కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా చేస్తున్న తమ పోరాటం ఆగబోదని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. పటిష్ఠ సైనికులుగా తయారు చేసేందుకు 6 నెలల ట్రైనింగ్ ఏం సరిపోతుందని ప్రశ్నించారు. శత్రువుల నుంచి దేశాన్ని కాపాడే జవాన్లను అవమనించేలా మోదీ సర్కారు వ్యవహరిస్తోందని అన్నారు. అగ్నిపథ్ పథకం ద్వారా యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలోని మల్కాజ్ గిరి జంక్షన్ లో నిర్వహించిన సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్న రేవంత్‌ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ప్రసంగించారు.


రైతులను, జవాన్లను సమాజాన్ని నిర్మించే శక్తులుగా కాంగ్రెస్ పార్టీ వారిని గుర్తించిందని అన్నారు. ప్రైవేటు సంస్థలైన అంబానీ, ఆదానీలకు దోచి పెట్టేందుకే ఈ అగ్నిపథ్ పథకాన్ని తెరపైకి తెచ్చారని విమర్శించారు. నాలుగేళ్లు దేశ భక్తితో సైన్యంలో పని చేసి, ఆ తర్వాత వారు జీవిత కాలం కార్పొరేట్ సంస్థలకు, బడా పారిశ్రామిక వేత్తలకు కాపలా కాయలా? అని నిలదీశారు. అగ్నిపథ్‌ వల్ల సాధారణ సైనికులకు ఉండేలా ఉద్యోగ భద్రత లేదని, మాజీ సైనికుల హోదా కూడా కనీసం లేదని రేవంత్ రెడ్డి తెలిపారు. పింఛను కూడా ఇవ్వడం లేదని చెప్పారు.


సికింద్రాబాద్ అల్లర్ల సందర్భంగా తెలంగాణ యువతపై పెట్టిన కేసులను ఎత్తేయాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను ఢిల్లీలో ఉన్న కేటీఆర్‌ కోరాలని డిమాండ్ చేశారు. పార్టీలకు అతీతంగా ఆ యువకులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌ అంటే కాంగ్రెస్‌ తెచ్చిన స్వాతంత్య్రాన్ని ఫణంగా పెట్టడమా? అని ప్రశ్నించారు. కోటి జనాభా లేని ఇజ్రాయెల్‌తో 130 కోట్ల జనాభా ఉన్న భారత్‌ను పోలుస్తారా? అంటూ విమర్శించారు.


కేసీఆర్‌ వైఖరి చెప్పాలని డిమాండ్
అగ్నిపథ్‌ నుంచి రిటైరయ్యాక యువకులకు ఏ ఉద్యోగాలు వస్తాయని రేవంత్ రెడ్డి నిలదీశారు. ఉద్యోగాలు లేక వారు పక్కదారి పడితే అందుకు బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నించారు. సికింద్రాబాద్ అల్లర్ల విషయంలో నిరసన తెలిపిన వారికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు న్యాయ సాయం చేయడం లేదని ప్రశ్నించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీ తెలంగాణకు వచ్చినప్పుడు అగ్నిపథ్‌పై తమ వైఖరిని తెలపాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అలాగే తాము కూడా నిరసన వ్యక్తం చేస్తామని వెల్లడించారు.