Jogulamba Gadwal District :జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్దధన్వాడ ప్రజలు మరోసారి భగ్గుమన్నారు. వ్యతిరేకిస్తున్నా ఇథనాల్ పరిశ్రమ పెట్టేందుకు ప్రయత్నించడాన్ని అడ్డుకున్నారు. ఆ సంస్థ కార్యకలాపాలు చేపట్టడంపై భగ్గుమంటున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 గ్రామాల ప్రజలు తిరుగుబాటుతో మరోసారి ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యవహారం చర్చనీయాంశమైంది.
పెద్దధన్వాడ వద్ద ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ రాజోలి మండలంలోని పది గ్రామాల ప్రజలు ధర్నాలు చేస్తున్నారు. ఏడాది కాలంగా చేపడుతున్న ఆందోళనలు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. ఇన్ని రోజులు ఎలాంటి హడావుడి లేకపోయినా ప్రజలు మాత్రం ఆందోళన బాట వీడలేదు. ఫ్యాక్టరీ పూర్తిగా తరిమివేసే వరకు తగ్గేదేలే అన్నట్టు భీష్మించారు. కానీ బుధవారం నాడు ఒక్కసారిగా పరిశ్రమకు చెందిన వ్యక్తుల రావడంతో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. కంపెనీకి చెందిన సామగ్రిని ధ్వంసం చేశారు.
గాయత్రి కంపెనీ పెద్దధన్వాడ గ్రామ శివారులో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు సన్నాహాలు చేసింది. ప్రభుత్వ అనుమతితో గత అక్టోబర్‌లో పనులు చేపట్టేందుకు యత్నించింది. అప్పట్లోనే దీన్ని ఆ ప్రాంత ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆందోళన వ్యక్తం చేశారు. తమ ప్రాణాలు తీసే పరిశ్రమ ఏర్పాటు చేయొద్దని నినాదాలు చేశారు. అక్కడి నుంచి తరలించాలని విజ్ఞప్తి చేస్తూ ప్రజాప్రతినిధులు, అధికారులకు వినతి పత్రాలు ఇచ్చారు.
ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ధర్నాలు, ఆందోళనలు చేస్తూ వినతి పత్రాలు ఇస్తున్నా ప్రభుత్వం నుంచి, అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో జనవరిలో రిలే దీక్షలు చేశారు. ఆందోళన తీవ్రతరం అవుతున్న టైంలో ప్రభుత్వం స్పందించింది. కాంగ్రెస్ లీడర్లు ప్రజలతో వెళ్లి చర్చించారు. జిల్లా ఉన్నతాధికారుల సమక్షంలో ఈ చర్చలు జరిగాయి. ప్రజల ఆగ్రహాన్ని ఆవేదన గమనించిన ప్రజాప్రతినిధులు, అధికారులు పనులు ఆపుతున్నట్టు ప్రకటించారు. పనులు ఆపడం కాదని ఫ్యాక్టరీయే తరలించాలని డిమాండ్ చేశారు. దీనిపై ప్రభుత్వంతో చర్చిస్తామని అన్నారు.
పనులు ఆపిన అధికారులు ఫ్యాక్టరీ తరలింపుపై మాత్రం ఇంత వరకు తేల్చలేదు. కానీ మళ్లీ ఫ్యాక్టరీ పనుల్లో కదలిక వచ్చింది. బుధవారం పరిశ్రమకు చెందిన వ్యక్తులు వచ్చి అక్కడ చర్యలు చేపట్టారు. దీన్ని గ్రహించిన పెద్దధన్వాడ మరోసారి ఆగ్రహంతో ఊగిపోయారు. పనులు ఆపాలంటూ రోడ్డుపై ధర్నాలు చేశారు. కంపెనీకి చెందిన వ్యక్తులను అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది. పనులు ఆపేస్తున్నట్టు అధికారులు చెప్పారని ఇప్పుడు ఎలా మొదలు పెడతారని ప్రశ్నించారు. చిన్న పెద్ద అంతా స్పాట్‌కు చేరుకొని పనులు జరగనీయకుండా అడ్డుకున్నారు.
ఉద్రిక్తత ఎక్కువ కావడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ధర్నా చేస్తున్న వారిని అక్కడి నుంచి తీసుకెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో తోపులాట చోటు చేసుకుంది. కొందరు కిందపడిపోయారు. వారికి గాయాలు అయ్యాయి. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు విధ్వంసానికి దిగారు. పరిశ్రమ సిబ్బంది పనులు చేస్తున్న ప్రాంతంలో ఉన్న సామగ్రిని ధ్వంసం చేశారు. గుడారాలు పీకేశారు. కంటెయినర్‌కు నిప్పుపెట్టారు. జేసీబీ, కార్లు, టిప్పర్ ధ్వంసం చేశారు. పనులు చేయడానికి వచ్చిన కూలీలను తరిమేశారు.
పోలీసులు అతికష్టమ్మీద ఆందోళనలను అదుపు చేశారు. నిరసనల్లో విధ్వంసానికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆందోళనకారులను అరెస్టు చేసిన విషయం తెలుసుకున్న అంలపూర్ ఎమ్మెల్యే విజయుడు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. ఆందోళనకారులను పరామర్శించారు. అయితే తమను పోలీసులతో కాకుండా ఫ్యాక్టరీ సిబ్బందితో వచ్చిన బౌన్సర్‌లు కొట్టారని ఫిర్యాదు చేశారు. దీనిపై ఆయన మండిపడ్డారు. బౌన్సర్లతో ఆందోళనకారులను కొట్టించడం ఏంటని నిలదీశారు. ఆందోళనకారులపై చేయి చేసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.