TSPSC Paper Leak Case: హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ నియామక పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ప్రత్యేక దర్యాప్తు టీమ్ మరో ముగ్గురిని అరెస్ట్ చేసింది. తాజా అరెస్టులతో పేపర్ల లీకేజీ కేసులో అరెస్టుల సంఖ్య 39కి చేరింది. డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (DAO) పేపర్ కొన్న విక్రమ్, దివ్యలతో రవి కిషోర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. విక్రమ్, దివ్యలు అన్నా చెల్లెళ్లు, కాగా వీరిది నల్గొండ జిల్లా. రవి కిషోర్ ఏఈ పేపర్ విక్రయించాడని అరెస్ట్ చేసింది సిట్. రవి కిషోర్ దాదాపు 70, 80 మందికి పేపర్ విక్రయించాడని ప్రాథమికంగా అధికారులు భావిస్తున్నారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నియామక పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తు కొనసాగుతోంది. ఓవైపు నిందితులను ప్రశ్నిస్తూనే మరోవైపు క్షేత్రస్థాయిలో సిట్ అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు. ప్రవీణ్, రాజశేఖర్ ల నుంచి రేణుకకు కొన్ని పేపర్లు వెళ్లగా.. మరికొన్ని పేపర్లను ప్రవీణ్ విక్రయించి సొమ్ము చేసుకున్నాడని అధికారులు గుర్తించారు. ఆస్తులు తాకట్టు పెట్టి కొందరు, కొడుకు ఉద్యోగం కోసం అప్పులు చేసిన తల్లిదండ్రులు, భార్యకు జాబ్ వస్తుందని భర్త.. విదేశాల నుంచి సైతం తెలంగాణకు వచ్చి టీఎస్ పీఎస్సీ ఎగ్జామ్స్ రాసినట్లు విచారణలో తేలింది.
పేపర్ల లీకుతో ఆర్థిక లావాదేవిలు..
కేసు వివరాలు పరిశీలిస్తే... ప్రధాన నిందితుడైన ప్రవీణ్ కుమార్‌కు 16 లక్షలు రూపాయలు అందాయి. అతను ఏఈ పేర్‌ను రేణుకా రాథోడ్‌కు అమ్మాడు. సోదరుడు రాజేశ్వర్ కోసం దీన్ని కొనుగోలు చేసింది. తర్వాత రాజేశ్వర్, డాక్యా నాయక్ కలిసి ఆ పేపర్‌ను మరో ఐదుగురికి బేరం పెట్టారు. ఈ ఐదుగురిలో నిలేశ్ నాయక్ 4.95 లక్షలు, గోపాల్ నాయక్ 8 లక్షలు, ప్రశాంత్ రెడ్డి 7.5 లక్షలు, రాజేంద్రకుమార్ 5 లక్షలు, వెంకట జనార్దన్ 1.95 లక్షలు ఇలా 27.4 లక్షలు ముట్టజెప్పారు. ఇందులో పది లక్షలు ప్రవీణ్‌కు ఇచ్చారు.
డీఏవో పేపర్‌ను ఖమ్మంలో ఉంటున్న సాయిలౌకిక్, సాయిసుస్మితకు ఆరు లక్షలకు అమ్మాడు ప్రవీణ్. దీంతో రెండు పేపర్లు అమ్మినందుకు ప్రవీణ్‌కు 16 లక్షలు వచ్చాయి. డాక్యానాయక్, రాజేశ్వర్‌కు 17.4 లక్షలు వచ్చినట్టు సిట్ అధికారులు తేల్చారు. వచ్చిన డబ్బులతో రాజేశ్వర్ కొన్ని కాంట్రాక్ట్ పనులు చేశాడని సిట్ అధికారులు కోర్టుకు తెలియజేశారు. మన్సూర్‌పల్లి తండాలో వీధిలైట్లు ఫిట్ చేయడం, డ్రైనేజీ పనులు పూర్తి చేశాడు. 4.5 లక్షలతో అప్పులు తీర్చాడు. మిగతా ఇద్దరు నిందితులు ప్రవీణ్, డాక్యా నాయక్ మాత్రం తమ అమౌంట్‌ను బ్యాంకులోనే ఉంచుకున్నారు. ప్రవీణ్ తన దగ్గర బంధువుకు అప్పుగా కొంత మొత్తాన్ని ఇచ్చినట్టు నివేదికలో పేర్కొన్నారు.
గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ వాయిదా వేయాలంటూ పిటిషన్లు
హైదరాబాద్ : గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా చేయాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. గత ఏడాది అక్టోబర్ లో నిర్వహించిన పరీక్షను పేపర్ లీక్ కారణాలతో ఫలితాల అనంతరం రద్దు చేయగా.. జూన్ 11న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించడానికి టీఎస్ పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. అయితే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను వాయిదా వేయాలని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. 36 మంది అభ్యర్థులు పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. రెండు నెలల పాటు గ్రూప్ 1 వాయిదా వేయాలని అభ్యర్థులు తమ పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్లను స్వీకరించిన హైకోర్టు మే 25న విచారణ చేపట్టనుంది.