సుమారు మూడు నెలల నుంచి కొండ మీద కూర్చున్న టమాటా ధర నెమ్మదిగా కిందకి దిగి వస్తుంది. కొద్ది రోజుల నుంచి మార్కెట్లో టమాటా దిగుబడి పెరగడంతో ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌ లోని రైతు బజార్ లలో ప్రస్తుతం లోకల్‌, హైబ్రిడ్‌ రకాల టమాటా కిలో రూ.39 కే లభ్యమవుతుంది. 


ఇప్పటికే రిటైల్‌ దుకాణాల్లో కేజీ రూ.50 నుంచి 60 కి అమ్ముతున్నారు. జూన్‌ లో కురిసిన భారీ వర్షాల కారణంగా ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకలతో పాటు చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాల్లో సాగు చేసిన టమాటా పంట దెబ్బతింది. 


దీంతో ఆ రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌ కు దిగుమతి అయ్యే టమాటా రేట్లను ఏజెంట్లు, వ్యాపారులు ఇష్టారాజ్యంగా పెంచేశారు. దీంతో టమాటా రేట్లు ఆమాంతం పెరిగిపోయాయి. అంతకు ముందు టమాటా ధర 10 నుంచి 20 రూపాయలు మాత్రమే ఉండేది. 


వాతావరణం సహకరించకపోవడం వల్లే టమాటాల ధర విపరీతంగా పెరిగిపోయిందంటూ వ్యాపారస్తులు తెలిపారు. ఏప్రిల్‌ లో కిలో రూ.35 ఉన్న టమాటా రేటు జులై మధ్యకి వచ్చేసరికి కొన్ని చోట్ల రూ. 150 ఉంటే..మరికొన్ని చోట్ల 200 రూపాయలకు కూడా చేరుకుంది. 


కొద్ది రోజుల క్రితం కూడా హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో కేజీ రూ.180 కి కూడా అమ్మారు. ప్రస్తుతం వర్షాలు సాదారణ స్థితికి రావడంతో పాటు టమాటా దిగుబడి కూడా బాగా పెరగడంతో ధరలు తగ్గుముఖం పట్టాయి.