హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి సమీపంలో తీవ్ర విషాదం నెలకొంది. నిర్మాణంలో భవనం గోడ కూలిన దుర్ఘటనలో ముగ్గురు కార్మికులు మృతి చెందారు. కూకట్‌పల్లిలోని అడ్డగుట్టలో ఈ విషాదం చోటు చేసుకుంది. 


నిర్మాణంలో ఉన్న భవనం కూలి ముగ్గురు మృతి చెందిన ఘటన హైదర్ నగర్ డివిజన్ అడ్డగుట్టలో చోటు చేసుకుంది. అడ్డగుట్టలో దాసరి సంతోష్, దాసరి శ్రీరామ్ అనే వ్యక్తులు సర్వే నెంబర్ 176పి, 177పి,188పిలోని 668 గజాలలో నిర్మాణం చేపట్టారు. దీనికి కూకట్ పల్లి జీహెచ్ఎంసీ అధికారులు స్టిల్ట్ ప్లస్ 5 అంతస్థుల నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు. 


ఇప్పటికే ఐదు అంతస్థులు పూర్తి చేసుకున్న ఈ నిర్మాణంలో పైన ఉన్న ప్రహారీ గోడ కడుతున్న క్రమంలో పక్కకు ఒరిగిన గోడ ఒక్కసారిగా కూలింది. దీంతో ఆ కట్టపై ఉండి పనిచేస్తున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన ఐదుగురు కూలీలు అక్కడి నుండి కిందకు పడిపోయారు. ఈఘటనలో సంతోష్, సోనీ అనే ఇద్దరు కార్మికులు స్పాట్‌లో మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఇంకొకరు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు