TSRTC Special Buses: టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు ఆ సంస్థ ఎండీ సజ్జనార్ శుభవార్త చెప్పారు. వరుస సెలవుల నేపథ్యంలో పలు పర్యాటక ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు వెల్లడించారు. ఈ రోజు, రేపు సుదూర ప్రాంతాలకు స్పెషల్ ట్రిప్పులు వేస్తున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి చెన్నై, షిర్దీ, విశాఖపట్నం, కాకినాడ, అమలాపురం, తదితర ప్రాంతాలకు ఈ ప్రత్యేక సర్వీసులను సంస్థ నడుపుతోంది. ప్రయాణికులు అధికారిక వెబ్ సైట్ http://tsrtconline.in లో టికెట్లను బుక్ చేసుకోవాలని ఎండీ సజ్జనార్ సూచించారు. పూర్తి వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 ను సంప్రదించాలని వివరించారు.
హైదరాబాద్ బస్సులపై పర్యావరణహితమైన బస్సులు
హైదరాబాద్ ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో హైదరాబాద్ రోడ్లపైకి పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ బస్సులు రాబోతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో 1300 ఎలక్ట్రిక్ బస్సులను వాడకంలోకి తీసుకురావాలని టీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. పర్యావరణ హితం, కాలుష్య నివారణతో పాటు ప్రజలకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించేందుకు ఈ బస్సులను అందుబాటులోకి తీసుకురాబోతుంది. త్వరలో 25 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను వాడకంలోకి తెచ్చేందుకు సంస్థ ఏర్పాట్లు చేస్తోంది.
ఈ మేరకు హైదరాబాద్ బస్ భవన్ ప్రాంగణంలో సోమవారం కొత్త ప్రోటో (నమూనా) ఎలక్ట్రిక్ ఏసీ బస్సును టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ పరిశీలించారు. బస్సులో ప్రయాణికులకు కల్పిస్తోన్న సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. వీలైనంత త్వరగా బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అనంతరం సజ్జనార్ మాట్లాడుతూ.. హైదరాబాద్ లో పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ బస్సులు త్వరలోనే సంస్థ అందుబాటులోకి తీసుకురాబోతోందన్నారు. ఇందులో భాగంగా ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్(ఓజీఎల్)కు 550 ఎలక్ట్రిక్ బస్సుల ఆర్డర్ ఇచ్చినట్లు చెప్పారు. 500 బస్సులను హైదరాబాద్ సిటీలో, 50 బస్సులు విజయవాడ మార్గంలో నడపాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇప్పటికే విజయవాడ రూట్‌లో 10 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి.
తొలి విడతగా హైదరాబాద్‌కు 50 బస్సులు
తొలి దశలో 50 హైదరాబాద్‌కు ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు రాబోతున్నట్లు సజ్జనార్ వివరించారు. వాటిలో 20 శంషాబాద్ ఎయిర్ పోర్ట్ మార్గంలో తిరుగుతాయని, మరో 30 ఐటీ కారిడార్లో నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. 25 బస్సులను త్వరలోనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్ లో మొత్తం ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఈ ఆర్థిక ఏడాదిలో సిటీలో 500 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి వస్తాయని, అందులో 50 ఏసీ బస్సులుండగా.. మిగతావి ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సులు ఉన్నట్లు సజ్జనార్ వివరించారు. గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (GCC) పద్ధతిలో విడతల వారీగా ఈ బస్సులను టీఎస్‌ఆర్టీసీకి ఒలెక్ట్రా అందజేస్తుందన్నారు. వీటికి అదనంగా మరో 800 ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు ప్రక్రియ ప్రాసెస్‌లో ఉందన్నారు. కార్యక్రమంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రవీందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, వెంకటేశ్వర్లు, కృష్ణకాంత్, సీఎంఈ రఘునాథ రావు, సీఈఐటీ రాజశేఖర్, ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ రావు, మేనేజర్ ఆనంద్ బసోలి, అసిస్టెంట్ మేనేజర్ యతిష్ కుమార్ పాల్గొన్నారు.
Read Also: Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో అదిరిపోయే కొత్త ఆఫర్ - అతి తక్కువ ధరతో అపరిమిత రైడ్స్ చేసే ఛాన్స్