Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు పలు రాష్ట్రాల ప్రభుత్వాలను అతలాకుతలం చేస్తుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ ఇచ్చిన నోటీసులకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం సంబంధం అని హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రశ్నించారు. ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇస్తే... ఇది అందరికీ అవమానం అన్న కోణంలో ఎందుకు చిత్రీకరిస్తున్నారని అడిగారు. అలాగే అవినీతిని ఊడ్చేస్తామని చీపురు గుర్తుతో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) దిల్లీలో అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. కానీ ఆ పార్టీ పాలనలోనే ఇంత పెద్ద కుంభకోణం జరగడం దారుణం అన్నారు.


దేశంలో ఏ పార్టీ చేయలేనంత అవినీతిని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ( Delhi CM Kejriwal) చేశారని దర్యాప్తు సంస్థలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. అయితే ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన మనీష్ సిసోడియా.. డిప్యూటీ సీఎం పదవికి ఒక్కడే రాజీనామా చేయడం కాదని.. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా చేయాలని అన్నారు. ఈ స్కాంపై పూర్తి బాధ్యత వహిస్తూ.. సీఎం కేజ్రీవాల్ రాజీనామా చేయాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. 


కవితకు వచ్చిన ఈడీ సమన్లు కాదు.. మోదీ సమన్ల అంటున్న కేటీఆర్


భయోత్పాత వాతావరణం సృష్టించి అధికారంలోకి రావడం బీజేపీకి ఉన్న అలవాటు అని ఆరోపించారు తెలంగాణ మంత్రి కేటీఆర్. బీఆర్‌ఎస్ గాలిని తట్టుకోలేక మొదటి నుంచి తమ పార్టీకి చెందిన నేతలపైకి ఈడీ, ఐటీ, సీబీఐలను పంపిస్తోందన్నారు. ఇప్పుడు తాజాగా  ఎమ్మెల్సీ కవితకు వచ్చిన నోటీసులు కూడా ఆలంటి కోవలోనివేననన్నారు. అసలు ఇవి ఈడీ పంపించిన సమన్లు కావని... మోడీ పంపిన సమన్లు అని ఎద్దేవా చేశారు. దేశంలో అందరూ అవినీతి పరులు తాము మాత్రమే సత్యహరిశ్చంద్రకు కజిన్ బ్రదర్స్‌లా ఫోజులు కొడుతున్నారని మోడీపై మండిపడ్డారు కేటీఆర్. దేశంలో అందరూ అవినీతి పరులు తాము మాత్రమే సత్యహరిశ్చంద్రకు కజిన్ బ్రదర్స్‌లా ఫోజులు కొడుతున్నారని మోడీపై మండిపడ్డారు. ఇలాగైనా చేసి బయటపడదామనే చిల్లర ప్రయత్నమే తప్ప ఇంకొకటి కాదన్నారు. నీతి లేని పాలనకు నిజాయితీ లేని దర్యాప్తు సంస్థలకు పర్యాయపదంగా మారింది ఎన్డీఏ ప్రభుత్వం అని విమర్శించారు. ప్రతిపక్షాలపై కేసులు దాడి ప్రజలపై ధరల దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


గంగలో మునిగితే పాపాలు పోతాయని అన్నట్టు... బీజేపీలోకి వెళ్లిన వారంతా నీతిపరులైపోతారని మండిపడ్డారు కేటీఆర్. 120 షెల్‌ కంపెనీల ద్వారా బ్యాంక్ లను మోసం చేశారని సుజనా చౌదరిపై 2018లో హడావుడి చేసిన దర్యాప్తు సంస్థలు తర్వాత ఎందుకు సైలెంట్ అయ్యాయని ప్రశ్నించారు. బీజేపీలో జాయిన్ అయిన తర్వాత ఆ కేసులు ఏమయ్యాయని నిలదీశారు. ఈడీ అనేది 2014 తర్వాత చేసిన దాడుల్లో 95 శాతం ప్రతిపక్షాలపైనే అన్నారు కేటీఆర్‌. ఐదవేల నాలుగు వందల ఇరవై రెండు కేసుల్లో తీర్పు వచ్చింది కేవలం 23 కేసుల్లోనే అని వివరించారు. ప్రతిపక్షాలు లేకుండా చేయాలనే లక్ష్యంతో ఇలా చేస్తున్నారన్నారు. ఈడీ అంటే ఎరాడికేషన్ డెమోక్రసీ అని అభిప్రాయపడ్డారు. కర్నాటకలో ఎమ్మెల్యే కుమారుడు విరూపక్ష కుమారుడు డబ్బులు తీసుకుంటూ దొరికినా కేసులు లేవన్నారు. మరో ఎంపీ మాట్లాడుతూ.. తన జోలికి ఈడీ రాదని నిర్భీతిగా చెబుతున్నారన్నారు. బీజేపీలోకి వెళ్లిన తర్వాత ఈడీ గోల లేకుండా ప్రశాంతంగా ఉన్నానంటూ ఓ కాంగ్రెస్ ఎంపీ చెప్పారని గుర్తు చేశారు.