తెలంగాణలో ఉత్కంఠభరితంగా జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ విజయం సాధించగా, బీజేపీ మాత్రం నియోజకవర్గంలో బాగానే పుంజుకుంది. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు ఓటర్లను భయపెట్టి మునుగోడు సీటు నెగ్గారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్ చేసే తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడంలో దూకుడు పెంచాలని బీజేపీ శ్రేణులకు కిషన్‌రెడ్డి సూచించారు. ఎక్కడైనా ఏదో ఓ విషయంలో భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ అందరం కలిసి పనిచేయాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.


శామీర్‌పేటలో 3 రోజుల పాటు జరగనున్న బీజేపీ శిక్షణ తరగతులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరై మాట్లాడారు. ప్రపంచంలో అతిపెద్ద సభ్యత్వం కలిగిన పార్టీ బీజేపీ అని కిషన్‌రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ సహా ఇతర పార్టీల నేతలు బీజేపీపై, కేంద్ర ప్రభుత్వంపై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడంలో దూకుడుగా వ్యవహరించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పథకాలు తొలగిస్తామని ఓటర్లను భయపెట్టి విజయం సాధించిందంటూ మండిపడ్డారు. టీఆర్ఎస్ చేసిన డెవలప్‌మెంట్ ను ప్రచారం చేయడానికి బదులుగా బీజేపీపై విమర్శలు గుప్పించి, ఓటర్లను అయోమయానికి గురిచేసి కేసీఆర్ విజయం సాధించారని ఆరోపించారు. ఇప్పటివరకూ ఓ లెక్క, ఇకనుంచి మరో లెక్క అనేలా బీజేపీ శ్రేణులు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం ఉత్సాహంగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్, రాష్ట్ర ఇన్‌ఛార్జి తరుణ్‌ ఛుగ్‌, పార్టీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

కేసీఆర్ కుటుంబాన్ని చీల్చే ఉద్దేశం మాకు లేదు.. 
బీజేపీ, టీఆర్ఎస్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బీజేపీ ఎంపీ అర్వింద్ వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీఆర్ఎస్ కార్యకర్తలు ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. ఇంటి అద్దాలు, సామాగ్రి ధ్వంసం చేశారు. ఆ సమయంలో ఎంపీ అర్వింద్ ఇంట్లో లేరు. ఆయన తల్లి మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఎంపీ ధర్మపురి అర్వింద్‌ తల్లిని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పరామర్శించారు. దాడి జరిగిన తీరును కిషన్‌ రెడ్డి పరిశీలించారు. అర్వింద్ తల్లిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడిన ఆయన కల్వకుంట్ల కుటుంబాన్ని చీల్చే ఉద్దేశం తమకు లేదన్నారు. కేసీఆర్‌ ఫ్యామిలీని బీజేపీలో చేర్చుకోవాలనే ఆలోచన కూడా లేదని స్పష్టం చేశారు. ఒకరిని భయపెట్టి పార్టీలో చేర్చుకునే సంస్కృతి బీజేపీది కాదని కిషన్‌రెడ్డి అన్నారు. రాజీనామాలు కూడా చేయించకుండా కేసీఆర్‌ ఇతర పార్టీల నేతలను చేర్చుకున్నారని విమర్శించారు. పార్టీ ఫిరాయింపులపై సీఎం కేసీఆర్ పైనా కేసు పెట్టాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు నిరాశతోనే దాడులకు దిగుతున్నారని కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.


నిరాశతోనే దాడులు 


సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులను బీజేపీలోకి చేర్చుకోవాలని ఉద్దేశం తమకు లేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. సానుభూతి కోసం టీఆర్ఎస్ కుట్రలు చేస్తుందని విమర్శించారు.  టీఆర్ఎస్ పార్టీ తన ఎమ్మెల్యేలను బీజేపీలోకి చేర్చే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. టీఆర్ఎస్ నిరాశతోనే తమపై దాడులకు దిగుతుందన్నారు.  కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచన కూడా లేదని కిషన్ రెడ్డి అన్నారు. కవితను బీజేపీలోకి చేరాలని ఒత్తిడి చేస్తున్నామని సీఎం కేసీఆర్ చెప్పడాన్ని కిషన్ రెడ్డి తప్పుబట్టారు. బీజేపీకి తెలంగాణ సమాజం అండగా ఉంటుందన్నారు.  బీజేపీ సిద్ధాంతాలు, నరేంద్రమోదీ నాయకత్వంపై విశ్వాసం ఉన్న వారినే పార్టీలో చేర్చకుంటామన్నారు. వివిధ పార్టీలకు చెందిన నేతలు టీఆర్ఎస్‌లో చేర్చుకున్న కేసీఆర్, వారితో రాజీనామా కూడా చేయించలేదన్నారు. భయపెట్టి పార్టీలో చేర్చుకునే సంస్కృతి బీజేపీకి లేదని కిషన్ రెడ్డి చెప్పారు. పార్టీ ఫిరాయింపులపై కేసు పెట్టాలంటే సీఎం కేసీఆర్ మీదే ఫస్ట్ పెట్టాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.