BTech Student Killed Over Love Affair | హైదరాబాద్: ప్రేమ వ్యవహారంలో ఓ యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. సికింద్రాబాద్‌లోని సీతాఫల్‌మండి ఇందిరానగర్ ప్రాంతంలో గురువారం రాత్రి కొందరు గుర్తుతెలియని దుండగులు బీటెక్ విద్యార్థిని టార్గెట్ చేసి కత్తులతో పొడిచి చంపారు. కత్తులతో పొడవడంతో తీవ్ర రక్తస్రావంతో యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న వెంటనే చిలకలగూడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పరిశీలించి ఆధారాలను సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ప్రేమ వ్యవహారంపై యువతి కుటుంబసభ్యులు ఆగ్రహంసికింద్రాబాద్‌లోని చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. జవహర్‌నగర్‌కు చెందిన 23 ఏళ్ల యావన్ అనే బీటెక్ థర్డ్ ఇయర్ స్టూడెంట్ గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన కత్తుల దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. గత నాలుగేళ్లుగా సీతాఫల్‌మండికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తుండటమే ఈ హత్యకు ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు. వీరి ప్రేమ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన యువతి కుటుంబ సభ్యులు, గతంలోనే యావన్‌ను పలుమార్లు హెచ్చరించినట్లు సమాచారం.
వార్నింగ్ ఇచ్చినా మారడం లేదని హత్యకు ప్లాన్
యువతి కుటుంబసభ్యుల హెచ్చరికలను లెక్కచేయకుండా యావన్ తరచూ సీతాఫల్‌మండి ఇందిరానగర్‌లోని తన ఫ్రెండ్స్ వద్దకు వస్తూ లవర్‌ను కలుస్తుండేవాడు. దీనిపై కక్ష పెంచుకున్న యువతి బంధువులు, అతడిని చంపేయాలని నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలో గురువారం రాత్రి యావన్ తన స్నేహితుడి గదిలో టీవీ చూస్తుండగా, మూడు బైక్‌లపై వచ్చిన ఆరుగురు దుండగులు ఒక్కసారిగా కత్తులతో దాడికి పాల్పడ్డారు. ప్రాణాలు కాపాడుకోవడానికి యావన్ బయటకు పరుగెత్తినప్పటికీ, నిందితులు అతడ్ని వెంబడించి అంతా చూస్తుండగానే వీధిలోనే కత్తులతో విచక్షణారహితంగా పొడిచి చంపారు. గొంతులో కత్తి పోట్లు ఎక్కువగా ఉన్నాయి.
తీవ్ర రక్తస్రావంతో యావన్ అక్కడికక్కడే మృతి చెందగా, స్థానికుల నుంచి సమాచారం అందుకున్న చిలకలగూడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్ ఆధారాలను సేకరించగా, మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. చెట్టంత ఎదిగిన కొడుకు త్వరలో చేతికి అందొస్తాడని, మంచి జాబ్ చేసి తమను పోషిస్తాడని భావించామని.. కానీ వాడి ప్రాణాలు తీశారంటూ యావన్ తల్లిదండ్రులు ఆసుపత్రి వద్ద కన్నీళ్లు పెట్టుకున్నారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు.
