TPCC Chief Revanth Reddy:
అభ్యర్థుల విషయంలో అధికార బీఆర్ఎస్ పార్టీ కంటే కాంగ్రెస్ ముందుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. టీ కాంగ్రెస్ 55 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించగా.. బీఆర్ఎస్ మాత్రం కేవలం 51 మందికే బీ ఫారాలు ఇచ్చారని రేవంత్ గుర్తుచేశారు. కాంగ్రెస్ గ్యారంటీలను బీఆర్ఎస్ తమ మేనిఫెస్టోగా ప్రకటించిందని సెటైర్లు వేశారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను డిక్లరేషన్ రూపంలో.. వరంగల్ లో రైతు డిక్లరేషన్, ఖమ్మంలో వృద్ధాప్య పింఛన్ల డిక్లరేషన్, హైదరాబాద్ లో విద్యార్థి నిరుద్యోగుల కోసం యువ డిక్లరేషన్ ప్రకటించాం. సెప్టెంబర్ 17 తుక్కుగూడ సభలో సోనియా గాంధీ 6 గ్యారంటీలను తెలంగాణ ప్రజలకు ఇచ్చిన తరువాత సీఎం కేసీఆర్ కనిపించకుండా పోయారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 


బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల తరువాత రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. చలి జ్వరం కారణంగా కేసీఆర్ కనిపిస్తలేరని మంత్రి కేటీఆర్ చెప్పింది నిజమని నమ్మాం. కానీ కేసీఆర్ కు శాశ్వతంగా విశ్రాంతి ఇవ్వాలన్నారు. తొమ్మిదేళ్లు పాలన గాలికొదిలేసి, కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు ఎలా వసూలు చేయాలి, మైనింగ్, ఇసుక దోపిడీ నుంచి వసూళ్ల పర్వం, సహజ వనరులను కొల్లగొట్టం, గంజాయి, డ్రగ్స్ నుంచి వచ్చే ఆదాయాన్ని ఎలా లెక్కగట్టుకోవాలి అనే పనులతో బిజీగా ఉండటం వల్ల కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నారని మేం భావించాం. మా మేనిఫెస్టో వచ్చిన తరువాత మీరు చూస్తారు అని మంత్రులు కేటీఆర్, హరీష్ రావు మాట్లాడారు. కానీ ఈరోజు బీఆర్ఎస్ మేనిఫెస్టో గమనిస్తే.. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలను కేసీఆర్ కాపీ కొట్టారని ఆరోపించారు. 


మహాలక్ష్మీ పేరుతో తాము రూ.2500 ఇస్తామంటే, బీఆర్ఎస్ రూ.3000 అని పేర్కొంది. ఆడబిడ్డలకు రూ.500కు సిలిండర్ ఇస్తామని చెబితే, వాళ్లు రూ.4000కు ఇస్తామని చెబుతున్నారు.  పింఛన్లు మేం రూ.4 వేలు ఇస్తామంటే, బీఆర్ఎస్ రూ.5000 అని హామీ ఇచ్చింది. ఇందిరమ్మ భరోసా కింద రైతులకు పెట్టుబడి కింద ఏడాదికి ఎకరానికి రూ.15 వేలు, రైతు కూలీలకు రూ.12 వేలు ఇస్తామని చెబితే.. కేసీఆర్ రూ.16 వేలు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. సారాయి వేలం పాట జరిగినట్లుగా కాంగ్రెస్ గ్యారంటీలను కాపీ కొట్టి పెద్ద లోయలో పడిపోయారని చెప్పారు. కేసీఆర్ ఆలోచన శక్తి కోల్పోయారని, ఇక బీఆర్ఎస్ సొంతంగా ఆలోచించలేదని.. పరాన్నజీవిలా కాంగ్రెస్ లాంటి పార్టీ మీద ఆధారపడి మేనిఫెస్టోలు తయారుచేశారని నేడు నిరూపితమైందన్నారు. గత రెండేళ్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను కాపీ కొట్టి బీఆర్ఎస్ మేనిఫెస్టో రూపొందించారని విమర్శించారు. కాపీ కొట్టడానికి కూడా కేసీఆర్ అనర్హుడు అని, మేం ఇచ్చిన హామీలను చూసి అవి ఎలా నిధులు ఎలా వస్తాయని ప్రశ్నించిన బీఆర్ఎస్ నేడు మేనిఫెస్టోలో అంతకుమించి ప్రకటనలు చేసి ప్రజలను మోసం చేసినట్లు నిరూపితమైందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.


తొమ్మిదిన్నరేళ్లలో దోచుకున్న లక్షల కోట్లతో ప్రతిపక్ష కూటమి అభ్యర్థులకు ఖర్చు చేస్తానని కేసీఆర్ చెప్పడం నిజం కాదా అని ప్రశ్నించారు. I.N.D.I.A కూటమిలో చేర్చుకోవాలని కోరితే కేసీఆర్ ను మెడలుపట్టి గెంటేశామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ హామీలకు బడ్జెట్ సరిపోదని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసిన కేసీఆర్ ఇప్పుడు అంతకుమించి ఎక్కువ నిధులతో హామీలు ఎలా ఇచ్చారు అని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఓటమిని అంగీకరించిన కేసీఆర్ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ కనిపించారన్నారు. కేసీఆర్ ఎక్స్ పైరీ డేట్ వచ్చేసిందని, ఎన్నికల బరి నుంచి తప్పుకుని విశ్రాంతి తీసుకోవడం మంచిదని సలహా ఇచ్చారు. కేసీఆర్ ఆరోగ్యంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ క్షీణించిందని, రాజకీయాల నుంచి సీఎం తప్పుకోవడం బెటర్ అన్నారు.