TSRTC News: హైదరాబాద్ నగర ప్రజలకు టీఎస్ ఆర్టీసీ ముఖ్య గమనికను విడుదల చేసింది. కుషాయిగూడ - అఫ్జల్ గంజ్ మార్గంలో వెళ్లే 3వ నెంబర్ రూట్ సిటీ బస్సులను మౌలాలి కమాన్ మీదుగా ఈ రోజు నుంచి ఆర్టీసీ పునరిద్దరించింది. గత పది సంవత్సరాలుగా మౌలాలీ కమాన్ రూట్ బంద్ ఉండగా... ప్రత్యామ్నాయంగా మౌలాలీ హౌజింగ్ బోర్డు కాలనీ గుండా బస్సులను నడిపింది. తాజాగా ఆ రూట్ లో రాకపోకలు సాగుతుండటంతో మౌలాలీ కమాన్ మీదుగా గతంలో మాదిరిగా బస్సులను నడపాలని సంస్థ నిర్ణయించింది. ఈ 3వ నెంబర్ రూట్ బస్సు కుషాయిగూడ నుంచి ఈసీఐఎల్ క్రాస్ రోడ్, ఎస్పీ నగర్, మౌలాలీ కమాన్, జెడ్టీఎస్, లాలాపేట్, తార్నాక, శంకర్ మట్, కోటి, సీబీఎస్ మీదుగా అఫ్జల్ గంజ్ వెళ్తుంది. ఆ రూట్ లో ప్రతి 20 నిమిషాలకో బస్సు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ఈ సదుపాయాన్ని కుషాయిగూడ -అఫ్జల్ గంజ్ మార్గంలోని ప్రయాణికులు వినియోగించుకోవాలని సంస్థ కోరుతోంది. 






Also Read: Airport Metro: వచ్చే నెలలో ఎయిర్‌పోర్టు మెట్రో పనులు, 36 నెలల్లో పూర్తి చేసేలా ప్రణాళికలు!


హైదరాబాద్ రోడ్లపై ఎలక్ట్రిక్ బస్సులు


హైదరాబాద్ ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో హైదరాబాద్ రోడ్లపైకి పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్‌ బస్సులు రాబోతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో 1300 ఎలక్ట్రిక్ బస్సులను వాడకంలోకి తీసుకురావాలని టీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. పర్యావరణ హితం, కాలుష్య నివారణతో పాటు ప్రజలకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించేందుకు ఈ బస్సులను అందుబాటులోకి తీసుకురాబోతుంది.  త్వరలో 25 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను వాడకంలోకి తెచ్చేందుకు సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. 


ఈ మేరకు హైదరాబాద్‌ బస్ భవన్ ప్రాంగణంలో సోమవారం కొత్త ప్రోటో (నమూనా) ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సును టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ పరిశీలించారు. బస్సులో ప్రయాణికులకు కల్పిస్తోన్న సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. వీలైనంత త్వరగా బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. 


అనంతరం సజ్జనార్ మాట్లాడుతూ..  హైదరాబాద్ లో పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ బస్సులు త్వరలోనే సంస్థ అందుబాటులోకి తీసుకురాబోతోందన్నారు. ఇందులో భాగంగా ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్(ఓజీఎల్)కు 550 ఎలక్ట్రిక్ బస్సుల ఆర్డర్ ఇచ్చినట్లు చెప్పారు. 500 బస్సులను హైదరాబాద్‌ సిటీలో, 50 బస్సులు విజయవాడ మార్గంలో నడపాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇప్పటికే విజయవాడ రూట్‌లో 10 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి. 


తొలి విడతగా హైదరాబాద్‌కు 50 బస్సులు


తొలి దశలో 50 హైదరాబాద్‌కు ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు రాబోతున్నట్లు సజ్జనార్ వివరించారు. వాటిలో 20 శంషాబాద్ ఎయిర్ పోర్ట్ మార్గంలో తిరుగుతాయని, మరో 30 ఐటీ కారిడార్లో నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. 25 బస్సులను త్వరలోనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్ లో మొత్తం ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.