Telangana Cabinet: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన తెలంగాణ మంత్రిమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేసేందుకు ఆమోదం తెలిపింది. అనంతరం రెండు ప్రైవేటు యూనివర్శిటీల ఏర్పాటుకు ఓకే చెప్పింది. ఇందులో తెలంగాణ విద్యార్థులుకు 50 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని తీర్మానం చేసింది.

రాష్ట్రంలో సగం జనాభాకు మించి ఉన్న బీసీలకు మంత్రి వర్గం గుడ్ న్యూస్ చెప్పింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42  శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మార్చి నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును ప్రభుత్వం ఆమోదించింది. విద్య,ఉద్యోగాలతోపాటు స్థానిక సంస్థల్లోనూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ ప్రాతినిధ్యం కల్పించే 2 బిల్లులను ఆమోదించింది.

పంచాయతీ ఎన్నికల అంశంపై  హైకోర్టు నెలాఖరులోపు  రిజర్వేషన్స్ ఖరారు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వీటన్నింటినీ చర్చించిన మంత్రివర్గం స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బీసీ డెడికేటేడ్ కమిషన్ నియమించింది. 

రాష్ట్ర ప్రణాళిక విభాగం అధ్వర్యంలో కుల గణన చేపట్టింది. వీటి ఆధారంగానే అసెంబ్లీలో 42 శాతం రిజర్వేషన్ల బిల్లును ఆమోదం చేసుకుంది. అందుబాటులో ఉన్న ఎంపిరికల్ డేటా ఆధారంగా, జనాభా ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేసేందుకు తదుపరి చర్యలు చేపట్టాలని తీర్మానించింది. 

బీసీల రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు గ్రామ పంచాయతీ సర్పంచ్, ఎంపీటీసీలకు మండలం యూనిట్‌గా, ఎంపీపీ, జడ్పీటీసీలకు జిల్లా యూనిట్‌గా, జడ్పీ ఛైర్మన్లకు రాష్ట్రం యూనిట్‌గా పరిగణిస్తారు.

బీసీ రిజర్వేషన్ల పెంపునకు అనుగుణంగా రాష్ట్రంలో అమల్లో ఉన్న పంచాయతీరాజ్ చట్టం-2018 సవరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. త్వరలోనే ఈ చట్టంలో చేయాల్సిన సవరణలకు అవసరమైన చర్యలు చేపడుతుంది ప్రభుత్వం. 

రాష్ట్రంలో కొత్తగా 2 ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు కేబినేట్ ఆమోదం తెలిపింది. అమిటి(AMITY) యూనివర్సిటీ, సెయింట్ మేరీ రిహాబిలిటేషన్ (Saint Marys Rehabilitation) యూనివర్సిటీలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. AMITY యూనివర్సిటీలో తెలంగాణ విద్యార్థులకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలనే నిబంధన విధించింది.