TRS Party Protests Against Fuel Prices Increasing: దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు, గ్యాస్ సిలిండర్ల రేట్లకు నిరసనగా నేడు టీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరసనలు చేపట్టారు. ఇందులో భాగంగా సికింద్రాబాద్ చీఫ్ రేషనింగ్ అధికారి కార్యాలయం వద్ద వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఎమ్మెల్సీ కవిత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోడ్డుపైనే గ్యాస్ సిలిండర్ ఉంచి వంట చేస్తూ నిరసన తెలిపారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. నిత్యావసరాల ధరలు పెంచుతూ ప్రజలను ఇబ్బంది పెడుతున్న మోదీని, బీజేపీని ఇంటికి పంపించే రోజులు దగ్గర పడ్డాయని విమర్శించారు. దేశం నుంచి తరిమికొట్టేవరకు బీజేపీకి బుద్దిరాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ప్రజల కోసం ప్రధాని మోదీ ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా చేపట్టలేదని విమర్శించారు. టీఆర్‌ఎస్ చేసి మంచి పనులు 150కిపైగా ఉన్నాయని గుర్తు చేశారు.
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు రెట్టింపు చేస్తూ ప్రజలపై అధిక భారం మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగితే దాని ప్రభావం ఇతర నిత్యావసర వస్తువుల ధరలపైన కూడా పడుతుందని అన్ని ధరలూ పెరుగుతాయని అన్నారు. ఎన్నికలు పూర్తయిన వెంటనే మోదీ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతున్నారని, ఈ విషయం సీఎం కేసీఆర్ 5 రాష్ట్రాల ఎన్నికలకు ముందే చెప్పారని గుర్తు చేశారు. కరోనా దెబ్బకు తోడు నిత్యావసరాల ధరలు పెరుగుతుండటంతో ఇక పేదలు బతకలేరని అన్నారు.
జీడీపీ పెంచమంటే.. ధరలు పెంచుతారా?
తెలంగాణ ఆడబిడ్డల తరఫున బండి సంజయ్ ఢిల్లీ వెళ్లి కొట్లాడాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. రాష్ట్ర ప్రజలను రోడ్లపైకి తెచ్చిన ఘనత మోదీ సర్కార్‌కు దక్కుతుందని ఆరోపించారు. జీడీపీ పెంచమంటే.. కేంద్ర ప్రభుత్వం గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచుతుందని విమర్శించారు. వరి ధాన్యం కూడా కొనకుండా తెలంగాణ రైతులు ఆందోళనలో ఉన్నారని విమర్శించారు. 2014లో పెట్రోల్ ధర రూ.60 ఉండేదని, ఆ రోజు క్రూడాయిల్ ధర ఇంకా చాలా ఎక్కువ ఉందని చెప్పారు. ఈ రోజు ముడిచమురు ధర తక్కువ ఉన్నప్పటికీ పెట్రోల్ ధరలు విపరీతంగా పెంచుతున్నారని విమర్శించారు. ఆయిల్ సబ్సిడీలు ఎత్తివేసి రూ.23 లక్షల కోట్లు కూడబెట్టారని తెలిపారు. సామాన్యులకు ఎలాంటి రుణాలు మాఫీ చేయకుండా కార్పొరేట్లకు మాత్రం ఏకంగా రూ.11 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.