Telangana RTC: తెలంగాణ ఆర్టీసీ ఎండీగా వీసీ సజ్జనార్ బాధ్యతలు తీసుకొని దాదాపు ఏడాది కావస్తోంది. వచ్చే ఆగస్టు నెలతో ఆయన ఆర్టీసీలో అడుగు పెట్టి సంవత్సరం అవుతుంది. ఈ మధ్య కాలంలో ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు, కొత్త వ్యూహాలు కాస్త ఫలితాలు ఇచ్చినట్లుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఏటా ఆర్టీసీకి వచ్చే నష్టాల మొత్తం ఈసారి కాస్త తగ్గింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లెక్కలను పరిశీలిస్తే రూ.1,986.86 కోట్ల నష్టం నమోదైంది. అంటే అంతకుముందు ఏడాది 2020-21తో పోలిస్తే రూ.342.37 కోట్ల నష్టాలు తగ్గాయి.


ఆర్టీసీ సర్వీసుల్లో కీలక మార్పులు, టికెట్ల ద్వారానే కాక, ఇతర మార్గాలతో కూడా ఆదాయం రాబట్టడం వంటి పనులతో కాస్త రాబడి పెరిగినట్లుగా తెలుస్తోంది. ఈ ఏడాది కాలంలో పోలీస్‌ బాస్‌ వీసీ సజ్జనార్‌ దిద్దుబాటు చర్యలపై దృష్టి పెట్టారు. కేవలం టికెట్ల ద్వారా కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఆదాయం రూ.245 కోట్లు వచ్చింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది రూ.100 కోట్లు ఎక్కువ.


మరోవైపు, ఆర్టీసీ సొంత బస్సుల్ని తగ్గించుకుంటూ వస్తోంది. 2020-21లో 9,459 బస్సులు నడిపింది. అందులో సొంతవి 6,544.. అద్దెవి 2,915. అంతకుముందు సంవత్సరం కన్నా 226 సొంత బస్సులు తగ్గాయి.


ఇటీవలే టికెట్ రేట్ల పెంపు, మరింత తగ్గనున్న నష్టాలు
ఇటీవలే తెలంగాణ ఆర్టీసీ టికెట్ ధరలు పెంచింది. డీజిల్‌ సెస్సు పేరుతో ఆర్టీసీ ప్రయాణికులపైనే ఆ భారం మోపుతోంది. దీని ప్రభావం దూరప్రాంతాలకు వెళ్లే వారిపై బాగా పడుతోంది. గరిష్ఠంగా రూ.170 వరకు టికెట్ రేట్లపై చెల్లించాల్సి వస్తోంది. టోల్‌ ట్యాక్స్‌ నుంచి వివిధ రకాల సర్‌ ఛార్జీలను కూడా పెంచారు. వీటి ప్రభావంతో ఆదాయం బాగానే వస్తోంది. ఫలితంగా ఈ ఆర్థిక సంవత్సరం నష్టాలు మరింత తగ్గే అవకాశం ఉంది. కరోనా సమయంలో రోజువారీగా రాష్ట్రవ్యాప్త ఆర్టీసీ ఆదాయం రూ.3 నుంచి రూ.4 కోట్ల మధ్య ఉండగా, ప్రస్తుతం ఆదాయం రూ.12 నుంచి రూ.14 కోట్లకు పెరిగింది. ఆక్యుపెన్సీ 70 శాతానికి చేరింది.