TGSRTC MD Sajjanar | ఆర్టీసీ సిబ్బంది కేవలం మనల్ని గమ్యస్థానాలకు చేర్చడమే కాదు, అవసరమైతే ఓ కుటుంబసభ్యుడిలా ప్రయాణికులను ఆదుకుంటారని ఇటీవల జరిగిన ఘటన నిరూపించింది. బస్సులో ప్రయాణిస్తున్న ఓ బాలుడికి అకస్మాత్తుగా ఛాతీలో నొప్పి రావడంతో సకాలంలో స్పందించి ఆర్టీసీ డ్రైవర్లు సమపర్యలు చేయడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనపై టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పందించారు. ఆర్టీసీ యాజమాన్యం తరఫున విద్యార్థి ప్రాణాలు కాపాడిన తమ సిబ్బందిని సజ్జనార్, మరికొందరు ఉన్నతాధికారులతో కలిసి సన్మానించారు.


బ‌స్సులో గుండె నొప్పితో బాధ‌ప‌డుతున్న విద్యార్థికి స‌కాలంలో వైద్య సాయం అందించిన త‌మ సిబ్బందిని తెలంగాణ ఆర్టీసీ (TGSRTC) యాజ‌మాన్యం అభినందించింది. బైంసా డిపోన‌కు చెందిన కండ‌క్ట‌ర్ జి.గంగాధ‌ర్‌, అద్దె బస్సు డ్రైవ‌ర్ బి.గంగాధ‌ర్‌ను హైదరాబాద్ బస్ భవన్ (Hyderabad Bus Bhavan) లో బుధ‌వారం ఉన్నతాధికారులతో కలిసి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఘనంగా సన్మానించారు. ఆర్టీసీ సిబ్బందికి న‌గ‌దు బ‌హుమ‌తులు సైతం అంద‌జేశారు.


అసలేం జరిగిందంటే..


సెప్టెంబర్ 9న బైంసా నుంచి నిర్మ‌ల్‌కు బ‌స్సు వెళ్తోంది. దిలావ‌ర్‌పూర్ వ‌ద్ద‌కు రాగానే 12 ఏళ్ల విద్యార్థి కిర‌ణ్‌కు ఒక్క‌సారిగా గుండె నొప్పి (Chest Pain) వ‌చ్చింది. ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన కండ‌క్ట‌ర్ జి.గంగాధ‌ర్ అప్ర‌మ‌త్త‌మై బ‌స్సును ప‌క్క‌కు ఆపాలని సూచించారు. డ్రైవ‌ర్ బి.గంగాధ‌ర్‌తో క‌లిసి బాలుడు కిరణ్‌కు ప్రాథ‌మిక చికిత్స‌ అందించారు. సీపీఆర్ చేశారు. అనంతరం కిర‌ణ్‌ను ఆర్టీసీ బ‌స్సులోనే స‌మీపంలో ఉన్న న‌ర్సాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి త‌ర‌లించారు. సకాలంలో ఆస్ప‌త్రికి తీసుకురావడంతో విద్యార్థి కిర‌ణ్‌కు ప్రాణాప్రాయం త‌ప్పింద‌ని డాక్టర్లు తెలిపారు.


సమయస్పూర్తితో వ్యవహారించి 12 ఏళ్ల విద్యార్థి ప్రాణాల‌ను కాపాడిన కండ‌క్ట‌ర్ బి.గంగాధ‌ర్‌, డ్రైవ‌ర్ బి.గంగాధ‌ర్ ల‌ను ఈ సందర్భంగా TGSRTC ఎండీ సజ్జనార్ మెచ్చుకున్నారు. ఆపద సమయంలో సేవాతర్పరతను ఆర్టీసీ సిబ్బంది చాటుతుండటం గొప్ప విషయమని కొనియాడారు. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు.. ఆపద సమయంలో తాము ఉన్నామని భరోసా కల్పించినందుకు సిబ్బందిని ఆయన అభినందించారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఆర్టీసీ సీవోవో డాక్టర్ రవిందర్, జాయింట్ డైరెక్ట‌ర్ అపూర్వ‌రావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మునిశేఖర్, ఫైనాన్స్ అడ్వ‌ైజ‌ర్ విజ‌య‌పుష్ఫ‌, బైంసా డిపో మేనేజ‌ర్ హ‌రిప్ర‌సాద్, చీఫ్ ట్రాఫిక్ మేనేజ‌ర్ శ్రీదేవి, చీఫ్ ప‌ర్స‌న‌ల్ మేనేజ‌ర్ ఉషాదేవి, త‌దితరులు పాల్గొన్నారు.


Also Read: Revanth Reddy: ఆక్రమణదారులు జైలుకే- స్వచ్చందంగా వదలుకోకుంటే చర్యలు తప్పవు- హైడ్రాపై సీఎం రేవంత్ సంచలన కామెంట్స్