TS Minister KTR Responds to Boy Tweet: మంత్రి కేటీఆర్ పొలిటికల్ గా ఎంత యాక్టివ్‌గా ఉంటారో, సోషల్ మీడియాలోనూ అంతే యాక్టివ్‌గా స్పందిస్తుంటారు. అయితే నేడు బాలల దినోత్సవం సందర్భంగా ఓ బుడ్డోడు చేసిన పనికి స్పందించిన మంత్రి కేటీఆర్ వారి సమస్యలను తీర్చడం హాట్ టాపిక్‌గా మారింది. ఓ బాలుడు ఒకే ఒక్క ట్వీట్‌తో ఏళ్లుగా ఉన్న తమ కాలనీ సమస్యకు పరిష్కారం చూపించి భేష్ అనిపించుకున్నాడు.


తాము కష్టాల్లో ఉన్నామనో, లేక భూమి వివాదంలో చిక్కుకుందని కొందరు, అనారోగ్యంతో ఉన్న కుమారుడు, కుమార్తెకు ఆపరేషన్ కోసం ఆర్థిక సాయం కావాలంటూ నిత్యం మంత్రి కేటీఆర్ కు ఎన్నో రిక్వెస్ట్‌లు సోషల్ మీడియాలో ప్రజల నుంచి వస్తుంటాయి. పొలిటికల్‌గా యాక్టివ్‌గా ఉంటూనే సోషల్ మీడియాలో బాధితుల ట్వీట్లకు స్పందించి కేటీఆర్ సమాధానం ఇస్తుంటారు. సంబంధించిన అధికారులకు పని అప్పగించి, బాధితుల సమస్యకు పరిష్కారం చూపించేవారు. నేడు బాలల దినోత్సవం సందర్భంగా ఓ బుడ్డోడు తమ సమస్యను మంత్రి కేటీఆర్‌కు తెలిసేలా చేశాడు. మంత్రి కేటీఆర్ స్పందించడంతో అధికారులు ఉరుకులు పరుగుల మీద అక్కదికి వెళ్లి ఆ బాలుడు తెలిసిన సమస్యకు పరిష్కారం సాధించాడు.


‘కేటీఆర్ అంకుల్..   మేం హైదరాబాద్‌లోని గోల్డెన్ సిటీ కాలనీలో ఉంటున్నాం. గత 5 ఏళ్లుగా మా ఏరియాకు తాగునీరు అందడం లేదు. దీంతో మేం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాం అని’ ఓ బాలుడు ప్లకార్డు ప్రదర్శిస్తున్న వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బాలల దినోత్సవం రోజు ఓ బాలుడు తమ సమస్యను చెబుతున్నాడు చూడండి కేటీఆర్ సార్ పటేల్ అనే నెటిజన్ ట్వీట్ చేశారు. వారి సమస్యను పరిష్కరించాలని జలమండలి ఎండీ దానకిషోర్‌కు మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. 






సమస్యకు పరిష్కారం చూపిన బాలుడు.. 
మంత్రి కేటీఆర్ ఆదేశాలతో రాజేంద్రనగర్, గోల్డెన్ సిటీ కాలనీకి జలమండలి ఎండీ దానకిశోర్ వెళ్లి బాలుడు ఉమర్‌ను కలిశారు. గత 5 ఏళ్లుగా తాగునీటి సమస్య ఎదుర్కొంటున్న ఆ కాలనీకి డ్రింకింగ్ వాటర్ కోసం రూ.2.85 కోట్లు మంజూరు చేసినట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు దాన కిశోర్. వర్షకాలం కారణంగా ఇక్కడ పైప్ లైన్ ప్రారంభం కాలేదని, రెండు వారాల్లో కాలనీకి తాగునీరు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అక్టోబర్ 31 వరకు పైప్ లైన్ పనులు చేపట్టలేదని, నవంబర్ నుంచి పనులు మొదలయ్యాయని, త్వరలోనే వారికి తాగునీటి సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. 5 ఏళ్ల సమస్యను బాలుడు చిల్డ్రన్స్ డే రోజు పరిష్కారం చూపించాడని కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.