోడ్డు ప్రమాదాల రేటు
ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు సంస్థ అభివృద్ది దిశగా వెళ్లేందుకు సిబ్బంది అనుసరించాల్సిన అంశాలను వివరించడంతో పాటు ప్రమాద రహిత ఆస్టీసి తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ ట్రైనింగ్ ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రస్తుతం టీఎస్ ఆర్టీసీ రోడ్డు ప్రమాదాల రేటు (TS RTC Road Accident Rate) ప్రతి లక్ష కిలోమీటర్లకు 0.07 శాతంగా ఉందని, ఇది భారత దేశంలోనే ప్రజా రవాణా సంస్థలలో అతి తక్కువగా నమోదై ఉండటం మంచి పరిణామంగా భావించవచ్చు అన్నారు. మరింత రోడ్డు భద్రతా నిబంధనల్ని పాటిస్తూ ప్రమాదాల రేటును జీరో స్థాయికి తీసుకెళ్లాలని కోరారు సజ్జనార్.
నైపుణ్యాభివృద్ధిని పెంపొందించేందుకు ఒక వ్యూహం
''టాక్ట్ అంటే క్లిష్ట పరిస్థితుల్లో మంచి యుక్తి అని అర్థం. సంస్థ ఉన్న ఛాలెంజింగ్ పరిస్థితుల్లో సిబ్బందికి నైపుణ్యాభివృద్ధిని పెంపొందించేందుకు ఒక వ్యూహంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతోంది. ఈ శిక్షణ ద్వారా సిబ్బంది మెరుగైన ఫలితాలు తీసుకువస్తారనే నమ్మకం నాకు ఉందంటూనే, సిబ్బందిలో మరింత మంచి మార్పును తీసుకురావడానికి ఈ నైపుణ్యాభివృద్ధి శిక్షణ దోహదపడుతుందంటున్నారు ఆర్టీసీ ఎండీ.
డ్రైవర్లకు ప్రమాదాల నివారణకు తీసుకోవల్సిన జాగ్రత్తలపైనే కాకుండా సూపర్ వైజర్స్, అధికారులకు కూడా సంస్థ కార్యకలాపాల నిర్వహణలో చురుకుదనాన్ని, వేగవంతాన్ని పెంచడానికి సుశిక్షకులతో ఈ బోధన తరగతులును నిర్వహిస్తూ మంచి మార్పును తీసుకు రావడం జరుగుతుందన్నారు.
ఎంఎస్ రిస్క్ సర్వీసెస్ సహకారం
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రముఖ సంస్థ చోళమండలం ఎంఎస్ రిస్క్ సర్వీసెస్ సహకారం తీసుకుంటున్నామని, వారు డ్రైవర్లకు నాణ్యమైన శిక్షణ అందిస్తున్నారని చెప్పారు. చిన్న చిన్న తప్పిదాలే రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయని, ఈ శిక్షణ ద్వారా ప్రమాదాలు పూర్తిస్థాయిలో తగ్గుతాయన్నారు ఎండీ సజ్జనార్. ఇలా సంస్ద అభివృద్దితోపాటు భద్రతా పరంగా యాక్సిడెంట్ ఫ్రీగా ఆస్టీసిని మార్చేస్తాం అంటున్నారు సజ్జనార్.