హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థ మరో ఆకట్టుకునే ఆఫర్ తో ముందుకు వచ్చింది. గత కొన్ని రోజుల క్రితం పెట్టిన మెట్రో సువర్ణ ఆఫర్ ను తీసేశాక మరే ఆఫర్ లేకుండా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘సూపర్‌ సేవర్‌ ఫ్రీడమ్‌ ఆఫర్‌ ను మెట్రో అధికారులు ప్రకటించారు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ ఆఫర్ లో భాగంగా కేవలం రూ.59 తో సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డ్‌ను రీఛార్జ్ చేయడం ద్వారా మూడు రోజులు (ఆగస్టు 12, 13, 15) అపరిమిత రైడ్‌లను చేయవచ్చని హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ప్రకటించింది. 


ఈ సందర్భంగా ఎల్‌ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ, సీఈవో కేవీబీ రెడ్డి మాట్లాడుతూ.. తమ ప్రయాణికులకు ఈ ప్రత్యేకమైన ఎస్‌ఎస్‌ఎఫ్ ఆఫర్‌ను అందిస్తుండటం పట్ల సంతోషిస్తున్నామని అన్నారు. ఈ ఆఫర్, ప్రయాణికుల ఛార్జీలు చౌకగా మార్చడమే కాకుండా ట్రాఫిక్‌ను తగ్గించడంలో సాయపడుతుందని అన్నారు.