TSPSC Paper Leak: టీఎస్పీఎస్సీ పరీక్ష పేపల్ లీకేజీ వ్యవహారంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ను బర్తరఫ్ చేయాలంటూ ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్లపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేపర్ లీకేజీతో తనకేం సంబంధం అని ప్రశ్నించారు. ఐటీ మంత్రి చేసే పని ఏంటో కూడా తెలియని వారు.. తనపై ఇష్టం వచ్చినట్లుగా కామెంట్లు చేయడం సరికాదన్నారు. ప్రతిపక్ష నేతలు తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా అని ఫైర్ అయ్యారు. ఇద్దరు దుర్మార్గులు చేసిన పనికి వ్యవస్థ మొత్తాన్ని తప్పు పట్టడం సరికాదన్నారు. లీకేజీ వెనక ఎవరున్నా వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం బీఆర్ కే భవన్ లో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస గౌడ్, గంగుల కమలాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రభుత్వ విప్ దాస్యం వినయ భాస్కర్ తో కలిసి కేటీఆర్ విలేఖరులతో మాట్లాడారు. ఒకరేమో ఐటీ మినిస్టర్ దే తప్పని.. ఐటీ అంటే ఏం చేస్తారో కనీసం తెలుసా మీకు అని ప్రశ్నించారు. ఐటీ మంత్రి పని ఏంటో తెలుసా, ఎప్పుడైనా ప్రభుత్వంలో పని చేసిన అనుభనం ఉందా అని అడిగారు. అలాగే హ్యాకింగ్ జరగలేదన్నారు. 






పేపర్ లీకేజీ అన్నది వ్యవస్థ వైఫల్యం కాదని.. కేవలం ఇద్దరు దుర్మార్గురు చేసిన తప్పు అని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. వాళ్లను లోపల వేశాం, వాళ్ల వెనకాల ఎవరున్నారో కూడా తవ్వి తీస్తామన్నారు. కానీ నోటికి వచ్చినట్లు మాట్లాడమేంటని.. బర్తరఫ్ చేయాలా, ఎందుకు బర్తరఫ్ చేయాలన్నారు. అసలు ఐటీ డిపార్ట్ మెంట్ కు దీంతో ఏం సంబంధం అని నిలదీశారు. గుజరాత్ లో 13 పేపర్లు లీకయ్యాయని, అక్కడ ఏ మంత్రినైనా బర్తరఫ్ చేశారా అని ప్రశ్నించారు. మధ్యప్రదేశ్ లో వ్యాపం కుంభకోణం జరిగి ముఖ్యమంత్రిపైనే ఆరోపణలు వచ్చాయని.. అసోంలో పోలీస్ రిక్రూట్ మెంట్ పేపర్ లీకైందని మరి వారు రాజీనామా చేశారా అని అడిగారు. తాము విద్యార్థుల వైపే ఉన్నామని, అనుమానాలకు తెరదించాలనే ఉద్దేశంతోనే పరీక్షలను రద్దు చేశామన్నారు. సాధ్యమైనంత త్వరగా లోపాలు లేని వ్యవస్థతో తిరిగి పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు.