హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు పంటల నష్టంపై అబద్ధాలు మాట్లాడుతున్నారని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి అన్నారు. గత ఏడాది వర్షాకాలంలో మహారాష్ట్ర, కర్ణాటక సహా తెలంగాణలో వర్షాలు అనుకున్న స్థాయిలో కురవకపోవడం వల్ల నదుల్లో నీళ్లు పారడం లేదు. బావులు, బోర్లు రీఛార్జ్ కాలేకపోయాయని, దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు లక్షల ఎకరాలు వరకు పంటలు ఎండిపోతే.. బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్, హరీష్ రావు దాన్ని పదింతలు సంఖ్య పెంచి 20 లక్షల ఎకరాలు ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని చెప్పడం అబద్ధమని చిన్నారెడ్డి పేర్కొన్నారు.


కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుందన్న భరోసా రైతుల్లో
సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం రాష్ట్ర వ్యవసాయ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొమిరెడ్డి కృపాకర్ రెడ్డి ఆత్మీయ సన్మానం కార్యక్రమంలో చిన్నారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ శాఖ అధికారులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ పొలాలు ఎండిపోయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుందన్న భరోసా రైతుల్లో ఉందని అన్నారు. కానీ రాజకీయ నిరుద్యోగులైన  కేసీఆర్, హరీష్ రావులు అనవసరంగా నానా హైరానా పడుతున్నారని, ఇది ఎందుకో అర్థం కావడం లేదన్నారు.


వర్షాభావ పరిస్థితులను బీఆర్ఎస్ అర్థం చేసుకోవడం లేదు 
పదేళ్లపాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్, హరీష్ రావు వర్షాభావ పరిస్థితులను ఎందుకు అర్థం చేసుకోవడం లేదని చిన్నారెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రాన్ని ప్రణాళికాబద్ధంగా కార్యాచరణలను రూపొందించి రాష్ట్రానికి మంచి భవిష్యత్తును ఇస్తామని చిన్నారెడ్డి వెల్లడించారు. అందుకోసం గ్రామస్థాయిలో విద్యా వైద్యం విద్యుత్ సరఫరా పాల ఉత్పత్తులు వ్యవసాయం నీటి సరఫరా ఫ్లోరీకర్ కల్చర్ స్కిల్ డెవలప్మెంట్ వంటి పలు అంశాలపై సమగ్ర మధ్యాహ్నం అధ్యయనం చేపట్టనున్నట్లు చిన్నారెడ్డి ప్రకటించారు. ఈ అధ్యయనాన్ని విశ్లేషించి ఆ తర్వాత మండల జిల్లా రాష్ట్ర స్థాయిలో వీటిని అమలు చేసేందుకు కృషి చేస్తామని చిన్నారెడ్డి తెలిపారు. 


కృపాకర్ రెడ్డి వంటి సమర్థవంతమైన నాయకత్వం వల్ల రాష్ట్రంలో వ్యవసాయ శాఖ అధికారులు ఉద్యోగులు మనస్ఫూర్తిగా విధులు నిర్వహిస్తున్నారని తద్వారా వారి సేవలు ప్రభుత్వానికి ఎంతో ఉపయోగపడుతుందని చిన్నారెడ్డి అన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్, మాజీ ఐఏఎస్ అధికారి చిత్తరంజన్ బిశ్వాస్, వ్యవసాయ శాఖ ఉద్యోగులు అధికారుల సంఘం రాష్ట్ర నాయకులు వైద్యనాథ్, కృష్ణారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, కృపాకర్ రెడ్డి, వాసుదేవ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.