మరో దక్కన్ మాల్‌ని తలపించింది స్వప్నలోక్ అగ్నిప్రమాదం! గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న కరెంటు ప్యానెల్‌ ఒక్కసారిగా పేలిపోయింది! దాంతో మంటలు చెలరేగాయి. బట్టల షాపులు ఎక్కువగా ఉండే మాల్లో అగ్నికి ఆజ్యం తోడైంది. అసలే పాత బిల్డింగ్, ఇరుకిరుకు షాపులు! ఆపై రాత్రిపూట మంటలు! ఒక భయానక వాతావరణం అలుమకుంది! ఎంజీరోడ్డు, ప్యాట్నీ సెంటరు, ప్యారడైజ్ సర్కిల్‌ భయంగుప్పిట్లోకి జారుకున్నాయి. ఎప్పుడూ సందడిగా ఉండే ఆ ఏరియా హాహకారాలతో దద్ధరిల్లిపోయింది!    


మొత్తం ఎనిమిది ఫ్లోర్లున్న స్వప్నలోక్‌లో కాంప్లెక్సులో 4 ,5,  6, ఫ్లోర్లలో మంటలు చెలరేగాయి. దట్టంగా పొగలు వ్యాపించాయి. నిమిషాల్లో భవనాన్ని అగ్నికీలలు చుట్టుముట్టాయి. ప్రమాదం జరిగినప్పుడు  25 మంది చిక్కుక్కపోయారని ఫైర్ సిబ్బంది చెబుతున్నారు. శ్రీనివాస్ అనే వ్యక్తి ఫైర్ కంట్రోల్ రూమ్‌కి రాత్రి 7.30 గంటలకు కాల్ చేశాడు. అతని కాల్ ఆధారంగా హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అప్పటికే భవనం వెనుక నుంచి పొగలు రావడాన్ని వాళ్లు గమనించారు.


మంటల తీవ్రత ఎక్కువగా ఉందని గ్రహించిన అధికారులు వెంటనే మరిన్ని వాహనాలను తీసుకురావాలని నిర్ణయించారు. 2 బ్రాంటో స్కై లిఫ్ట్‌లు, 1 సైమన్ స్నోకెల్, 1 రెస్క్యూ టెండర్‌తో సహా 12 వాహనాలను ఆగమేఘాల మీద తెప్పించారు. 10 ఫైర్ ఇంజిన్లను డెప్లాయ్ చేశారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడం వల్ల దాదాపు 15 మంది ప్రాణాలతో బయటపడ్డారు.  దట్టమైన పొగల వల్ల  కొంతమందికి శ్వాసఆడక  సొమ్మసిల్లి పడిపోయారు. కొంతమందికి సిబ్బంది సీపీఆర్ చేసి ప్రాణాలు పోశారు. రెస్క్యూ చేసిన వారిని దగ్గర్లోని యశోద ఆసుపత్రికి తరలించారు.  


అర్ధరాత్రి వరకు మంటలు చెలరేగుతునే ఉన్నాయి. ఘటనా స్థలం దగ్గరికి మంత్రులు తలసాని, మహమూద్ అలీ, మేయర్ విజయలక్ష్మీ చేరుకున్నారు. డీసీపీ సుమతి రెస్క్యూ పనులను పర్యవేక్షించారు.    హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఆమోయ్  కుమార్ అధికారులను కోఆర్డినేట్ చేశారు. అగ్ని ప్రమాదంలో రక్షించిన వారిలో కొందరిని గాంధీ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న వారిని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పరామర్శించి ధైర్యం చెప్పారు.    


అర్ధరాత్రి వరకు అందిన సమాచారం ప్రకారం స్వప్నలోక్ కాంప్లెక్స్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మృతులు:  శివ, ప్రశాంత్, ప్రమీల, శ్రావణి, వెన్నెల, త్రివేణిగా గుర్తించారు. వీళ్లంత ఎక్కడివారు, ఏం చేస్తుంటారనేది తెలియరాలేదు. అందరూ ఐదో అంతస్తులో మంటల్లో చిక్కుకుని ప్రాణాలు విడిచారు. అదే ఫ్లోర్లో ఉన్న మరో ఏడుగురిని రెస్క్యూ చేశారు. బయటకి వచ్చిన వారు : శ్రవణ్‌, దయాకర్‌, పవన్‌, భారతమ్మ, గంగయ్య, రవి, సుధీర్ రెడ్డి. వీళ్లందరినీ ఫైర్ సిబ్బంది ప్రాణాలతో బయటకి తీసుకొచ్చారు.  


మినిస్టర్​ రోడ్డులోని డెక్కన్​మాల్​ అగ్నిప్రమాదం నుంచి తేరుకోకముందే సికింద్రాబాద్‌లో అలాంటిదే మరో ఘటన జరగడం జంటనగరవాసులను కలరవపెడుతోంది. దక్కన్ మాల్ ప్రమాదంలో ముగ్గురు చనిపోయారని తేల్చారు. జనవరి 20న జరిగిన ఆ ఘటన అంతులేని విషాదాన్ని మిగిల్చింది. ఐదంతస్థుల భవనం పూర్తిగా కాలిపోయింది. ఆ బిల్డింగ్ ఎందుకూ పనికిరాదని తేల్చిన తరువాత ఆ భవనాన్ని భారీ యంత్రాల సహాయంతో ఫిబ్రవరి 5న నేలమట్టం చేశారు.