TSRTC Special Offer: హైదరాబాద్ ప్రయాణికులను ఆకర్షించేందుకు టీఎస్ఆర్టీసీ స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రయాణించే వారికి ఆర్టీసీ ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. టీ6, ఎఫ్24 టికెట్ల పేరిట కొత్త ఆఫర్లను ప్రయాణికుల ముందుకు తెచ్చింది. ఈ టికెట్లకు సంబంధించిన పోస్టర్లను టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆవిష్కరించారు. మహిళలు సీనియర్ సిటిజెన్ల కోసం టీ6 టికెట్ ను అందుబాటులోకి తెచ్చింది. రూ.50 చెల్లించి టీ6 టికెట్ కొనుగోలు చేస్తే... ఆరు గంటల పాటు సిటీ బస్సుల్లో ప్రయాణించేందుకు అవకాశం కల్పించారు. ఇక కుటుంబ సభ్యులు, స్నేహితుల సౌకర్యార్థం ఎఫ్24 టికెట్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. రూ.300 చెల్లించి ఎఫ్24 టికెట్ కొనుగోలు చేస్తే ఆ టికెట్ పై నలుగురు వ్యక్తులు రోజంతా ప్రయాణించే వెసులుబాటు ఉంటుంది. ఈ రెండు టికెట్లు శుక్రవారం నుంచి అందుబాటులోకి వస్తున్నాయి.
ఇటీవలే స్లీపర్ బస్సులను అందుబాటులోకి తెచ్చిన ఆర్టీసీ
ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించేందుకు రాష్ట్రంలోనే మొదటిసారిగా ఏసీ స్లీపర్ బస్సులను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) అందుబాటు లోకి తీసుకువస్తోంది. ప్రయాణికుల సౌకర్యార్థం ఇప్పటికే కొత్త సూపర్ లగ్జరీ, నాన్ ఏసీ స్లీపర్, సీటర్ కమ్ స్లీపర్ బస్సులను ప్రారంభించిన టీఎస్ ఆర్టీసీ.. సుదూర ప్రాంతాలకు వెళ్లే వారికి మరింతగా చేరువ అయ్యేందుకు ఏసీ స్లీపర్ బస్సులను రూపొందించింది. ప్రైవేట్ బస్సులకు ధీటుగా రూపొందించిన 16 కొత్త ఏసీ స్లీపర్ బస్సులు మార్చి నెలలో అందుబాటు లోకి రాబోతున్నాయి.
కర్ణాటకలోని బెంగళూరు, హుబ్లీ, ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం, తిరుపతి, తమిళనాడు లోని చెన్నై మార్గాల్లో ఈ బస్సులను సంస్థ నడపనుంది. నాన్ ఏసీ స్లీపర్ బస్సుల మాదిరి గానే ఏసీస్లీపర్ బస్సులకు ‘లహరి’ (Sleeper Buses Named A Lahari) గా సంస్థ నామకరణం చేసింది. హైదరాబాద్ లోని బస్ భవన్ ప్రాంగణంలో కొత్త ప్రోటో (నమూనా) ఏసీ స్లీపర్ బస్సును టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ పరిశీలించారు. బస్సులో ప్రయాణికులకు కల్పిస్తోన్న సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా బస్సులను ప్రారంభించి.. ప్రయాణికులకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తెలంగాణలో మొదటిసారిగా అందుబాటులోకి తీసుకు వస్తోన్న టీఎస్ఆర్టీసీ ఏసీ స్లీపర్ బస్సులకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని ఎండీ సజ్జనార్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో) డాక్టర్ వి. రవిందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆపరేషన్స్) పీవీ ముని శేఖర్, చీఫ్ పర్సనల్ మేనేజర్ (సీపీఎం) కృష్ణ కాంత్, చీఫ్ మెకానికల్ ఇంజనీర్ (సీఎంఈ) రఘునాథ రావు, చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ (సీటీఎం) జీవన్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.