Sigachi Incident : సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో సిగాచీ పరిశ్రమలో సరిగ్గా పదిరోజుల క్రితం సంభవించిన భారీ పేలుడుతో 44మంది కార్మికుల ప్రాణాలు కొోల్పోయారు. ఇంకా 16 మంది వేరు వేరు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. పోయిన ప్రాణాలు తిరిగి తీసుకురాలేరు. కనీసం కుటుంబ సభ్యులకు మృతదేహాలు అప్పగించడంలోనూ సిగాచీ యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించింది. నేటికీ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 8 మంది కార్మికుల మృతదేహాలు లభించలేదు. వారి ఆనవాళ్లు దొరకలేదు. కనీసం బూడిదైనా ఇవ్వండి మహా ప్రభో అంటూ పదిరోజులుగా ఫ్యాక్టరీ ముందు పడిగాపులు పడ్డ కుటుంబ సభ్యులు బరువెక్కిన గుండెలతో బోరున విలపిస్తున్నారు. చివరి చూపు చూడలేదు. అంతిమ సంస్కారలైనా చేస్తే, మా బిడ్డల ఆత్మశాంతిస్తుందని కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసి, చూసి ఓపిక నశించి అలసిపోయారు.
జస్టిన్, అఖిల్, వెంకటేష్, ఇన్ఫాన్ అన్సారీ, రాహుల్, శివాజీ, విజయ్, రవి ఇలా ఈ ఎనిమిది మంది సిగాచీ ప్రమాదం జరిగిన సమయంలో డ్యూటీలో ఉన్నారు. పేలుడు జరిగిన సమయంలో విధులు నిర్వహిస్తున్నట్లుగా కుటుంబ సభ్యులకు ఇచ్చిన సమాచారం ఆధారంగా స్పష్టమవుతోంది. అయితే పేలుడు తరువాత వీరి ఆచూకీ నేటికీ తెలియలేదు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కుటుంబ సభ్యుల డిఎన్ ఏ లు పలుమార్లు సేకరించినా ఫలితంలేదు. ఆ ఎనిమిది మంది మృతదేహాలు గుర్తించడం మా వల్లకాదంటూ తాజాగా క్లారిటీ ఇచ్చిన అధికారులు, కుటుంబ సభ్యుల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు 15లక్షలు ముట్టజెప్పి మీ ఇళ్లకు వెళ్లండంటూ తాత్కాలికంగా చేతులు దులుపుకున్నారు. తిరిగి మూడు నెలల తరువాత మేమే పిలుస్తామంటూ చెప్పి పంపించారు.
ఈ మొత్తం వ్యవహారంపై ఆచూకీ దొరకని మృతుల కుటుంబ సభ్యుల వాదన మరోలా ఉంది. మృతదేహాల వెలికితీతలో మొదటి నుంచి తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తున్నారు. సాధ్యమైనంత వేగంగా శిథిలాల తొలగింపు చేయాల్సి ఉండగా, నెమ్మదిగా తొలగింపు ప్రక్రియ జరగడంతో మృతదేహాల గుర్తింపు కష్టమవ్వడంతోపాటు, మాంసపు ముద్దలుగా విడిపోవడం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పది రోజులైనా ఆచూకీ లభించకపోవడంతో ఇప్పుడు మావల్ల కాదంటూ చేతులెత్తేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదంలో మృతుల ఆచూకీ లభించలేదని సర్టిఫికేట్ ఇవ్వమని వారి కుటుంబ సభ్యులు అడిగినా పట్టించుకోవడంలేదు. మేము నిర్దారించము, మూడు నెలల తరువాత రండి అప్పుడు చూద్దామంటూ తేల్చిచెప్పడం దిక్కుతోచని స్దితిలో ఆచూకీ దొరకని 8 మందికి చెందిన కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా వెనుదిరిగి తమ సొంత రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు.
నేటికీ సిగాచీ యాజమాన్యం ఘటనా స్దాలానికి చేరుకోలేదు. డబ్బుతో ఏదైనా సాధ్యమే అన్నట్లుగా యాజమాన్యం తీరు కనిపిస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పరిహారం ప్రకటించాం. మృతదేహాల కోసం ఆలోచించాల్సిన పనేలేదు అన్నట్లుగా వ్యవహరించిందనే ఆరోపణలు వెల్లుతెత్తున్నాయి.
ఐదు నెలల క్రితమే పెళ్లైన ఉప్పల్ కు చెందిన అఖిల్ ఫ్యాకర్టీలోకి వచ్చినట్లు భార్యకు మెసేజ్ పెట్టిన పదినిమిషాల్లోనే బ్లాస్ట్ జరిగింది. తండ్రికి ఏకైక ఆధారంగా ఉన్న జస్టిన్ ఇక తిరిగి రాడని తెలిసిన తండ్రి దిక్కుతోచని స్దితిలో బోరున విలపిస్తున్నాడు. శ్రీకాకుళం నుంచి ఉపాధి కోసం వచ్చిన వెంకటేష్ పరిస్దితి మరింత దయనీయం. తండ్రిని కంటికి రెప్పలా కాపాడుకునే వెంకటేష్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడనే వార్త టివిలో చూసి నిర్ఘాంతపోయారు. సిగాచీ వద్దకు వచ్చిన తండ్రి, కాళ్లరిగేలా తిరిగి , బిడ్డకోసం చూసిన ఎదురు చూపులు ఇంకా సిగాచీ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తునే ఉన్నాయి. నా బిడ్డ ఎముకలైనా ఇవ్వండైయ్యా అని వేడుకున్నా ఆలకించేవారు లేరు.
ఇలా సిగాచీ ప్రమాదంలో మిసైన మృతుల కుటుంబసభ్యుల హృదయవిదారక రోదనలు అంతులేనివి. ఇవన్నీ పట్టనట్లుగా వ్యవహించిన యాజమాన్యం చివరకు డబ్బు ఇచ్చి పంపుతున్నామంటూ వ్యవహరించిన తీరు, కనీసం అంతిమ సంస్కారాలు కూడా చేసుకునే అవకాశంలేని దుస్దితి, బాధితుల కుటుంబాలకు అంతులేని గుండెకోతను మిగల్చింది.