హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డును (ఓఆర్ఆర్) ప్రభుత్వం లీజుకు ఇచ్చే విషయంలో విపరీతమైన వివాదాలు నెలకొంటున్న వేళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఓఆర్ఆర్ ను 30 ఏళ్ల పాటు ప్రైవేటు కంపెనీకి లీజుకు ఇవ్వాల్సిన అవసరం ఏముందని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం (మే 7) మధ్యాహ్నం కిషన్ రెడ్డి బీజేపీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఓఆర్ఆర్ లీజు తమ అనుకూలమైన వ్యక్తులకు ఇచ్చుకొని, ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టాలని చూస్తున్నారని విమర్శించారు. హెచ్ఎండీఏకు ఓఆర్ఆర్ పై టోల్స్ వసూలు చేయడం ద్వారా రాబోయే 30 ఏళ్లలో రూ.75 వేల కోట్ల ఆదాయం వస్తుందని అన్నారు.
లీజు ఏ కంపెనీకి టెండరు రావాలో ముందే సీఎం కేసీఆర్ నిర్ణయించారని కిషన్ రెడ్డి ఆరోపించారు. ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని చెప్తూ ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఓఆర్ఆర్ ను ఎందుకు ప్రైవేటు సంస్థకు లీజుకు ఇస్తోందని ప్రశ్నించారు. ఎన్‌హెచ్ఏఐ నిబంధనల ప్రకారం లీజు ప్రక్రియ జరగడం లేదని ఆరోపించారు. పెరుగుతున్న జనాభా, వాహనాల సంఖ్యను బట్టి లీజు పరిమితిని తగ్గించుకోవచ్చని నిబంధనల్లో ఉందని, కానీ ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదని అన్నారు.
ఓఆర్ఆర్‌ను 30ఏళ్ళ వరకు లీజ్‌కు ఇవ్వాల్సిన అవసరం ఏంటని కిషన్ రెడ్డి నిలదీశారు. ఇదేనా కేసీఆర్ చెప్పే గుణాత్మకమైన మార్పు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ లీజుతో కల్వకుంట్ల కుటుంబం కొత్త నాటకానికి తెర తీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నమ్మించి గొంతు కోయడంలో కేసీఆర్ కుటుంబం ఆరి తేరిందని కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.
ఒప్పందం రద్దు చేయకపోతే కోర్టుకు వెళ్తాం: బీజేపీ ఎమ్మెల్యే
ఈ ఏప్రిల్ నెల సగటు టోల్ గేట్స్ నుండి వచ్చిన ఆదాయం రోజుకు కోటి ఎనభై ఐదు లక్షలు దాటింది. ఏడాదికి సుమారుగా 720 కోట్లు ఆదాయం వస్తోంది. ముఫై ఏళ్లపాటు లీజుకు ఇవ్వడమంటే సుమారుగా ఇరవై వేల కోట్ల ఆదాయం వస్తుందన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. మరి అంతలా ఆదాయం వస్తున్న ఔటర్ రింగ్ రోడ్ టోల్ గేట్స్ లీజును అప్పనంగా ఓ కంపెనీకి కేవలం 7380 కోట్లకు 30 ఏళ్లపాటు ఎలా కేటాయిస్తారంటూ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆయన ఇటీవల ప్రశ్నించారు. వెంటనే ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. టోల్ గేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి, ప్రభుత్వమే టోల్ గేట్ లను నిర్వహిస్తూ బ్యాంక్ నుండి నిధులు తెచ్చి బ్యాంక్ వడ్డీ చెల్లించినా మంచి లాభాలు వస్తాయని, అలాండిది ప్రజల సొమ్మును వేల కోట్ల రూపాయలు ఐఆర్ బి అనే సంస్థకు అప్పగించడం వెనుక ఉన్న ఆంతర్యం బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అందులోనూ డిఫాల్టర్ గా ఉన్న ఐఆర్ బి కంపెనీకి తిరిగి నిర్వహణ బాధ్యతలు అప్పగించడంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు రఘునందన్ రావు.
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ టోల్ గేట్ నిర్వహణ ఒప్పందం ప్రక్రియ వెంటనే ఆపకపోతే కోర్టుకు వెళ్లి స్టే తెస్తామని హెచ్చరించారు దుబ్బాక ఎమ్మెల్యే రఘనందన్ రావు. ఈ విషయంలో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని, HMDA కమిషనర్ తన కాల్ డేటా వివరాలు పబ్లిక్ డొమైన్ లో ఉంచాలని డిమాండ్ చేశారు. ఈ వ్యహారంపై సిబిఐ, ఈడిల కు ఫిర్యాదు చేయడంతోపాటు ఈ టోల్ గేట్ కుంభకోణంపై పోరాటం చేయనున్నట్లు తెలిపారు రఘనందన్.