TRS MLAs Poaching Case : ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంటోంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బొమ్మెరబెట్టు లక్ష్మీ జనార్దన సంతోష్‌కు సిట్ తాజాగా 41ఏ సీఆర్పీసీ నోటీసు జారీ చేసింది. ఈ నెల 21న హైదరాబాద్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది. రాకపోతే అరెస్టు చేయాల్సి వస్తుందని స్పష్టం చేసింది. బీఎల్ సంతోష్ స్వస్థలం కర్ణాటకలోని ఉడుపి కాగా.. బెంగళూరులోని మల్లేశ్వరం, టెంపుల్ స్ట్రీట్ అడ్రెస్‌తో నోటీసు జారీ అయింది.
గత నెల 26న మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో నలుగురు ఎమ్మెల్యేలతో సమావేశమైన నిందితుడు రామచంద్రభారతి పలువురు ముఖ్యనేతల పేర్లను ఉటంకించారు. నంబర్ 1, నంబర్ 2 అంటూ సంబోధించడంతోపాటు బీజేపీ అగ్రనేతలు బీఎల్ సంతోష్, సునీల్‌కుమార్ బన్సల్, కేరళ నేత తుషార్ పేర్లను పేర్కొన్నాడు. తుషార్‌కు ఇప్పటికే నోటీసు జారీ చేసిన సిట్.. బీఎల్ సంతోష్‌కూ నోటీసు పంపింది. విచారణకు వచ్చేటప్పుడు 9449831415 నంబరు సిమ్‌తోపాటు ఐఎంఈఐ నంబరు 353846108969790తో కూడిన సెల్‌ఫోన్‌ను వెంట తీసుకురావాలని సూచించింది. బన్సల్‌కు నోటీసు ఇచ్చారా? లేదా? అనే అంశంపై స్పష్టత రాలేదు.
పరారీలో జగ్గుస్వామి
ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఇప్పటికే కేరళకు చెందిన వైద్యుడు జగ్గుస్వామికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 21న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కొచ్చిలోని ఓ ఆశ్రమానికి చెందిన వైద్యకళాశాలలో పనిచేస్తున్న జగ్గు ఇంటికి సిట్ అధికారులు గత శనివారం వెళ్లారు. అయితే అప్పటికే జగ్గుస్వామి పోలీసులు వస్తున్న విషయాన్ని తెలుసుకొని పరారయ్యారు. జగ్గుస్వామి ఇంటితోపాటు కార్యాలయంలో సోదాలు చేసిన సిట్ అధికారులు పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కొచ్చి పోలీసుల సాయంతో జగ్గుస్వామి కోసం వెతికినా ఫలితం లేకపోయింది. దీంతో ఆయన ఇంటికి సిట్ అధికారులు నోటీసులు అంటించారు. బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ కేంద్రంలో ఉన్న సిట్ కార్యాలయంలో 21వ తేదీన హాజరుకావాలని పేర్కొన్నారు.
బీడీజేఎస్ అధ్యక్షుడు తుషార్ కు సైతం సిట్ అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. 5రోజుల పాటు కేరళలో దర్యాప్తు చేసిన సిట్ అధికారులు హైదరాబాద్ తిరిగి వచ్చారు. నల్గొండ ఎస్పీ రెమా రాజేశ్వరి ఆధ్వర్యంలో సిట్ అధికారులు కేరళ వెళ్లి దర్యాప్తు చేశారు.ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రామచంద్రభారతికి, బీడీజెఎస్ అధ్యక్షుడు తుషార్‌కు మధ్యవర్తిగా జగ్గుస్వామి వ్యవహరించినట్లు సిట్ అధికారుల దర్యాప్తులో తేలింది. జగ్గుస్వామి, తుషార్ ను ప్రశ్నిస్తే ఎమ్మెల్యేలకు ఎర కేసులో కీలక సమాచారం వచ్చే అవకాశం ఉంది.
సంతోష్ కీలకనేత!
ఫామ్‌హౌస్ ఎపిసోడ్‌లో సంతోష్‌ను ఆరెస్సెస్‌లో కీలకనేతగా రామచంద్రభారతి ఉటంకించాడు. ‘సంతోష్ చాలా కీలకం. నంబర్1, 2లే ఆయన ఇంటికి వస్తుంటారు. ఆయన వారి దగ్గరకు వెళ్లరు. అది మా సంస్థలో ప్రోటోకాల్. మంత్రులు కూడా అపాయింట్‌మెంట్ తీసుకుని ఆయనను కలవాలి. పెద్దసంఖ్యలో ఎమ్మెల్యేలు ఉంటే తప్ప ఆయనకు కాల్ చేసి రమ్మనడం సాధ్యం కాదు. పేమెంట్‌తో ఎలాంటి సమస్య లేదు’ అని రామచంద్రభారతి చేసిన వ్యాఖ్యలు రహస్య కెమెరాల్లో రికార్డయ్యాయి.