Kavitha Latest News: బీఆర్‌ఎస్ అంటే రాజకీయ పార్టీయే కావచ్చు కానీ తెలంగాణ ప్రజల హృదయాలకు దగ్గరగా ఉండే పార్టీ అని తరచూ గులాబీ నేతలు చెబుతుంటారు. అలాంటి కేసీఆర్ కుమార్తె, బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత సునామీ సృష్టించారు. తండ్రికి రాసిన లేఖలో సొంత పార్టీలో పేరుకుపోయిన అసంతృప్తిని ఫీడ్‌బ్యాక్ పేరుతో బయటపెట్టారు. ఇది దేశ రాజకీయాలనే షేక్ చేశాయి. అయితే ఇప్పటి వరకు లేఖపై కానీ, కవిత చేసిన కామెంట్స్‌పై కానీ ఎవరూ స్పందించలేదు. స్పందించినా అసలు విషయంలో మాత్రం చెప్పలేకపోతున్నారు. దీంతో గులాబీ దళంలో ఏం జరుగుతోంది. తండ్రీ కూతురి మధ్య గ్యాప్ వచ్చిందా, ఆ దెయ్యాలు ఎవరు, కోవర్టులు ఎవరు అనే ప్రశ్నలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. వీటిపై మాత్రం ఎవరూ స్పందించడం లేదు. మౌనంగానే ఉంటున్నారు.
కేటీఆర్ పెట్టిన మీడియా సమావేశంలో లేఖపై, లేఖలోని అంశాలపై, కవిత వ్యాఖ్యలపై మాట్లడతారని అంతా ఊహించారు. కానీ కేటీఆర్ తన మీడియా సమావేశం అంతటా రేవంత్‌రెడ్డినే టార్గెట్ చేస్తూ మాట్లడారు. చివరిలో విలేఖరులు కవిత వ్యాఖ్యలపై ప్రశ్నించగా, బీఆర్‌ఎస్‌లో ఎవరైనా తమ అభిప్రాయం చెప్పుకునే స్వేచ్ఛ ఉంది,కానీ బహిరంగంగా పార్టీలో అంతర్గత విషయాలు మాట్లడటం సరైనది కాదన్నారు. అతి మా అంతర్గత విషయమని ఒక్క మాటలో తేల్చేశారు. ఎక్కడ కవిత పేరు ప్రస్తావించలేదు.
ప్రజల పార్టీ అనుకున్నప్పుడు వచ్చిన అనుమానాలను నివృత్తి చేయాలి, జరుగుతున్న పరిణామాలపై క్లారిటీ ఇవ్వాలి కానీ అవేవీ ఇప్పటి వరకు జరగలేదు. ఏకంగా తననే టార్గెట్ చేశారని కవిత ప్రకటన చేసిన తర్వాత కూడా అంతా మౌనంగానే ఉంటున్నారు. ఇదే అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది.
కేటీఆర్ మౌనం..వెంటాడుతున్న ప్రశ్నలు..కవిత లేఖ లీకైన తరువాత కేటీఆర్ ఎక్కడా నోరు విప్పలేదు. పార్టీ అంతర్గత వ్యవహారం కావడంతో బయటకు మాట్లడలేదనుకుంటే, విషయం బయటకు వచ్చిన తరువాత కూడా కవితను తిరిగి మీడియా ముందు మాట్లడకుండా నిలువరించలేకపోయారు. కేసీఆర్ తరువాత నెంబర్ టూగా పార్టీలో పట్టున్న కేటీఆర్, తన సోదరి చేసిన ఆరోపణలపై లేఖ తండ్రికి అందిన రోజే సీరియస్‌గా దృష్టిపెట్టి ఉంటే పరిస్థితి ఇక్కడ వరకూ వచ్చేదికాదు. పార్టీ గుట్టు తెలంగాణ భవన్ గేటు దాటేది కాదు. కానీ అలా వ్యవహారం సర్ధుబాటు చేయడంలో కేటీఆర్ విఫలమయ్యారనే వాదనలు విపిస్తున్నాయి. పార్టీలో కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయి తాజాగా మీడియా ముందు చెప్పినా. ఆ దెయ్యాల వల్లే తాను ఇబ్బంది పడుతున్నానని ఇన్ డైరెక్ట్‌గా హింట్ ఇచ్చినా, పార్టీలో తాను తన తండ్రికి రాసిన లేఖను లీక్ చేసింది ఎవరని ఓపెన్‌గా ప్రశ్నించినా, కేటీఆర్ మౌనమే సమాధానంగా ఉన్నారు. కనీసం లేఖ లీక్ చేసిన వారెవరే తేల్చి, చర్యలు తీసుకుంటామనే మాట కూడా కేటీఆర్ నోట రాలేదంటే అంతర్గత విభేదాలు ఏ స్థాయికి వెళ్లిపోయాయో అనే అనుమానాలు బలపడుతున్నాయి.
పార్టీలో జరుగుతున్న లోపాలపై బహిరంగంగా మాట్లడటం సరికాదని కేటీఆర్ మౌనంగా ఉన్నారా, లేక మాట్లడితే లీక్ వీరుల పేర్లు బయటకు చెప్పాల్సి వస్తుందని ఊరుకున్నారా, కేసీఆర్ చుట్టూ ఉన్న కొందరు దెయ్యాల వల్లనే పార్టీ నష్టపోతుందని కవిత అన్నారంటే వారిలో కుటుంబ సభ్యులు కూడా ఉన్నారా, అలా ఉంటే మిగిలింది హరీష్ రావు మాత్రమే. ఒకవేళ హరీష్ రావును ఉద్దేశించి కవిత మాట్లడితే, ఆ వ్యవహారంలో తాను జోక్యం చేసుకోవడం సరికాదని కేటీఆర్ భావించారా అనే వాదనలు విపిస్తున్నాయి. కుటుంబ సభ్యులు కాకుండా ఎంపీ సంతోష్ వంటి ఒకరిద్దరు సీనియర్ నేతలు కేసీఆర్‌కు దగ్గరగా ఉంటారు. ఒకవేళ వాళ్లు కవితపై కుట్ర చేస్తే, తన సోదరిని కాదని, బయటి వాళ్లను కేటీఆర్ సపోర్టు చేస్తారా, అలా చేయకపోతే లీక్ చేసిన వారిపై ఇప్పటికే చర్యలు తీసుకోవాలి. కానీ లేఖ లీకులపై పార్టీ ఎటువంటి యాక్షన్ లేదు. ఓవైపు సోదరి, మరోవైపు పార్టీ పరువు , అంతర్గత విభేదాలు..ఇలా వీటిలో ఏ అంశాన్ని బహిరంగంగా మాట్లడినా, అటు కాంగ్రెస్,ఇటు బిజెపిల విమర్శలకు అవకాశం ఇచ్చినట్లుంటుందని భావించి మౌన మునిలా మారిపోయారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
హరీష్ రావు సైలెన్స్ వెనుక మర్మమేంటి..?
బీఆర్‌ఎస్‌పై ఈగ వాలితే వజ్రాయుధంతో యుద్దం చేసే మాజీ మంత్రి హరీష్ రావు. మామకోసం, మామ వెంట అంటూ కేసీఆర్‌కు నమ్మిన బంటులా, బీఆర్‌ఎస్‌కు వీర విధేయుడిగా ఉండే హరీష్ రావు... కవిత పెట్టిన చిచ్చును ఆర్పే సాహసం చేయలేకపోతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. బీఆర్‌ఎస్‌ను విమర్శించే పార్టీలపై ఆధారాలతో సహా చెలరేగిపోయే హరీష్ రావు, ఇప్పుడు కవిత చేసిన ఆరోపణలపై మాత్రం మౌనంగా ఉన్నారు. లేఖ రెండు వారాల క్రితం రాశానని కవిత చెబుతున్నారు. లేఖ విషయం హరీష్ రావుకు తెలియదా, తెలిస్తే పార్టీ పరువు బయటపడే వరకూ ఎందుకు ఊరుకున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కవిత విమర్శలపై మాట్లడితే కుటుంబంలో విభేదాలతోపాటు,పార్టీ పరువు రోడ్డున పడినట్లవుతుందని భావించారా వాదనలు వినిపిస్తున్నాయి. ఇలా మొత్తంగా కేటీఆర్, హరీష్ రావులు ఇద్దరూ కవిత లేఖపై నోరు విప్పే సాహాసం చేయడంలేదు.