హైదరాబాద్: తెలంగాణలో బిజెపి నేతలంతా ఓ దారి, గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ మాత్రమే మరోదారిలో వెళ్తారు. ఇది తెలంగాణ బిజెపిలో ఇప్పుడేదో కొత్తగా వినిపిస్తున్నమాట కాదు. రాజసింగ్ అంటే అంతేమరి , కొరకరాని కొయ్యకంటే ఇంకాస్త ముదురు ఈ ఎమ్మెల్యే. తాజామీగా రాజసింగ్ తీరు మరోసారి పార్టీలో సునామీ సృష్టించింది. నా నోరు..నా ఇష్టం.. ఏదైనా ఓపెన్ గా మాట్లడేస్తా.. అదిష్టానం గీత దాటినా తగ్గేదేలే.. బారాబర్ కడిగిపారేస్తానంటున్నారు రాజాసింగ్.
నాకే నోటీసులిస్తారా.. ఇవ్వండి చూద్దాం.. మీ జాతకాలు బయటపెడతా.. ఇదీ రాజాసింగ్ సొంత పార్టీ కీలక నేతలపై చేసిన తాజా వ్యాఖ్యలు. సోషల్ మీడియాలో రాజాసింగ్ చేసిన ఈ కామెంట్స్ తెలంగాణ బిజెపిని కుదిపేస్తున్నాయి. ఇంతకీ రాజసింగ్ ఎందుకంతలా రెచ్చిపోయారంటే..
రాజాసింగ్ ఆగ్రహానికి కారణం..?
ఇటీవల బిఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవిత మీడియా చిట్ చాట్ లో మాట్లడుతూ తాను జైలులో ఉన్నప్పుడు బిజెపిలో బిఆర్ ఎస్ విలీనం చేసేందుకు ప్రయత్నం చేశారు.నేనే అడ్డుపడ్డానంటూ తెలంగాణ రాజకీయాల్లో అగ్గిపుట్టించిన సంగతి తెలిసిందే. కవిత వ్యాఖ్యలను దాదాపు తెలంగాణ బిజెపి నేతలంతా ఖండించారు. మాకు ఆ పార్టీని విలీనం చేసుకోవాల్సిన అవసరంలేదు. అలాంటి ప్రయత్నమే జరగలేదన్నారు. కానీ ఒక్క బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ మాత్రం అధిష్టానం మైండ్ బ్లాక్ అయ్యేలా కవిత వ్యాఖ్యలపై స్పందించారు. మా పార్టీ నేతలకు మంచి ప్యాకేజి ఇస్తే బిఆర్ ఎస్ లో కలిసిపోతారంటూ సొంతపార్టీ నేతలకే కర్రు కాల్చి వాతపెట్టినంత పనిచేశారు.
ఈ వ్యాఖ్యలు బిజెపి రాష్ట్ర క్యాడర్ కు చిర్రెత్తుకొచ్చింది. పార్టీ లైన్ దాటి రాజాసింగ్ మాట్లడుతున్నారంటూ పార్టీలో చర్చజరిగింది. అధిష్టానానికి ఫిర్యాదు చేసింది. ఇంకేముంది రేపో మాపో రాజాసింగ్ కు నోటీసులిస్తారంటూ మీడియాలో వరుస కథనాల హోరెత్తాయి. ఈ నేపధ్యంలో తాజాగా రాజాసింగ్ మరో అడుగు ముందుకేసి ఈసారి పార్టీనేతలు సైతం ఊహించని స్దాయిలో రెచ్చిపోయారు.
నాకు నోటీసులు ఇవ్వడం కాదు.. దమ్ముంటే నన్ను పార్టీ నుండి సస్పెండ్ చేయండి చూద్దాం అంటూ ఈసారి ఎర్ర జెండా ఎత్తారు. ఈ సందేశాన్ని ఎక్కడా మీడియా కెమెరాల ముందు మాట్లడకుండా వాట్సప్ ద్వారా మీడియాకు చేరవేశారు. బిజెపి హైకమాండ్ తనపై ఎటువంటి చర్యలు తీసుకున్నా సిద్దమేనంటూ సంకేతాలిచ్చారు. అటూ,ఇటూ కానోళ్లతో కలసి పాార్టీని బలోపేతం చేయలేమంటూ రాష్ట్ర పార్టీలో కీలక నేతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.నన్ను పార్టీ నుండి సస్పెండ్ చేస్తే , ఎవరి వల్ల తెలంగాణలో బిజెపి నష్టపోయిందో, వారి జాతకాలు బయటపెట్టిమరీ పార్టీ నుండి బయటకు వెళతానంటూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం.
రాజాసింగ్ ను సస్పెండ్ చేస్తారా..!
రాజాసింగ్ తాజా వ్యాఖ్యలు బిజెపిలో తీవ్ర దుమారం రేపుతుంటే , కాంగ్రెస్ పార్టీకి మాత్రం విమర్శనాస్త్రంగా మారింది. ముందు మీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాటలకు , విమర్శలకు సమాధానం చెప్పండి అంటూ తాజాగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లడారంటే పరిస్దితి అర్దం చేసుకోవచ్చు. అంతలా రాజాసింగ్ తీరు బిజెపికి కొరకరాని కొయ్యలా మారింది. అలా అని ఇప్పటికిప్పుడు రాజాసింగ్ ను సస్పెండ్ చేస్తారా అంటే, అంత సీన్ లేదనే సమాధానం వినిపిస్తుంది. రాజాసింగ్ పై చర్యలు తీసుకోవాలంటే కేంద్ర పెద్దల చేతిలో వ్యహరం. ఇప్పటికిప్పడు పార్టీలో ఓ ఎమ్మెల్యేను సస్పెండ్ చేసేలా కేంద్ర పార్టీ పెద్దలు నిర్ణయం ఉండకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై దృష్టిసారించిన బిజెపి అధిాష్టానం మాత్రం పార్టీ నేతలకు చుప్ రహో అన్నట్లు సమాచారం. ఇప్పటి వరకూ చేసింది చాలు. మీరు అలా ఉండండి. పార్టీ లైన్ దాటి విమర్శలు చేయోద్దు. రాాజాసింగ్ వ్యాఖ్యలపై ఏం చేయాలో మాకు తెలుసంటున్నారట. తెలంగాణలో బిజెపి ప్రవాహానికి ఎదురీదుతున్న రాజసింగ్ కు , పార్టీ కేంద్ర పెద్దలు నోటీసులు ఇస్తారా లేదా లైట్ తీసుకుంటారా చూడాలి.