TSRTC Pushpak Bus Charges: టీఎస్ఆర్టీసీ హైదరాబాద్ ఆర్టీసీ ప్రయాణికులకు గట్టి షాక్ ఇచ్చింది. పుష్పక్ ఏసీ బస్ పాస్ ఛార్జీలను మూడు వేల రూపాయల నుంచి ఐదు వేలకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈక్రమంలోనే మంగళ వారం రోజు ఉత్తర్వులు జారీ చేసింది. నగరంలోని పలు ప్రధాన కేంద్రాల నుంచి నాలుగు రూట్లలో.. శాంషాబాద్ రాజీవ్ గాంధీ విమానాశ్రయానికి ఆర్టీసీ పుష్పక్ బస్సులను నడుపుతోంది. పెరిగిన బస్సు నిర్హణ ఖర్చులను భరించేందుకు గత్యంతరం లేక పుష్పక్ ఏసీ బస్ పాస్ ఛార్జీలను పెంచినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఐదు వేల రూపాయలతో పాటు జీఎస్టీని కూడా చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. అయితే పెంచిన ఈ ఛార్జీలను నేటి(జనవరి 18) నుంచి అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. 


పుష్పక్ ఏసీ బస్సుల్లో కనీస ఛార్జీ 50 రూపాయలు కాగా గరిష్టంగా 300 రూపాయలు వసూలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే పుష్పక్ బస్ పాస్ ల కోసం ఆన్ లైన్ లో మూడు వేల రూపాయలు చెల్లించిన ప్రయాణికులు మిగిలిన మొత్తాన్ని కూడా చెల్లించాలని సూచించారు.


ఐటీ ఉద్యోగుల కోసం సైబస్ లైనర్ సర్వీసులు 


ఐటీ ఉద్యోగుల కోసం తెలంగాణ ఆర్టీసీ కొత్తగా కొత్తగా సైబర్ లైనర్ బస్సు సర్వీసును ప్రారంభించింది. ఉద్యోగుల కోసం మాత్రమే ఈ బస్సులు రోడ్లపై తిరగబోతున్నాయి. ప్రస్తుతానికి ప్రయోగాత్మకంగా రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి మూడు ఐటీ కారిడార్లలో ఈ బస్సులు నడపనున్నారు. వీటికి ఆదరణ మెరుగ్గా ఉంటే మరికొన్ని బస్సులు ప్రారంభించేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. సోమవారం ఉదయం నుంచి ఈ కొత్త సర్వీసులు ప్రారంభమయ్యాయి. హైటెక్స్ మెట్రో స్టేషన్ సమీపంలో వీటిని లాంఛనంగా ప్రారంభించారు. గతంలో అంటే దాదాపు ఏడేళ్ల క్రితం ఆర్టీసీ వజ్ర పేరుతో మినీ ఏసీ బస్సులను ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. వాటి నిర్వహణ, రూట్ల ఎంపిక పూర్తిగా నష్టాలు తెచ్చేలా, ప్రణాళిక లేకుండా ఉండడంతో అప్పట్లోనే ఆ ప్రయోగం వికటించింది. కోట్ల రూపాయల్లో నష్టాలు కూడా వచ్చాయి. దీంతో వాటిని దూర ప్రాంతాలకు తిప్పడం ప్రారంభించారు. 


ఆ బస్సులకే కొత్త రూపు ఇచ్చి సైబర్ లైనర్ లుగా..


కానీ బస్సుల్లో సాంకేతిక సమస్యలు తీవ్రంగా ఉండడంతో ఆ ప్రయోగనం కూడా విఫలం అయిపోయింది. చూస్తుండగానే అవి డొక్కుగా మారి పూర్తిగా పాడైపోయాయి. మొత్తం వంద బస్సులకు గాను 32 బస్సులు కొంత మెరుగ్గా ఉండడంతో వాటిని పక్కన పెట్టి మిగతావాటిని అమ్మేశారు. మిగిలిన ఆ 32 బస్సులను సైబర్ లైనర్ లుగా మార్చాలని నిర్ణయించి తొలుత పది బస్సులకు వర్క్ షాపు నిర్వహించి వాటిని బాగు చేశారు. కొత్త రూపు ఇచ్చి మెరిసిపోయేలా చేసి వాహ్వా అనిపిస్తున్నారు. అయితే గతంలో సిటీలో ఓల్వో సీ బస్సులను మెట్రో లగ్జరీలుగా తిప్పడంతో వాటికీ ఐటీ ఉద్యోగుల నుంచి మంచి ఆదరణ వచ్చింది. కానీ మెట్రో రైళ్ల ప్రారంభంతో అవి దివాలా తీశాయి. దీంతో వాటిని తప్పించి దూర ప్రాంత సర్వీసులుగా మార్చారు. అయితే మెట్రో రైలు దిగిన ఐటీ ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లడం కష్టంగా మారింది. దీని కోసం ఈ సైబర్‌ లైనర్‌లను వినియోగిస్తున్నారు.