BJP NEWS: తెలంగాణ (Telangana)అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లాపడిన బీజేపీ(BJP) కనీసం పార్లమెంట్ ఎన్నికల్లో అయినా పరువు నిలుపుకునేందుకు  తీవ్రంగా కష్టపడుతోంది. కొత్త సీట్ల సంగతి ఎలా ఉన్నా ఉన్నవాటిని కాపాడుకోవడంపై దృష్టి సారించింది. ఇప్పటికే విజయసంకల్ప యాత్ర పేరిట రాష్ట్రవ్యాప్తంగా  ఆపార్టీ ప్రచార రథాలు పరుగులెడుతుండగా...అభ్యర్థుల ఎంపికపై కేంద్ర అధిష్టానం దృష్టిసారించింది.అభ్యర్థుల జాబితా ఇప్పటికే సిద్ధం కాగా..వీటిపై చర్చించేందుకు నేడు తెలంగాణ నేతలతో అమిత్ షా(Amith Sha) కీలక భేటీ నిర్వహించనున్నారు. 


బీజేపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి చివరి నిమిషం వరకు అభ్యర్థులను తేల్చకపోవడమూ ఓ కారణమని బీజేపీ(BJP) భావిస్తోంది. అభ్యర్థులను ఖరారు చేయకపోవడంతో...ప్రచారానికి ఎక్కవు సమయం లేకుండా పోయిందని ఆ పార్టీ పెద్దలు భావిస్తున్నారు. అందుకే ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థుల జాబితా ముందుగానే ప్రకటించేందుకు  కమలదళం కసరత్తు చేస్తోంది. ఆ దిశగా ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టిన రాష్ట్ర నాయకత్వం లోక్ సభ అభ్యర్థుల జాబితాను ఢిల్లీ(Delhi)కి పంపింది.  ముందుగానే అభ్యర్థుల విషయంలో క్లారిటీ ఇవ్వాలని భావిస్తోంది. ఢిల్లీ అధిష్టానం ఈ ఆశావహుల జాబితాపై చర్చించేందుకు  రాష్ట్ర నాయకులను ఢిల్లీకి పిలిపించింది.
బలబలాలేంటి
ఢిల్లీలో నేడు తెలంగాణ(Telangana) నేతతలో కేంద్రమంత్రి అమిత్ షా(Amith Sha) కీలక సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్ర నాయకత్వం పంపిన ఆశావహుల జాబితాపై చర్చించనున్నారు. అభ్యర్థుల బలబాలాలు, సామాజిక వర్గం, ఆర్థికస్థితిగతులు, పార్టీ పరంగా ఉన్న కమిట్ మెంట్ అన్ని అంశాలపైనా చర్చించనున్నారు. 


అమిత్ షా నివాసంలో జరిగే ఈ భేటీలో  బీజేపీ జాతీయాధ్యక్షులు జేపీ నడ్డా (J.P.Nadda)కూడా పాల్గొననున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy), జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్(Bandi Sanjay),  పార్లమెంటరీ బోర్డు సభ్యులు  లక్ష్మణ్, తెలంగాణ ఇంచార్జులు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, చంద్రశేఖర్ వారితో పాటు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, నేషనల్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు ఈటల రాజేందర్ కూడా హాజరయ్యే అవకాశం ఉంది.


ఒక్కో నియోజకవర్గానికి మూడు పేర్లు
గత పార్లమెంట్ ఎన్నికల సమయానికి తెలంగాణలో బీజేపీ అంత బలంగా లేకున్నప్పటికీ అనూహ్యంగా  4 పార్లమెంట్ స్థానాలు గెలుచుకుని సత్తా చాటింది. దీంతో తెలంగాణలో పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులజాబితా రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్పటికే ఆశావహుల పేర్లు కేంద్ర అధినాయకత్వానికి  చేరగా....నేడు జరిగే సమావేశంలో ప్రతి నియోజకవర్గానికి మూడు పేర్లతో జాబితా రూపొందించనున్నారు. వచ్చేవారంలో జరగనున్న బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో చర్చించి వారిలో ఒకరిని ఫైనల్ చేయనున్నారు. ఈ సమావేశంలోనే దేశవ్యాప్తంగా బీజేపీ పోటీచేయనున్న అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. వాటిల్లో తెలంగాణ నుంచి సగానికి పైగా అభ్యర్థులు ఉండేలా కసరత్తు చేస్తున్నారు. అభ్యర్థులను ముందుగానే ప్రకటించి తెలంగాణ వ్యాప్తంగా ప్రచారం ముమ్మరం చేసేలా బీజీపే రాష్ట్ర నాయకత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. తెలంగాణలో అభ్యర్థుల తరపున ఢిల్లీ పెద్దలతోపాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం ప్రచారానికి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.