TPCC Chief Revanth Reddy: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొత్త సెక్రటేరియట్ కు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. దాంతో టెలిఫోన్ భవన్ వద్ద ఓ గంటపాటు ఉద్రిక్తత నెలకొంది. రేవంత్ రెడ్డికి పర్మిషన్ లేని కారణంగా ఆయనను సచివాలయానికి వెళ్లనిచ్చేది లేదని పోలీసులు స్పష్టం చేశారు. పోలీసులతో వాగ్వివాదం అనంతరం రేవంత్ రెడ్డి అక్కడినుంచి అసహనం వ్యక్తం చేస్తూ వెళ్లిపోయారు. ప్రజా ప్రతినిధిని, ఎంపీని అయిన తనకే సెక్రటేరియట్ లోకి అనుమతి లేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. కొత్త సెక్రటేరియట్ లోకి ఎంపీ అయిన తనకే ఎంట్రీ లేదని, సామాన్యుల పరిస్థితి ఏంటని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తాను మునిసిపల్, హెచ్.ఎం.డి.ఎ అధికారులను కలిసి సమాచార హక్కు కింద దరఖాస్తు చేయడానికి వెళ్తున్నానని చెప్పినా పోలీసులు అనుమతించలేదు. ఉద్దేశపూర్వకంగానే బీఆర్ఎస్ ప్రభుత్వం తనను అడ్డుకుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.


పోలీసులు ముందుకు వెళ్లేందుకు అనుమతించకపోవడంతో టెలిఫోన్ భవన్ నుంచి వెళ్లిపోయిన తరువాత కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఓఆర్ఆర్ ను నిర్మించిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అన్నారు . హైదరాబాద్ నగరానికి మణిహారం ఓఆర్ఆర్ అన్నారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉండాలని, హైదరాబాద్ లో ఏ మూల నుంచి ఏ మూలకు చేరుకోవాలన్నా కొన్ని కిలోమీటర్ల దూరం తగ్గి ఓఆర్ఆర్ ప్రయోజనంగా నిలిచిందన్నారు. బెంగళూరు హైవే, విజయవాడ, ముంబై లాంటి జాతీయ రహదారులను కలవాలన్నా సిటీలోకి ఎంటర్ కాకుండా ఔటర్ రింగ్ రోడ్డు నుంచే అక్కడికి చేరుకునేలా కాంగ్రెస్ పార్టీ ఓఆర్ఆర్ నిర్మించిందని గుర్తుచేశారు. ఔటర్ రింగ్ రోడ్డుపై ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తే, అన్ని కి.మీకే చెల్లించేవారన్నారు. గతంలో మినిమం రూ.10గా ఉంటే, ఆ తరువాత ప్రభుత్వం దాన్ని రూ.40కి పెంచిందన్నారు. 






రోజుకూ రూ.2 కోట్ల ఆదాయం వస్తుంది. ఏడాదికి రూ.700 నుంచి రూ.750 కోట్ల ఆదాయం వచ్చే ఔటర్ రింగ్ రోడ్డును.. ఏడాదికి రూ.246 కోట్లకు కేసీఆర్ ప్రభుత్వం బొంబాయి కంపెనీకి కట్టబెట్టిందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో రాష్ట్రానికి ఏడాదికి రూ.500 కోట్ల మేర నష్టం వాటిల్లుతుందన్నారు. ఇలా ముప్పై ఏళ్లకు లెక్కకడితే కొన్ని వేల కోట్ల అవినీతి జరిగినట్లు తేలుతుందన్నారు. అసలు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అంచనాలు వేసింది, బొంబాయి కంపెనీకి ఎలా కట్టబెట్టిందని ప్రశ్నించారు. ప్రతి ఏడాది ఓఆర్ఆర్ ఆదాయం పెరిగింది. 2014లో ఓఆర్ఆర్ పై ఏడాదికి రూ.100 కోట్ల ఆదాయం వచ్చేదన్నారు. ఏడు, ఎనిమిది సంవత్సరాలలో దీనిపై వచ్చే ఆదాయం రూ.700 కోట్లకు చేరుకుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కానీ అతి తక్కువ మొత్తానికి లీజుకు ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి నిదర్శనం అంటూ మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన మరుక్షణమే మొత్తం టెండర్ల పై విచారణ చేయిస్తాం, ఇందులో ఎవరినీ వదిలే ప్రసక్తి లేదన్నారు.