ఏఐఎంఐఎం నేత, హైదరాబాద్​ ఎంపీ అసదుద్దీన్​ ఓవైసీకి జెడ్ ​కేటగిరీ భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు అధికార వర్గాలు తెలిపాయి. ఆయన కారుపై గురువారం రోజు కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఓవైసీ కారుపై కాల్పుల ఘటనలో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసిన సంగ‌తి తెలిసిందే. గురువారం సాయంత్రం ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం ముగించుకుని హపూర్‌ జిల్లా నుంచి ఢిల్లీ వెళ్తుండగా.. హపూర్‌- ఘజియాబాద్‌ మార్గంలోని చిజారసీ టోల్‌ప్లాజా వద్ద ఒవైసీ కారుపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ కేసులో నిన్ననే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు యూపీ ఏడీజీ ప్రశాంత్‌ కుమార్‌ తెలిపారు. 


నిందితుల నుంచి కాల్పులకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఓ మతానికి వ్యతిరేకంగా ఎంపీ చేసిన వ్యాఖ్యలు తమను బాధించాయని, అందుకే ఓవైసీపై కాల్పులు జరిపినట్లు చెప్పారని పోలీసులు అన్నారు. నిందితులు ఇద్దరిని కోర్టులో హాజరు పరుస్తామని చెప్పారు. నిందితుల్లో ఒకరైన సచిన్‌ పండిట్‌ బీజేపీలో క్రియాశీలక కార్యకర్త అని.. పార్టీ సభ్యత్వానికి సంబంధిన రిసిప్ట్‌ను సచిన్‌ సోషల్‌ మీడియాలో ఉంచారని అన్నారు. అందులో దేశ్‌ భక్త్‌ సచిన్‌ హిందూ అని తన పేరును పేర్కొన్నాడు. యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌, ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య, ఎంపీ మహేశ్‌ శర్మలతో నిందితుడు గతంలో కలిసి దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.






హైదరాబాద్ పాత బస్తీలోనూ భద్రత పెంపు
యూపీలో హైదరాబాద్​ఎంపీ అసదుద్దీన్​ఓవైసీ కారుపై దుండగులు కాల్పుల నేపథ్యంలో హైదరాబాద్ పాతబస్తీలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఈ మేరకు బందోబస్తు పెంచారు. పాతబస్తీలోని చార్మినార్​ మదీనా, పత్తర్​గట్టి, గుల్జార్​హౌజ్, షహ్రాన్​మార్కెట్, లాడ్ బజార్, మక్కా మసీద్, కిల్వట్, లాల్ దర్వాజ, ఛత్రినాక, చంద్రాయణ గుట్ట, హుస్సేనీ అలం, శాలిబండ, ఫలక్ నుమ, యాకుత్ పుర, రెయిన్ బజార్, శాస్త్రి నగర్ తదితర ప్రాంతాలలో పోలీస్ బందోబస్తు ఏర్పాుట చేశారు. పాతబస్తీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పాత బస్తీ దక్షిణ మండలం ఇంఛార్జి డీసీపీ గజరవూ భూపాల్ ఆధ్వర్యంలో భారీ పోలీస్​బందోబస్తు నిర్వహించారు. అయా ప్రాంతాల్లో దుకాణాలను కొందరు వ్యాపారులు స్వచ్ఛందంగా మూసి వేశారు.