TGSRTC Bus Pass Charges :తెలంగాణలో బస్‌పాస్ ఛార్జీలు పెరిగాయి. సోమవారం కొత్త రేట్లు అమలులోకి వచ్చాయి. ఆర్టీసీలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు కారణంగా బస్‌పాస్ ఛార్జీలను 20నుంచి 24 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంటున్నట్టు టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటించింది. మూడేళ్ల నుంచి పెంచకుండానే నెట్టుకొని వస్తున్నామని ఇప్పుడు తప్పడం లేదని పేర్కొంది. పెరిగిన ఖర్చుల కారణంగా ఇప్పుడు ప్రజలపై భారం మోపాల్సి వచ్చిందని తెలిపింది. అన్ని రకాల బస్ పాస్‌లపై ఛార్జీలు పెంచుతున్నట్టు ఆర్టీసీ స్పష్టం చేసింది.
ప్రయాణికులపై టోల్ భారం తెలంగాణ ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. టోల్ గేట్ ఉన్న రూట్‌లో ప్రయాణికులు అధనంగా మరో పది రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. టోల్ ఛార్జీని కూడా ప్రయాణికుల నుంచి రాబట్టే ప్రయత్నాల్లో ఆర్టీసీ ఉంది. టోల్ గేట్ ఉన్న రూట్‌లలో యూజర్ ఛార్జీ కింద ఒక్కో టికెట్‌పై పది రూపాయలు వసూలు చేస్తామని ఆర్టీసీ ప్రకటించింది.
విద్యార్థులకు గుడ్ న్యూస్ఇప్పటి వరకు పాస్ ఉన్న విద్యార్థులకు కేవలం ఆర్డినరీ సర్వీస్‌లో మాత్రమే అనుమతి ఇచ్చే వాళ్లు. ఇప్పుడు మహిళలకు ఉచిత పథకం అమలు అవుతున్నందున మార్పులు చేర్పులు చేశారు. సిటీ బస్సుల్లో విపరీతంగా రద్దీ ఉంటోంది. అందుకే ఆర్డినరీతోపాటు మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోకి విద్యార్థుల పాస్‌లు అనుమతి ఇస్తారు. అంటే విద్యార్థులు ఇప్పుడు హైదరాబాద్‌లో తిరగే మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో కూడా పాస్ చూపించి ట్రావెల్ చేయవచ్చు.
ఏ బస్ పాస్ ఎంత పెరగనుంది?విద్యార్థుల బస్‌పాస్ ఛార్జీ ఇప్పటి వరకు 400 రూపాయలుగా ఉంది. దాన్ని ఇప్పుడు 600కు పెంచారు. మిగతా పాస్‌లు గురించి చూస్తే ఆర్డినరీ పాస్ ఇప్పటి వరకు 1150 రూపాయలు వసూలు చేస్తుననారు. దాన్ని ఇప్పుడు 1400 చేశారు. ఎక్స్‌ప్రెస్ పాస్ 1300 నుంచి 1600 రూపాయలు చేశారు. మెట్రో డీలక్స్ 1450 నుంచి 1800 రూపాయలకు పెంచారు. గ్రీన్ మెట్రో బస్, లగ్జరీ బస్, ఏసీ బస్ పాస్‌లు 1800 నుంచి 2000 రూపాయలు చేశారు. ఈ పాస్‌లకు జీఎస్టీ అదనంగా వసూలు చేస్తారు.
ఈ పెంపును వెంటనే వెనక్కి తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే వివిధ రకాల భారం ప్రజలపై వేస్తున్నారని ఇప్పుడు టికెట్ రూపంలో మరో భారం వేయడం ఏంటని నిలదీస్తున్నాయి. ఇప్పటికే కళాశాలలు ప్రారంభమయ్యాయి. 12నుంచి స్కూల్స్ ప్రారంభమవుతున్నాయి. ఇలాంటి టైంలో పెంపు సరికాదని అభిప్రాయపడుతున్నాయి.