Pushkar Singh Dhami on UCC - హైదరాబాద్: దేశంలో ఉమ్మడి పౌరస్మృతి (UCC)ని అమలుచేసిన తొలి రాష్ట్రం ఉత్తరాఖండ్ అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అన్నారు. దేశమంతా యూసీసీ అమలు కోసం ఎదురుచూస్తోందని.. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అయ్యాక దేశ వ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతి అమలు చేసి తీరతామని స్పష్టం చేశారు. ముషీరాబాద్ నియోజకవర్గం కసిష్ ఫంక్షన్ హాల్ లో యువమోర్చా సమ్మేళనంలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె. లక్ష్మణ్, సికింద్రాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా పుష్కర్ సింగ్ దామి మాట్లాడుతూ.. ఉత్తరాఖండ్ దేవ భూమి అని, తమ పుణ్యభూమికి ఎవరైనా రావొచ్చు అని తెలుగు ప్రజలను ఆహ్వానించారు. ఈసారి ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు గెలుస్తుందని దీమా వ్యక్తం చేశారు. నేడు దేశమంతా మోదీ వైపు చూస్తోందన్నారు. మోదీకి సరిపోయే వ్యక్తి కోసం భూతద్దం చూసి వెతికినా దేశంలో ఎక్కడా కనిపించడం లేదన్నారు.
యువశక్తి మన ప్రధాన బలం అని, మన యువతే మోదీ భవిష్యత్ భారత నిర్మాణంలో కీలకంగా మారనున్నారు. యువత పెద్ద సంఖ్యలో బీజేపీకి ఓట్లు వేసి తమ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి, సంక్షేమమే ప్రధాని మోదీ ఎజెండా అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో ఎక్కువ స్థానాలు గెలిచేది బీజేపీ అన్నారు.
వరంగల్, నిజామాబాద్, హైదరాబాద్ లలో బీజేపీ పెద్దలు ప్రచారం చేయగా, తాను సైతం తెలంగాణలో పలు కార్యక్రమాల్లో పాల్గొనట్లు చెప్పారు. ఎటు చూసినా బీజేపీ, మోదీ వైపు ప్రజలు చూస్తున్నారని.. కేంద్రంలో వచ్చేది తమ ప్రభుత్వమే అన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బీజేపీ హవా నడుస్తోందని, I.N.D.I.A కూటమిలో ప్రధాని అయ్యే వ్యక్తి ఎవరూ లేరని పుష్కర్ సింగ్ ధామి కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీకి రాజకీయాలు సరిగ్గా అర్థం కావడం లేదని, ఆ పార్టీ నేతలకు ఏకాభిప్రాయం ఉండదన్నారు.
దేశం కోసం, యువత కోసం మోదీ ప్రధాని కావాలి..
యువత భవిష్యత్ కోసం, దేశ రక్షణ కోసం నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆకాంక్షించారు. దేశం కోసం తాను ప్రధానిగా ఉండాలని మోదీ భావిస్తే, తన కుటుంబం కోసం, తన కోసం ప్రధాని పదవి కోరుకుంటున్న వ్యక్తి రాహుల్ గాంధీ అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో జరగనున్న బీజేపీ భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున యువత తరలి రావాలని పిలుపునిచ్చారు కిషన్ రెడ్డి. ప్రధాని మోదీ సభకు తరలి వచ్చి విజయవంతం చేయాలన్నారు. వయోజనులు అంతా ఓటు హక్కును వినియోగించుకోవాలని, నరేంద్ర మోదీని మరోసారి ప్రధాని కావాలంటే బీజేపీకి ఓటేయాలన్నారు. దేశంలో శాంతి కొనసాగాలన్నా, ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలన్నా బీజేపీ మరోసారి అధికారంలోకి రావాలన్నారు.
UCC, Pushkar Singh Dhami, Loksabha Elections 2024, Loksabha Polls 2024, Elections 2024, Kishan Reddy, Reservation News, Telugu News, BJP News, Hyderabad News
పుష్కర్ సింగ్ ధామి, లోక్ సభ ఎన్నికలు 2024, బీజేపీ, కిషన్ రెడ్డి