Russia: రష్యా ఉక్రెయిన్ యుద్ధం సంవత్సరాల తరబడి సాగేలా ఉంది. ఇప్పటికే ఇరువైపులా వేలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయినా  ఎవరూ వెనక్కి తగ్గేలా లేరు. అయితే రోజులు గడిచే కొద్దీ సైనికులు సంఖ్య తరిగిపోవడంతో...రష్యా(Russia) అత్యవసర రిక్రూట్ మెంట్ ప్రారంభించింది. అయితే అందుకు స్వదేశంలో ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో ఇతర దేశాల నుంచి వచ్చే వలస కూలీలపై దృష్టిసారించింది. గల్ఫ్ దేశాలకు వలస వచ్చే కూలీలపై కన్నేసిన రష్యా...వారికి ఉపాధి కల్పిస్తామని నమ్మబలికి తమ దేశాని తీసుకెళ్లి తీరా అక్కడికి వెళ్లిన తర్వాత ఆర్మీ డ్రెస్ లు ఇచ్చి తుపాకీలు చేతికివ్వడంతో వారు నివ్వెరపోయారు.  ఓ అటవీప్రాంతంలోవారికి  ఆర్మీ ట్రైనింగ్ ఇస్తున్నారు. తెలంగాణ నుంచి దుబాయ్ కి ఉపాధి కోసం వెళ్లిన  ఓ యువకుడు అక్కడి ఏజెంట్ చేతిలో మోసపోయి రష్యా(Russia) ఆర్మీ చేతికి చిక్కాడు.


నారాయణపేట టూ రష్యా వయా దుబాయ్
ఉపాధి కోసం తెలుగు రాష్ట్రాల నుంచి గల్ఫ్ దేశాలకు చాలమంది వెళ్తుంటారు. కొన్ని దశాబ్దాలుగా  ఏజెంట్ల చేతిలో మోసపోవడమో లేక అక్కడి వెళ్లిన తర్వాత షేక్ ల అరాచకాలకు బలైపోవడమో జరుగుతుంటుంది. కానీ ఇప్పుడు గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారిని అక్కడి ఏజెంట్లు వేరే దేశాలకు గంపగుత్తగా అమ్మేస్తున్నారు. పూర్వకాలంలో  బానిసలను ఇదే విధంగా ఇతర రాజ్యాలకు అమ్మేసేవారు..ఇప్పుడు గల్ఫ్ దేశాలకు ఉపాధి నిమిత్తం వెళ్లిన వారి పరిస్థితి అలాగే ఉంది.  నారాయణపేట(Narayanapet)కు చెందిన ఓ యువకుడు జీవనోపాధి కోసం దుబాయ్‌(Dubai) వెళ్లి అక్కడ ఓ ఏజెంట్‌ చేతిలో మోసపోయాడు. బలవంతంగా రష్యా(Russia) ఆర్మీలో చేరి ఉక్రెయిన్‌ సరిహద్దులో శిక్షణ పొందుతున్నాడు. నారాయణపేట వాసి మహ్మద్‌ సూఫియాన్‌  జీవనోపాధి కోసం రెండేండ్ల కిందట దుబాయ్‌ వెళ్లాడు. అక్కడి ఎయిర్‌పోర్టులో ప్యాకింగ్‌ విభాగంలో పనిచేస్తున్న సూఫియాన్‌ను బాబా అనే ఏజెంట్‌ సంప్రదించాడు. రష్యాలో సెక్యూరిటీ గార్డు ఉద్యోగం ఉన్నదని, మంచి జీతం ఇస్తారని నమ్మబలికాడు. సూఫియాన్‌తోపాటు మన దేశంలోని ఇతర రాష్ర్టాలకు చెందిన మరికొందరిని నమ్మకంగా అక్కడికి పంపించాడు. ఆ తర్వాత తెలిసింది వారికి తాము మోసపోయామని...


రష్యా సైనిక శిక్షణ
సెక్యూరిటీ గార్డు ఉద్యోగమనుకుని రష్యాలోకి అడుగుపెట్టిన తెలుగువారు  గుండెలు అదిరిపోయే వార్త విన్నారు. మీరు ఇక నుంచి రష్యా సైనికులు...వెళ్లి ఉక్రెయిన్ తో యుద్ధం చేయండంటూ  తుపాకులు చేతిలోపెట్టడంతో  వారంతా అవాక్కయ్యారు. తుపాకీ ఎలా వాడాలి..శత్రువులను ఏ విధంగా సంహరించాలో  తెలిపేలా  వారికి కొంతకాలం  రష్యా ఆర్మీ శిక్షణ కూడా ఇచ్చింది. ఓ మారుమూల అటవీ ప్రాంతంలో వారికి శిక్షణ ఇస్తుండగా....అక్కడి నుంచే  దొంగచాటుగా  తెలంగాణ యువకుడు వీడియో తీసి బంధువులకు షేర్ చేశాడు. తాము మోసపోయామని ప్రస్తుతం రష్యా ఆర్మీ చేతిలో ఉన్నామని తన కష్టాలను వివరించాడు.  విషయం సూఫియాన్‌ కుటుంబసభ్యులకు తెలియడంతో అతనితో మాట్లాడేందుకు ఫోన్ లో ప్రయత్నించినా  వీలుపడలేదు. ఎలాగైనా సూఫియాన్‌ను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వేడుకొంటున్నారు. దీనిపై కేంద్రం స్పందించింది. వారిని అక్కడి నుంచి విడిపించేందుకు మాస్కోలోని భారత రాయబార కార్యాలయం నిరంతరం ప్రయత్నిస్తున్నట్టు విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ శుక్రవారం వెల్లడించారు.