భారీగా డబ్బులు ఎరవేసి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించింది టీఆర్‌ఎస్.
ఫామ్‌హౌస్‌లో ఎమ్మెల్యేల కొనుగోల వ్యవహారం వెలుగులోకి వచ్చిన వెంటనే మంత్రులు, టీఆర్‌ఎస్ లీడర్లు తీవ్రంగా స్పందించారు. కొందరు మంత్రులు కేంద్రానికి, బీజేపీకి వ్యతిరేకంగా నిరసనలు కూడా చేపట్టారు.
బీజేపీ ప్రలోభాలకు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు లొంగబోరని తెలంగాణ ఎస్సీ అభివృద్ధి. మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. కేసిఆర్‌కు దేశవ్యాప్తంగా లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక మోడీ, అమిత్ షా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. వాళ్ల ఆటలు తెలంగాణలో సాగవన్నారు. రాజగోపాల్ రెడ్డి లాగా టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అమ్ముడుపోరని చెప్పారు. బీజేపీ కొనుగోలు కుట్రను ఎమ్మెల్యేలు భగ్నం చేశారని చెప్పారు.
ఎన్ని కుట్రలు చేసినా మునుగోడులో టిఆర్ఎస్ జండా ఎగరడం ఖాయమని కొప్పుల ఈశ్వర్ అన్నారు. బిజెపి ఎత్తుగడలో రాజగోపాల్ రెడ్డి ఒక పావు అన్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా అడ్డుపడ్డా.. నడ్డా వచ్చి ఇక్కడే అడ్డా వేసినా గులాబీ గెలుపును ఆపడం వారి తరం కాదన్నారు. ధన బలంతో మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ గెలవాలని కుట్ర చేస్తుందని తాము మొదటి నుంచి చెప్తున్నామని అన్నారు. మునుగోడు ఉపఎన్నికతో ఓటుతో ప్రజలు ఓటు తో బుద్ది చెప్పాలన్నారు. బీజేపీ దుష్ప్రచారం తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ఏ మొహం పెట్టుకుని బీజేపీ నేతలు ఓట్ల ఆడుగు తారన్నారు. బీజేపీ కి ఓటు వేస్తే వృథా అవుతుందని మంత్రి కొప్పుల అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఒక ప్రత్యేక చరిత్ర కలిగిందని.. కోట్లాడి సాధించుకున్న రాష్ట్రంపై ఇలాంటి రాబందులను వాలనియ్యమన్నారు దాస్యం వినయ భాస్కర్. షిండేలు, బొండేలు,ఈడీ,బోడి అన్ని కలగలుపుకొని వచ్చి ఎన్ని ఇబ్బందులకు గురి చేసిన అదే స్థాయిలో ప్రతిఘటిస్తామని హెచ్చరించారు.
ఒక్కో ఎమ్మెల్యేకు వంద కోట్ల కాంట్రాక్ట్ ఆఫర్ బీజేపీ చేస్తోందని ఆరోపించారు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్. తెలంగాణ సమాజం గుజరాత్ గులాములకు లొంగిపోదన్నారు. కోమటి రెడ్డిలా అమ్ముడుపోయే సరుకు కాదని విమర్శించారు. తెలంగాణలో ప్రజల మనసు గెలుచుకునే దమ్ములేక ఇలాంటి దుశ్చర్యలకు బీజేపీ పార్టీ పాల్పడుతుందన్నారు. తెలంగాణ సమాజం ఇలాంటి చర్యలను సహించబోదని అభిప్రాయపడ్డారు.