జూన్ 9న శుక్రవారం నుంచి మృగశిర కార్తె సందర్భంగా నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేపప్రసాదం పంపిణీ ప్రారంభం కానుంది. శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు జరిగే కార్యక్రమానికి ఏర్పాట్లను పూర్తి చేశారు అధికారులు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో ఈ ప్రసాదం కోసం ప్రజలు తరలి వస్తారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు పంపిణీ ప్రారంభించనున్నారు. మరుసటి రోజు అంటే శనివారం ఉదయం వరకు ప్రసాదం పంపిణీ ఉంటుంది.
ఉదయం 8 గంటలకు చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం మొదలు కానుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఏర్పాట్లు పూర్తి చేసినట్టు వెల్లడించారు. దీని కోసం రాష్ట్ర నుంచే కాకుండా దేశవ్యాప్తంగా భారీగా జనం వస్తారని అన్నారు. అందుకే ఎవరికీ ఇబ్బంది లేకుండా విస్తృత ఏర్పాట్లు చేసినట్టు పేర్కొన్నారు. సాధారణ ప్రజలు, వృద్ధులు, వికలాంగులు, చిన్న పిల్లలకు వేర్వేరుగా కౌంటర్లు పెట్టామన్నారు.
చేప ప్రసాదం కోసం భారీ సంఖ్యలో జనం రానున్న వేళ ఆ పరిసరాల్లో అధికారులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలు ఇవాళ్టి(గురువారం) సాయంత్రం 6 గంటల నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ డైవర్షన్స్ శుక్రవారం అర్థరాత్రి 12 గంటల వరకు అమల్లో ఉంటాయి. పరిస్థితి బట్టి మార్పులు చేర్పులు చేస్తామని పోలీసు అధికారులు చెప్పారు.
ఎంజే మార్కెట్ నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వైపు వెళ్లే వెహికల్స్ను అబిడ్స్ జీపీవో, నాంపల్లి స్టేషన్ మీదుగా పోనిస్తారు. బేగంబజార్ ఛత్రి, ఎంజే బ్రిడ్జి నుంచి నాంపల్లి వైపు వచ్చే వెహికల్స్ను దారుసలాం, ఏక్ మినార్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. అసెంబ్లీ జంక్షన్ నుంచి నాంపల్లి స్టేషన్, అఫ్జల్‌గంజ్ వైపు వచ్చే వెహికల్స్ ను బషీర్బాగ్ ఏఆర్ పెట్రోల్ పంప్, బీజేఆర్ విగ్రహం మీదుగా డైవర్ట్ చేస్తున్నారు.
చేప ప్రసాదం తీసుకునేందుకు వచ్చే వారి కోసం ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యం కల్పించారు పోలీసులు. నాంపల్లిలోని గృహకల్ప, గగన్ విహార్, చంద్రవిహార్, ఎంఏఎం గర్ల్స్ జూనియర్ కాలేజీ, ఇంటర్ బోర్డు వద్ద వాహనాలు పార్క్ చేసుకోవచ్చు. భారీ వాహనాలను మాత్రం గోషామహాల్ పోలీస్ స్టేడియంలో పార్క్ చేయాలి. బైక్లను భీమ్ నగర్, గృహకల్ప, బీజేపీ ఆఫీస్ వద్ద మాత్రమే పార్క్ చేయాలి. పాస్‌లు ఉన్న వీఐపీలు తమ వాహనాలను సీడబ్ల్యూసీ గోడౌన్స్ పార్కింగ్ ఏరియాలో ఉంచాలి.