TSRTC News: ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు సొంతూర్లకు వెళ్లడం కోసం తెలంగాణలో నివసిస్తున్న ఆంధ్రా ఓటర్లు ఎంతో ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. సరిపడినన్ని బస్సులు దొరక్క, రైళ్లు కిక్కిరిసిపోవడంతో ప్రయాణించడానికి అవస్థలు పడుతున్నారు. ఎండల వేళ ఈ ఇబ్బందులు మరింత సమస్యగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో విజయవాడకు ఉన్న డిమాండ్ ను గుర్తించి తెలంగాణ ఆర్టీసీ మరిన్ని బస్సులను నడుపుతోంది. ఈ విషయాన్ని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ప్రకటించారు. హైదరాబాద్ టూ విజయవాడ రూట్ లో మరో 140 బస్సులను నడుపుతున్నట్లుగా ప్రకటించారు. ఈ బస్సుల్లో మొత్తం 3 వేల దాకా సీట్లు ఉన్నాయని.. ప్రయాణికులు తమ వెబ్ సైట్ http://tsrtconline.in నుంచి టికెట్లు బుక్ చేసుకోవచ్చని సజ్జనార్ తెలిపారు.


సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటేసేందుకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్‌ వైపునకు ఇప్పటివరకు 590 స్పెషల్‌ బస్సులను ఏర్పాటు చేయగా.. తాజాగా హైదరాబాద్‌ - విజయవాడ రూట్‌ లో మరో 140 సర్వీసులను ఆన్‌లైన్‌లో ముందస్తు రిజర్వేషన్‌ కోసం పెట్టడం జరిగింది. ఆయా బస్సుల్లో దాదాపు 3 వేలకుపైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి. విజయవాడ రూట్‌ వైపునకు వెళ్లే ప్రయాణికులు ఈ ప్రత్యేక సర్వీసులను వినియోగించుకోవాలని సంస్థ కోరుతోంది. 


టికెట్ల ముందస్తు రిజర్వేషన్‌ కోసం http://tsrtconline.in వెబ్‌ సైట్‌ ని సంప్రదించగలరు. అలాగే, హైదరాబాద్‌ నుంచి జిల్లాలకు 1500 ప్రత్యేక బస్సులను సంస్థ నడుపుతోంది. జేబీఎస్‌, ఎంజీబీఎస్‌, ఉప్పల్‌, ఎల్బీనగర్‌, ఆరాంఘర్‌, తదితర ప్రాంతాల నుంచి ఈ బస్సులను తిప్పుతోంది. ప్రయాణికుల రద్దీని బట్టి ఎప్పటికప్పుడు బస్సులను అందుబాటులో ఉంచాలని క్షేత్రస్థాయి అధికారులను యాజమాన్యం ఆదేశించడం జరిగింది. ఈ ప్రత్యేక బస్సుల్లో సురక్షితంగా సొంతూళ్లకు వెళ్లి తమ అమూల్యమైన ఓటుహక్కును వినియోగించుకోవాలని టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం కోరుతోంది’’ అని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ పోస్ట్ చేశారు.