TS Eamcet Results: పలు పోటీ పరీక్షలు రాస్తే అనుభవం వస్తుందని చాలా మంది ట్రయల్స్ భాగంగానే చాలా పరీక్షలు రాస్తుంటారు. అలాగే ఓ అబ్బాయి కూడా ఎంతో కొంత తెలుసుకున్నట్లు ఉంటుందని భావించి ఎంసెట్ పరీక్షలు రాశాడు. అయితే ఆయనకు అనుభవం ఎంత వచ్చిందో తెలియదు కానీ అద్భుతమైన ర్యాంకు మాత్రం వచ్చింది. ఏకంగా పదో ర్యాంకు సాధించి ప్రత్యేక ఆకర్ణగా నిలిచాడు. అతనే కోళ్లబత్తుల ప్రీతం సిద్ధార్థ్.
అసలేం జరిగిందంటే..?
హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ కు చెందిన కోళ్లబత్తుల ప్రీతం సిద్ధార్థ్ ఇటీవలే నీట్ రాశాడు. ఆ ఫలితాల కోసమే వేచి చూస్తున్నాడు. ఈలోగా ఎంతో కొంత అనుభవం వస్తుంది కదా అనుకొని ఎంసెట్ కు సిద్ధమయ్యాడు. అయితే అనుకోకుండా పదో ర్యాంకు సాధించాడు. అనుభవం కోసం మాత్రమే రాశానని.. పదో ర్యాంకు వస్తుందని అనుకోలేదని తెలిపాడు. తాను వైద్య విద్యను అభ్యసించాలనదే తన అంతిమ లక్ష్యం అని ప్రీతం సిద్దార్థ్ చెప్పుకొస్తున్నాడు. ఇతని తండ్రి హర్షవర్ధన్ న్యూరోసర్జన్ కాగా, తల్లి శాంతి గైనకాలజిస్టు. తల్లిదండ్రులు ఇద్దరూ వైద్యులే కావడంతో.. తాను కూడా డాక్టర్ కావాలని ప్రీతం చాలా కష్ట పడుతున్నాడు.
గురువారమే తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. కూకట్‌పల్లిలోని జేఎన్‌టీయూ క్యాంపస్‌లోని గోల్డెన్ జూబ్లీ సెమినార్ హాల్‌లో గురువారం (మే 25) ఉదయం 9.45 గంటలకు ఎంసెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఎంసెట్ ఫలితాల్లో మొత్తంగా 83 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో ఇంజినీరింగ్‌లో 80 శాతం ఉత్తీర్ణత నమోదుకాగా.. అగ్రికల్చర్ & ఫార్మసీ విభాగంలో 86 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో బాలురు 79 శాతం, బాలికలు 82 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇక అగ్రికల్చర్ & ఫార్మసీ విభాగంలో 84 శాతం బాలురు, 87 శాతం మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు. ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షకు 1,95,275 మంది హాజరుకాగా.. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ పరీక్షకు 1,06,514 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో అగ్రికల్చర్ & ఫార్మా విభాగంలో 91,935 మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఇంజినీరింగ్ విభాగంలో మొత్తం 1,57,879 మంది విద్యార్థులు అర్హత సాధించారు. అగ్రికల్చర్ & మెడిసిన్ కేటగిరీలోనూ టాప్-10 ర్యాంకుల్లో ఏడుగురు ఏపీకి చెందిన వాళ్లే ఉండటం గమనార్హం. ఈ విభాగంలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన బూరుగుపల్లి సత్య రాజ జశ్వంత్ ఇందులో టాపర్‌గా నిలిచాడు. రెండో స్థానంలో చీరాలకు చెందిన వెంటక తేజ రెండో ర్యాంకులో, రంగారెడ్డి జిల్లాకు చెందిన లక్ష్మీ పసుపులేటి మూడో ర్యాంకులో, గుంటూరుకు చెందిన కార్తీకేయ రెడ్డి నాలుగో ర్యాంకు, శ్రీకాకుళానికి చెందిన వరుణ్ చక్రవర్తి 5వ స్థానంలో నిలిచారు. టాప్-10లో తెలంగాణకు చెందిన వారు ముగ్గురే ఉండటం ఆశ్చర్యపరుస్తోంది.
అగ్రికల్చర్, మెడికల్ టాప్ టెన్ ర్యాంకర్లు..
1వ ర్యాంకు – బూరుగుపల్లి సత్య రాజ జశ్వంత్ (తూర్పు గోదావరి)
2వ ర్యాంకు – నశిక వెంకట తేజ (చీరాల)
3వ ర్యాంకు – సఫల్ లక్ష్మీ పసుపులేటి (రంగారెడ్డి)
4వ ర్యాంకు – దుర్గంపూడి కార్తీకేయ రెడ్డి (గుంటూరు)
5వ ర్యాంకు – బోర వరుణ్ చక్రవర్తి (శ్రీకాకుళం)
6వ ర్యాంకు – దేవగుడి గురు శశిధర్ రెడ్డి (హైదరాబాద్)
7వ ర్యాంకు – వంగీపురం హర్షిల్ సాయి (నెల్లూరు)
8వ ర్యాంకు – దద్దనాల సాయి చిద్విలాస్ రెడ్డి (గుంటూరు)
9వ ర్యాంకు – గంధమనేని గిరి వర్షిత (అనంతపురం)
10వ ర్యాంకు – కోళ్లబత్తుల ప్రీతం సిద్ధార్థ్ (హైదరాబాద్)