ఉమ్మడి మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ జిల్లాల టీచర్స్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ బలపరచిన అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి విజయం సాధించారు. సమీప PRTUTS అభ్యర్థి గుర్రం చెన్నకేశవ రెడ్డిపై సుమారు 1,150 ఓట్ల తేడాతో గెలిచారు. గురువారం అర్ధరాత్రి 1.40 గంటలకు లెక్కింపు పూర్తయింది.
హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో సాయంత్రం 5 గంటలకు మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తవగా ఏ అభ్యర్థికీ సరైన మెజార్టీ (50 శాతానికి మించి) రాలేదు. అనంతరం రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు మొదలైంది. మూడో స్థానంలో ఉన్న TSUTF అభ్యర్థి పాపన్నగారి మాణిక్ రెడ్డికి వచ్చిన 6,079 ఓట్లను రెండో ప్రాధాన్యత ఆధారంగా మొదటి రెండు స్థానాల్లోని అభ్యర్థులకు సర్దుబాటు చేయడంతో ఏవీఎన్ రెడ్డి విజయం సాధించారు.
గెలుపుపై ఉత్కంఠ
మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో PRTU అభ్యర్థి చెన్నకేశవ రెడ్డిపై ఏవీఎన్ రెడ్డి 921 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మ్యాజిక్ ఫిగర్ 12,709 కాగా.. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో గెలుపు నిర్ధారణ కాలేదు. దీంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును అధికారులు ప్రారంభించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో తక్కువ ఓట్లు వచ్చిన వారిని ఎలిమినేషన్ చేశారు. ఈ ఎన్నికల బరిలో మొత్తం 21 మంది అభ్యర్థులు ఉన్నారు.
ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయంటే
మొదటి ప్రాధాన్యత ఓట్లు ఓసారి పరిశీలిస్తే.. ఎన్నికల అధికారులు విడుదల చేసిన వివరాల ప్రకారం.. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో మొత్తం 21 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వీరిలో ఏవీఎన్ రెడ్డికి 7505 ఓట్లు (మొదటి ప్రాధాన్యత) రాగా, గుర్రం చెన్నకేశవ రెడ్డికి 6,584 ఓట్లు వచ్చాయి. యూటీఎఫ్ అభ్యర్థి మాణిక్ రెడ్డి 4,569 ఓట్లు పొందారు. మాజీ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్థన్‌రెడ్డికి అతి తక్కువగా 1,236 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక మరికొంత మంది అభ్యర్థులు హర్షవర్థన్ రెడ్డికి 1,907 ఓట్లు రాగా, భుజంగరావు 1,103 ఓట్లు వచ్చాయి. కాసం ప్రభాకర్‌కు 764 ఓట్లు సాధించగా, ఎ.వినయ్ బాబు 568 ఓట్లు సాధించారు. ఎస్ విజయ్ కుమార్ 313 ఓట్లు సాధించగా, లక్ష్మీ నారాయణ 212 ఓట్లు , ఎ. సంతోష్‌కుమార్ 160 ఓట్లు, అన్వర్‌ఖాన్ 142 ఓట్లు, డి.మల్లారెడ్డి 69, ప్రొఫెసర్ నథానియ ల్ 98, మేడిశెట్టి తిరుపతి 57, జి. వెంకటేశ్వర్లు 47, చంద్రశేఖర్‌రావు 41, పార్వతి 20, కె. సత్తెన్న 6, ఎల్ వెంకటేశ్వర్లు 14 ఓట్లు పొందగా, త్రిపురారి అనంతనారాయణ్ కు ఒకే ఓటు వచ్చాయి.
ఎక్కువగా చెల్లని ఓట్లు గుర్తింపు
మహబూబ్‌నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆసక్తికర విషయాలు గుర్తించారు. టీచర్లకు సరిగా ఓటు వేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెల్లని ఓట్లు 452 వరకూ నమోదయ్యాయి.